ఇలా చేస్తే ఎక్కువకాలం బతికేయొచ్చు.. రీసెర్చ్‌లో వెల్లడైంది కూడా
మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, మీరు మీ జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వ్యక్తులు ఆరోగ్యకరమైన తిండి, నిద్రవేళలను కచ్చితంగా కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి
►ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి నిద్ర ప్రణాళిక అవసరం. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొనడం వంటి స్థిరమైన నిద్ర షెడ్యూల్‌ను పాటించడం మీకు ఎక్కువ కాలం జీవించడంలో ఉపకరిస్తుంది. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవద్దు. ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని అదే సమయంలో కచ్చితంగా నిద్రించాలి. అంతేకాదు, రోజూ ఒకే సమయంలో నిద్ర నుంచి మేలుకోవాలి.
► కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలం జీవించాలనుకుంటే, మీ మెదడు, శరీరాన్ని పునరుద్ధరించడానికి ప్రతి రాత్రి 8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర మీ మెదడు పనితీరు, రోగనిరోధక శక్తి, శక్తి స్థాయులను మెరుగుపరుస్తుంది. చెదిరిన లేదా కలత నిద్ర మీ మెదడు పనితీరును, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
► విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. దీనివల్ల మీ మనస్సుకే కాదు, శరీరానికి కూడా రోజంతా హాయిగా ఉండేందుకు అవసరమైన విరామం లభిస్తుంది. మీరు దీన్ని ఎలా చేస్తారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది.
► ప్రపంచంలోని చాలా మంది ప్రజలు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. వారు క్రమం తప్పకుండా నడవడం, పుస్తకం చదవడం, వెచ్చని చామంతి టీ తాగడం వంటివి చేస్తారు. ఆనందంగా ఉండటమే.. ఎక్కువ కాలం జీవించేందుకు కారణం.
► సుదీర్ఘ జీవితాన్ని గడపడంలో మీ ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా తినొద్దు. సరైన సమయంలో తగినంత తినడం శరీర బరువును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు అల్పాహారం, మధ్యాహ్న భోజనం మీకు నచ్చినట్లుగా తినవచ్చు. రాత్రి భోజనాన్ని మితంగా తీసుకోవచ్చు.
►కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.