పవర్‌ప్లాంట్ అనుమతి రద్దు చేయాలి : భాను
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్‌పై యాక్టివ్ పవర్ కార్పొరేషన్‌కు చెందిన జల విద్యుత్ కేంద్రానికి తిరిగి అనుమతి ఇవ్వడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం ఒక ప్రకటనలో తప్పుపట్టారు. ఈ నిర్ణయం వల్ల బుడమేరుకు వరద వస్తే పలు గ్రామాలతో పాటు విజయవాడ నగరంలో 16 డివిజన్లు నీట మునుగుతాయని హెచ్చరించారు. యాక్టివ్ పవర్‌ప్లాంట్ వల్ల ఎన్టీటీపీఎస్ కూడా నష్టపోతుందని ఆయన విమర్శించారు.
ఏడాది పొడవునా నడిచే వీలున్న ప్రాజెక్టును ప్రభుత్వమే నడపడం వల్ల ఎన్టీటీపీఎస్కు కూడా ఇబ్బంది లేకుండా చూడవచ్చన్నారు. బుడమేరులో పోలవరం కాల్వను కూడా కలపాలన్న నిర్ణయంతో ఈ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతాంగం కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ప్లాంట్ వల్ల రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగిన ఘటనలు గతంలో అనేకం జరిగిన సంగతి గుర్తుచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తన స్వార్థం కోసం ఆ భూమిని కేటాయిస్తూ అనుమతి ఇవ్వడంపై ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
నేడు ధర్నా
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలోని జలవిద్యుత్ కేంద్రానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాజెక్టు ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ లంకె అంకమోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొంటారని వివరించారు. ప్రజలకు, రైతులకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నాటి సీఎం రాజశేఖరరెడ్డి దీన్ని నిలుపుదల చేయిస్తే ప్రస్తుత సీఎం తన స్వార్థం కోసం అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ ధర్నాకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.