లారీలు కదిలాయి..
- సింగిల్ పర్మిట్‌పై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో కుదిరిన అవగాహన... సమ్మె విరమణ
- 9 రోజుల తర్వాత రోడ్డెక్కిన లారీలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజులుగా కొన సాగిన లారీల సమ్మె శుక్రవారం ముగిసింది. సింగిల్ పర్మిట్లపైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో కుదిరిన అవగాహన మేరకు సమ్మె విరమించినట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు ఎన్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. దీంతో లారీలు రోడ్డెక్కాయి. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంపును ఉపసంహరించుకోవాలని, తెలుగు రాష్ట్రాల్లో అనుమతించేలా సింగిల్ పర్మిట్‌ను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో గత నెల 30న లారీల యజమానుల సంఘాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
రవాణా మంత్రితో చర్చలు సఫలం...
తెలంగాణ ప్రభుత్వంతో శుక్రవారం తాము జరిపిన చర్చల తరహాలోనే మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపనున్నట్లు భాస్కర్‌రెడ్డి చెప్పారు. సింగిల్ పర్మిట్లపైన రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు సరుకు లోడింగ్, అన్లోడింగ్ సర్వీసు చార్జీలు లారీ యజమానులపైన కాకుండా వినియోగదారులే భరించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించింది. లారీల పార్కింగ్‌కు పెద్దఅంబర్‌పేట్, మూసాపేట్‌లలో 10 ఎకరాల చొప్పున స్థలం కేటాయించేందుకు సానుకూలంగా స్పందించింది.
లారీ పర్మిట్ల పునరుద్ధరణ, ఫిట్నెస్ పరీక్షలు వంటి ఆర్టీఏ కార్యకలాపాల కోసం స్లాట్‌తో నిమిత్తం లేకుండా సేవలందజేసేందుకు రవాణాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో జరిపిన చర్చల్లో తెలంగాణ లారీ యజమానుల సంఘంతో పాటు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, ఇతర లారీ సంఘాలు, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, జేటీసీలు వెంకటేశ్వర్లు, రఘునాథ్ పాల్గొన్నారు.
ఐఆర్‌డీఏతో నేడు మరో దఫా చర్చలు
మరోవైపు థర్డ్‌పార్టీ బీమా ప్రీమియం తగ్గింపు పైన కేంద్ర బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ చైర్మన్ విజయన్‌తో శుక్రవారం లారీ సంఘాలు జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. 40 శాతం వరకు పెంచిన ప్రీమియంను మొత్తంగా ఉపసంహరి ంచాలని లారీ సంఘాలు పట్టుబట్టగా... ప్రీమియం తగ్గింపునకు అధికారులు అంగీకరించారు. అయితే 20 శాతానికి తగ్గించాలని లారీ సంఘాలు కోరాయి. ఇందుకు ఐఆర్డీఏ నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. శనివారం మరోసారి చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.