మ్యాథ్స్ ఇష్టపడితే దూసుకుపోతారు!
బెర్లిన్: గణితాన్ని ఎక్కువగా ఇష్టపడటంతోపాటు మంచి మార్కులు సాధించిన విద్యార్థులు విద్యారంగంలో ఉన్న స్థానాలను పొందుతారని ఒక సర్వేలో తేలింది. గణితాన్ని నేర్చుకోవడంలో అనుకూల భావాలు కలిగిఉండడం, విజయం సాధించడమనేవి ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే విద్యార్థులు చదివే విధానం, మేథో వికాసం అనేవి ఆనందం, ఆందోళన, విసుగుదల లాంటి భావోద్వేగ స్పందనల ద్వారా ప్రభావితమవుతాయని కనుగొన్నారు.
విజయ సాధనలో పాఠశాల స్థాయిలో విద్యార్థుల భావోద్వేగాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్స్ విశ్వవిద్యాలయాని(ఎల్ఎమ్యూ)కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ‘‘విద్యార్థులకు ఎక్కువ తెలివితేటలు కలిగి, మంచి గ్రేడ్లు, మార్కులు సాధించినప్పటికీ.. గణితాన్ని ఎక్కువగా ఇష్టపడి చదివినవారే గొప్ప లక్ష్యాలను సాధించగలరు’’అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎల్ఎమ్యూ ప్రొఫెసర్ రెయిన్హార్డ్ పెక్రుమ్ పేర్కొన్నారు. అదే సమయంలో కోపం, ఆందోళన, సిగ్గు, విసుగు, నిరాశ కలిగిన విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించుకోవడంలో వెనకబడతారని వెల్లడించారు.