యువతుల సంచలన నిర్ణయం
బీడ్: మహారాష్ట్రలో మరాఠ్ వాడ ప్రాంతంలో యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకోరాదని బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ ప్రాంతానికి 25 మంది యువతులు నిర్ణయించుకున్నారు. కరువుతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు పెళ్లిళ్లు చేయలేక తమ తల్లిదండ్రులు విపరీత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే భయంతో వివాహం చేసుకోరాదని నిశ్చయించారు.
తమ గ్రామంలో 20 నుంచి 25 మంది అమ్మాయిలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సరిత అనే యువతి వెల్లడించింది. ప్రభుత్వ సాయం కోరుకుంటున్నామని తెలిపింది. రెండుమూడేళ్ల నుంచి కరువుగా తీవ్రంగా ఉందని సవిత అనే మరో యువతి చెప్పింది. తమ తల్లిదండ్రులు ఏడాదంతా కష్టపడితే రూ. 30 వేలు వస్తాయని, ఈ డబ్బు తమ అవసరాలకే సరిపోవడం లేదని... ఇక పెళ్లిళ్లు ఎలా చేస్తారని వాపోయింది.
మరాఠ్ వాడ ప్రాంతంలోని లాటూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా మారడంతో రైతులు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోతున్నారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 124 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇక్కడికి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని మరాఠ్ వాడ రైతులు కోరుతున్నారు.