మంచి కాఫీలాంటి బహుమతి
రాయవరం : మిత్రుడి కుమారుని పుట్టిన రోజు.. సందేశంతో ఏదైనా కానుక (జ్ఞాపిక) ఇవ్వాలి.. చెల్లెలి పెళ్లిరోజు.. ఆమె అపురూపంగా చూసుకునే వస్తువు కొనివ్వాలి. ఆఫీసులో వీడ్కోలు సమావేశం.. మరచిపోలేని బహుమతి ఏదైనా ఫ్రెండ్‌కు ఇవ్వాలి.. ఇలా వేడుక ఏదైనా కావచ్చు.. ఆ క్షణాలను పదిలపరచుకునేందుకు ఆకర్షణీయమైన పింగాణీ కప్పులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. స్నేహితులు, బంధువుల పిల్లల పుట్టిన రోజు వేడుకలకు ఆ చిన్నారుల ఛాయాచిత్రాలను పింగాణీ కప్పులపై అందంగా ముద్రించి కొందరు కానుకగా అందిస్తున్నారు.
పిల్లలకు నచ్చే వివిధ కొటేషన్లు, మిక్కీమౌస్, డొనాల్డ్‌డక్ వంటి బొమ్మలను కప్పులపై ముద్రించి చిన్నారుల ముచ్చట తీరుస్తున్నారు. ప్రజల ఆసక్తి, అభిరుచి మేరకు గిఫ్ట్ కార్నర్ల వ్యాపారులు వీటిని రూపొందిస్తున్నారు. వారిచ్చే ఫొటోలు, సీనరీలు తీసుకుని వారం రోజుల్లో కప్పులపై అందంగా ముద్రించి అందిస్తున్నారు. ధర తక్కువగా ఉండడంతో పాటు ప్రత్యేకంగా కనిపిస్తున్న ఇటువంటి బహుమతులను అన్ని వర్గాలవారూ ఆదరిస్తున్నారు. పింగాణి మగ్గులపై తమ పిల్లల చిత్రాలు ముద్రించుకుని మురిసిపోయే తల్లితండ్రులు కూడా ఉన్నారు.
ఇంటీరియర్ డెకరేషన్లో..
గృహాలంకరణలో (ఇంటీరియర్ డెకరేషన్) చిత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పింగాణీ పాత్రలకు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రాయింగ్ రూములు, షోకేసుకు కొత్త అందాన్ని అద్దే పింగాణీ మగ్గులు, పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. రీడింగ్ టేబుళ్లపై పెన్ స్టాండ్లుగాను, స్టేషనరీ ట్రేలుగాను ఇవి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.