రాజకీయాల్లోకి యువ సినీ హీరో?
పలు సినిమాలతో తమిళనాట మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న యువ హీరో ఉధయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకుగా రాష్ట్రంలో ఆయనకు క్రేజ్ ఉంది. ఉదయ్ పొలిటికల్ ఎంట్రీ నిజమేనని డీఎంకే వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ఇటీవల 'మనిధన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
అయితే ఉధయనిధి క్రియాశీలక రాజకీయాల్లోకి దిగితే చిత్ర పరిశ్రమలో డీఎంకే వాదిగా ముద్రపడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే రాజకీయాల ఊసెత్తకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆ మధ్య స్టాలిన్ కూడా తనకు వారసులుగా తన కొడుకు గానీ, కూతురుగానీ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం ఖాయం అంటున్నారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీనేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తలకిందులైన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకూ రాజకీయ వాతావరణానికి దూరంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ శాసనసభ్యుడిగా ధ్రువపత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు వెంటే వెళ్లారు. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి స్టాలిన్ తంజావూరు వెళ్లినప్పుడు ఆయనతో ఉదయనిధి కూడా వెళ్లారు. ఇదంతా చూస్తుంటే ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనే స్వరం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.