మనిషే కుక్కను కరిచాడు
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నిరుగుతుందన్నాడు ఓ సినీరైటర్. రొటీన్‌కి భిన్నంగా జరిగే దురదృష్టాలకు ఈ డైలాగ్ సరిగా సూట్ అవుతుంది. ఇదంతా ఎందుకంటే... ఓ కుక్కని మనిషి కరిచాడు!! కుక్క ప్లేస్‌లో మనిషి, మనిషి ప్లేస్‌లో కుక్క అని ప్రింట్ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారేమో! ఇందులో మిస్టేకేమీ లేదు.జర్మనీలో గారెత్ గ్రీవ్స్ క్రూరాత్ముడు కనీసం మూగజీవి అనే కనికరం లేకుండా కుక్కను కసుక్కున కరిచేశాడు. ఇంతకీ ఆ ప్రబుద్ధుడికి ఇదేం పోయే కాలం అని అనుకుంటున్నారా? మరేం లేదు... గ్రీవ్స్ దొరవారు అక్కడి పోలీసులకు ‘బాగా కావలసిన వాడు’... అనగా ‘మోస్ట్ వాంటెడ్’ క్రిమినల్.
మార్టిన్ స్ట్రీట్ ప్రాంతంలో గ్రీవ్స్ పోలీసుల నుంచి పారిపోతుండగా, మన్పోల్ థియో అనే పోలీసు జాగిలం వెంటబడి తరిమింది. వృత్తి ధర్మంలో భాగంగా అతగాణ్ని అటకాయించింది. తనను పట్టుకోవడానికి పోలీసులే ముప్పుతిప్పలు పడుతుంటే ఆఫ్ట్రాల్ ఒక కుక్క తనను అటకాయించడం గ్రీవ్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. తన దారికి అడ్డు తగిలిన కుక్కపై అతగాడికి కోపం ముంచుకొచ్చింది. కోపం అదుపు తప్పడంతో కుక్కపై కాట్లకుక్కలా విరుచుకుపడ్డాడు. దంతబలం కొద్దీ దాని చెవి మీద, తల మీద ఎడాపెడా కొరికేశాడు.
అయినప్పటికీ విశ్వాసానికి మారుపేరైన థియో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అతగాడి పిక్క పట్టుకుని నిలువరించింది. పోలీసులు వచ్చి, గ్రీవ్స్‌ను అదుపులోకి తీసుకునేంత వరకు అది తన పట్టును ఏమాత్రం సడలించలేదు. ఈ తతంగమంతా గమనించిన ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కుక్క కాటుకి మందుంది కానీ, మనిషి కాటుకి మందు లేదంటారు. మరి చూడాలి... థియో ఈ కష్టం నుంచి ఎలా బయటపడుతుందో! ఏమో!!