Maulana Azad National Urdu University
-
వైఎస్సార్ కడపలో ‘మను’ పాలిటెక్నిక్ కళాశాల
కడప ఎడ్యుకేషన్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) అనుబంధ సంస్థ అయిన మను పాలిటెక్నిక్ కళాశాల జిల్లా విద్యార్థులకు అందుబాటులో ఉంది. మను ఆధ్వర్యంలో 2018లో దీనిని దేవుని కడప వద్ద ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరానికి ఆడ్మిషన్లు జరగనున్నాయి. ఈ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం కడప రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇందులో యూనివర్సీటీ గ్రాంట్ కమిషన్, మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయం రూ. 20 కోట్లతో నూతన భవనాలు నిర్మించారు. రూ. 5 కోట్లతో మౌలిక సదుపాయాలు, కళాశాల ఆవరణ మొత్తం ప్రహారీని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేషనల్ ఉర్దూ యూనివర్సీటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్భంగా, ఒరిస్సాలోని కటక్, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏ కోర్సులు ఉన్నాయంటే.. మను పాలిటెక్నిక్ కళాశాలలో మూడు రకాల కోర్సులు ఉన్నాయి. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 180 సీట్లు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు 17 మంది (ఎన్ఐటీ, ఐఐటీకి చెందిన హెచ్ఓడీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ) టీచింగ్, 10 మంది నాన్ టిచింగ్ సిబ్బంది ఉన్నారు. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, సెంట్రల్ లైబ్రరీ, అన్ని కోర్సులకు సంబంధించి వర్కుషాపులు ఉన్నాయి. వివిధ రకాల ఆటలు అడుకునేందుకు సువిశాలమైన ఆటస్థలం, క్రీడా పరికరాలు కూడా ఉన్నాయి. యూనివర్సీటీ నుంచి ఎవరైనా ప్రతినిధులు కళాశాల సందర్శనకు వస్తే వారు ఉండేందుకు వీలుగా గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. కళాశాలలో ప్రవేశానికి అర్హులెవరంటే... మను పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చేరవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఏ కేటగిరికి చెందిన వారైనా పదో తరగతిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో చదువుతున్నా లాంగ్వేజీకి సంబంధించి మాత్రం ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివే వారికి ఇందులో ప్రవేశానికి అర్హులు. ఇందులో చేరాలనుకునే వారు కచ్చితంగా ప్రవేశ పరీక్ష రాసి ర్యాంకు సాధించాలి. ర్యాంకులు సాధించిన వారికి కేటగిరీల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండీక్యాప్, ఉమెన్ కోటా) వారీగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఇందులో చేరే వారిలో అమ్మాయిలు ఏడాదికి రూ. 900, అబ్బాయిలు రూ. 2,350 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్, నేషనల్ స్కాలర్షిప్ వంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ కళాశాలలో ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్నాయి. జులై 12 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు.. మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి జులై 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష జులై 30వ తేదీన జరుగుతుంది. కడప సమీపంలోని రిమ్స్ వద్ద నూతనంగా నిర్మించిన మను పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రవేశ పరీక్షకు అమ్మాయిలు రూ. 350, అబ్బాయిలు రూ. 550 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను బట్టి రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. కడపలో ఏర్పాటు చేసిన మను పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ కళాశాలలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ మూడు కోర్సులకు సంబంధించి 180 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు 6 సెమిష్టర్స్ పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. ఇందులో 5 సెమిస్టర్స్‌కు పరీక్షలు జరుగుతాయి. 6వ సెమిస్టర్లో మాత్రం ఇండ్రస్టియల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో విద్యార్థులకు స్టైఫండ్ కూడా వస్తుంది. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు. మూడో సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. – డాక్టర్ ఎండీ ఆబ్దుల్ ముక్సిత్ఖాన్, ప్రిన్సిపాల్, మను పాలిటెక్నిక్ కళాశాల, కడప -
మనూ’ చాన్స్‌లర్‌గా ఫిరోజ్ భక్త్ అహ్మద్
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) నూతన చాన్స్‌లర్‌గా ప్రముఖ విద్యావేత్త, కాలమిస్ట్ ఫిరోజ్ భక్త్ అహ్మద్ నియమితులయ్యారు. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. వర్సిటీ విజిటర్ హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నియామకాన్ని చేసినట్లు వర్సిటీ అధికారులు గురువారం తెలిపారు. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు ఫిరోజ్ భక్త్ అహ్మద్ స్వయానా మేనల్లుడు. ఈయన బాలల సాహిత్యంపై ఉర్దూ, హిందీ భాషల్లో పలు పుస్తకాలు రాయడంతోపాటుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, కాలమిస్ట్‌గా విధులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మదర్సాల ఆధునీకరణ, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1997లో మనూ ఫౌండేషన్ ప్యానెల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. -
షారూక్‌కు మనూ గౌరవ డాక్టరేట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం మనూ ఆరో స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్స్‌లర్ చేతుల మీదుగా షారుక్ ఖాన్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. షారుక్‌తో పాటు రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. మనూ నుంచి డాక్టరేట్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు. మా తల్లిదండ్రులు ఉంటే చాలా సంతోషించేవారని.. తల్లి బర్త్ ప్లేస్ హైదరాబాదే అని షారుక్ గుర్తుచేసుకున్నారు. -
‘మనూ’ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ముఖ్యంగా దూరవిద్యా ద్వారా ఎంఏ ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, బీఏ, బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీసీ), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు పత్రాలు, ప్రాస్పెక్టస్‌ను యూనివర్సిటీ వెబ్సైట్ www.manuu.ac.in ద్వారా పొందవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు దేశంలోని న్యూఢిల్లీ, బెంగళూరు, పాట్నా, భోపాల్, దర్భంగా, శ్రీనగర్, రాంచి, కోల్‌కతాలోని రీజినల్ సెంటర్లలో కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 040- 23008402/04లలో సంప్రదించవచ్చు. -
'మనూ'లో విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదా
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఆఫీసర్లతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్ననేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రధానంగా వర్శిటీ ప్రొక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ రాజీనామా చేయడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిసింది. మరో వైపు గురువారం జరగాల్సిన పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించం కుదరదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
‘మనూ’లో పారా మెడికల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ : మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో పారా మెడికల్ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో చేరడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో సర్టిఫికెట్ కోర్సులను, డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను జూలై 2లోగా వర్సిటీలో సమర్పించాలి. -
హజ్ యాత్రలో ‘మనూ’ ప్రొఫెసర్ మృతి
హైదరాబాద్: ‘హజ్’ యాత్రకు వె ళ్లిన మౌలానా ఆజాద్ జాతీయు ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ (44) ఆకస్మికంగా మృతి చెందారు. వారం రోజుల క్రితం మక్కాకు బయలుదేరిన ఆయన రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రార్థనలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ మనూలో అరబిక్ డిపార్ట్మెంట్ హెడ్‌గా విధులను నిర్వహిస్తుండేవారు. 2006లో ఆయున మనూలో ప్రొఫెసర్‌గా చేరారు. అంతకుముందు ఉస్మానియా , ఢిల్లీ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీలలో కూడా విధులను నిర్వహించారు. మనూలో సంతాప సభ కాగా గచ్చిబౌలిలోని వునూలోని డీడీఈ ఆడిటోరియంలో వుంగళవారం అబ్దుల్ మొయిజ్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వర్శిటీ వీసీ ప్రొఫెసర్ మహ్మద్ మియాన్ మాట్లాడుతూ అరబిక్ విభాగాభివృద్ధికి ప్రొఫెసర్ అబ్దుల్ మొయిజ్ చేసిన సేవలను కొనియాడారు. వర్సిటీ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ రహమతుల్లా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
ఆమిర్‌ఖాన్, జస్టిస్ సచార్లకు మనూ గౌరవ డాక్టరేట్లు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్, జస్టిస్ రాజేంద్ర సచార్‌లు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) 2013 విద్యా సంవత్సరానికి ఇచ్చే గౌరవ డాక్టరేట్లకు ఎంపికయ్యారు. ఈ నెల 24న హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే వర్సిటీ 5వ స్నాతకోత్సవంలో వారికి డాక్టరేట్లను ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పల్లంరాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.