నేడు మున్సిపల్ రిజర్వేషన్ల వెల్లడి!
10 కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీల్లో
ఎన్నికలకు సమాయత్తం
2న ఓటర్ల జాబితాల ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను శనివారం ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రిజర్వేషన్లకు రాజ్‌భవన్ నుంచి ఆమోదముద్రను వేయించుకుని ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్న హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు, ఎన్నికలు తప్పవన్న అడ్వకేట్ జనరల్ అభిప్రాయం నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులు రిజర్వేషన్ల జాబితా సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీల్లో మొదటి దశ కింద ఎన్నికలు నిర్వహించనున్నారు. అరుుతే మొత్తం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. మరోవైపు 10 కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులు, డివిజన్ కార్యాలయూల్లోని నోటీసు బోర్డుల్లో మార్చి 2వ తేదీన ఫొటోలున్న ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికలను నాలుగు వారాల్లో నిర్వహించాలని, ఆ మేరకు తీసుకున్న చర్యల నివేదికను మార్చి 3వ తేదీన సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రరుుంచినా అక్కడా చుక్కెదురైంది. కాగా రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడంతో ప్రభుత్వ బాధ్యత తీరుతుందని అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్రంలో 162 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్లు ఉన్నా.. కొన్ని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ, కోర్టుల్లో కేసులు, షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదు. వీటికి రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తారు.
ధరావతు పెంపు..
కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ధరావతు (డిపాజిట్) మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, మిగిలిన వర్గాలకు రూ.5,000గా నిర్ణయించింది. గతంలో ఇవి రూ.1,000, రూ.2,500గా ఉండేవి. ధరావతు చెల్లించే వారి నామినేషన్లనే పరిగణనలోకి తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం నాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాల ప్రచురణ వివరాలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన ప్రకారం ఆదివారం ఓటర్ల జాబితా ప్రచురించే మున్సిపల్ కార్పొరేషన్లలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ ఉన్నాయి. శ్రీకాకుళంలోని 4 మున్సిపాలిటీల్లో, విజయనగరం(4), విశాఖపట్నం (2) తూర్పుగోదావరి(10), పశ్చిమగోదావరి(8), కృష్ణా(8), గుంటూరు(12); ప్రకాశం(6),నెల్లూరు(6), అనంతపురం(11), చిత్తూరు(6), కర్నూలు(9), కడప(7), వరంగల్(5); కరీంనగర్(9), ఖమ్మం(4); ఆదిలాబాద్(6), రంగారెడ్డి(5), నిజామాబాద్(3), నల్లగొండ(7), మెదక్(6), మహబూబ్ నగర్(8) మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు.