మెడివిజన్‌లో ‘ఫెమ్టా సెకండ్ లేజర్ సర్జరీ’ సేవలు
మెడివిజన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ రవికుమార్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న కేటరాక్ట్ సర్జరీలో వినియోగించే లిక్విడ్ ఆప్టిక్స్ ఇంటర్ఫేస్ ‘ఫెమ్టా సెకండ్ లేజర్ చికిత్స’ హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని మెడివిజన్ ఐ కేర్ సెంటర్ దీన్ని ఆరంభించింది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ శస్త్రచికిత్స నాణ్యమైనదే కాక... 30 మైక్రాన్ల మందంలో (మనిషి వెంట్రుక మందంలో 3వ వంతు) కూడా పనిచేస్తుందని మెడివిజన్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రవికుమార్‌రెడ్డి చెప్పారు. శనివారమిక్కడ లిక్విడ్ ఆప్టిక్స్ ఇంటర్ఫేస్ పేరిట కేటరాక్ట్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశంలో కంటి జబ్బులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం కొరత వల్ల లక్షలాది కేసుల్లో సగం కూడా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారని తెలియజేశారు. అందుకే విదేశాల్లో మాదిరిగా కాటరాక్ట్ చికిత్సలోనూ టెక్నాలజీని వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చికిత్స ప్రత్యేకతలను డాక్టర్ రవికుమార్ వివరించారు. సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కేర్ ఆసుపత్రి డెరైక్టర్ సురేశ్, కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్, కేటరాక్ట్ అండ్ రిఫ్రెక్టివ్ సర్జన్ డాక్టర్ రూపక్ కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.