the media
-
మీడియాకు లీకేజీలపై బీసీసీఐ ఆగ్రహం
బీసీసీఐకి సంబంధించిన అంతర్గత సమాచారం మీడియాలో తరచుగా వస్తుండటం పట్ల బోర్డు కార్యదర్శి జై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు ఉద్యోగులెవరూ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘బీసీసీఐ ఉద్యోగులు కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలిసింది. ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల బోర్డుకు సంబంధించి రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా గానీ తమకు తెలీకుండా గానీ ఎవరైనా, ఏ రూపంలోనైనా ఇలా సమాచారం బయటకు చేరవేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వేతన చెల్లింపులు కూడా లేకుండా ఉద్యోగంలోంచి తొలగిస్తాం’ అని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్లో జై షా పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమాచారం లీక్ కావద్దంటూ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్ కూడా ఇప్పుడు మీడియాకు లీక్ కావడం విశేషం. -
సమగ్ర దర్యాప్తు జరిపించండి!
న్యూఢిల్లీ: శారదా చిట్స్ స్కాంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ లెఫ్ట్ పార్టీల నేతలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అన్ని దర్యాప్తు సంస్థలను సమన్వయం చేస్తూ ఈ తరహా మోసపూరిత స్కీములన్నింటిపై విచారణ జరిపించాలని కోరారు. శారదా కేసులో సెబీ, సీబీఐ, వంటి కేంద్ర సంస్థలు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయని, అయితే దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ స్కామ్ మూలాల్లోకి వెళ్లడానికి అన్ని సంస్థల సంయుక్త దర్యాప్తు అవసరమని సూచించినట్లు సీపీఎంనేత సీతారాం ఏచూరి మీడియాకు తెలిపారు. ప్రధానిని కలసిన వారిలో సీపీఎం నేత బిమన్‌బోస్, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సుర్జోకాంత మిశ్రా, ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, ఫార్వర్డ్ బ్లాక్ నేత అలీఇమ్రాన్ రమ్జ్ ఉన్నారు. శారదా మీడియాతో మమతకే అత్యధిక లబ్ధి: కునాల్ కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ఎంపీ కునాల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిట్‌ఫండ్ స్కాంలో ఆమెకు వ్యతిరేకంగా స్థానిక కోర్టులో సోమవారం వాంగ్మూలమిచ్చారు. శారదా గ్రూప్‌నకు చెందిన శారదా మీడియా ద్వారా మమత అత్యధిక లబ్ధి పొందారన్నారు. 2013లో ఈ స్కాం బయటపడే నాటికి ఆ మీడియాకు కునాల్ ఘోష్ సీఈవోగా ఉన్నారు. అప్పటికి పలు పత్రికలు, టీవీ చానళ్లు శారదా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ కేసులో తనను బలి పశువును చేశారని తృణమూల్ నేతలపై కునాల్ ధ్వజమెత్తారు. స్కాంలో మమత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ హస్తముందని పునరుద్ఘాటించారు. ‘నా వద్ద సమాచారం ఉంది. సీబీఐ నన్ను ప్రశ్నిస్తే ఆ వివరాలు వెల్లడిస్తా’ అని అన్నారు. -
‘షీ’కి చిక్కారు
వారంలో 40 మంది ఈవ్‌టీజర్లపై కేసు నిందితులు 16-68 ఏళ్ల వయస్సు వారు సాక్షి, సిటీబ్యూరో: మహిళల భద్రత కోసం నగర పోలీసులు రంగంలోకి దింపిన షీ టీమ్‌లకు వారంలో 40 మంది ఈవ్‌టీజర్లు పట్టుబడినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతిలక్రా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీ టీమ్స్ పనితీరు, ఈవ్టీజర్ల వివరాలను వెల్లడించారు. గత నెల 24న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వంద మంది పోలీసులతో‘ షీ టీమ్’లను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లు ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాలలు, షాపింగ్ సెంట ర్లు, రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద కాపు కాశాయి. 40 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని పిటీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీఎస్ పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. పట్టుబడిన వారిలో 16 నుంచి 68 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది యువకులు, ఇంటర్ విద్యార్థులు, ప్రయివేటు ఉద్యోగులు, ఒక సర్పంచ్ ఉన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ రంజిత్త్రన్కుమార్, ఏసీపీ కవిత పాల్గొన్నారు. ఈ మేరకు ‘షీ టీమ్స్ మీ వెంటే ఉన్నాయి, ఆపదలో ఉంటే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. షీ టీమ్‌లు ఈవ్టీజర్ల ఆట కట్టించడమే కాకుండా ఫిర్యాదులు చేసే విధంగా మహిళలలో ధైర్యం కల్పిస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ బారిన పడితే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు ఎంఎంటీఎస్ రైలు ఎక్కి మహిళలు, విద్యార్థినిలను స్వయంగా కలుసుకుని భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజర్లతో అవగాహన తరగతులు.. ఈవ్‌టీజింగ్‌ను మరింత కట్టడి చేసేందకు పట్టుబడిన వారితో ఆయా కళాశాలల్లో అవగాహన తరగతులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తాము ఈవ్ టీజింగ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయి, దాని వల్ల పోయిన పరువు, ఎంత నష్టం కలుగుతుందో స్వయంగా వివరించేందుకు పట్టుబడిన నిందితులు అంగీకరించారు. వీరితో పాటు పోలీసులు కూడా కళాశాలలకు వెళ్లి ఈవ్‌టీజింగ్ చేయరాదని వారిలో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పట్టుబడ్డారు.. 20 ఏళ్ల ఓ యువకుడు మెహిదిపట్నం బస్టాప్‌లో నిల్చున్నాడు. అక్కడికి వ చ్చే ఏ బస్సు ఎక్కలేదు.ప్రయాణిలకు చూస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ షీ టీమ్‌కు చిక్కాడు. సికింద్రాబాద్‌లో 30 ఏళ్ల యువకుడు బస్సులోకి మహిళలు ఎక్కే ముందు డోర్ నుంచి ఎక్కడం, వారికి తగలడం చేస్తూ షీ టీమ్స్‌కు పట్టుబడ్డాడు. అమీర్‌పేటలో ఓ ప్రయివేటు ఉద్యోగి (36) బస్టాప్‌లో నిల్చున్న మహిళలపై పట్ల అసభ్యకరంగా చూడటంతో పాటు మాట్లాడుతూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి దొరికిపోయాడు. సుల్తాన్బాజర్లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తి ఏకంగా మహిళను లాడ్జికి రమ్మని కోరాడు. ఆమె నిరాకరించడం, ఈ దృశ్యం షీ టీమ్స్ కంట్లో పడడంతో అతగాడి ఆటలకు అడ్డుకట్ట వేశారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే చర్యలు: స్వాతిలక్రా ‘నగరంలో ఏ మూలన కూడా ఈవ్‌టీజింగ్ జరగడానికి వీలులేదు. ఈవ్‌టీజింగ్‌కు యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. షీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తాయి. మొదటిసారి పట్టుబడితే పిటీ కేసుతో పాటు కౌన్సెలింగ్ చేస్తాం. మరోసారి దొరికితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.’ -
ఒక నేతకు నివాళిగా ఒకే వాణిజ్య ప్రకటన
న్యూఢిల్లీ: మీడియాకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు నియమించిన ఓ కమిటీ పేర్కొంది. అదే సమయంలో అధికారంలో ఉన్నవారిని స్తుతించేలా ఆ ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపు దారుల ధనాన్ని వాణిజ్య ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వాలను నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్ మేరకు ఓ కమిటీని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించింది. ఈ విషయమై సంబంధిత కమిటీ తాజాగా సుప్రీం కు పలు సిఫారసులు చేసింది. ఏ ఏ ప్రముఖ వ్యక్తుల జయంతి, వర్ధంతికి ప్రకటనలు ఇవ్వాలనే దానిని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించాలని, ఆ ప్రకటనను ఏ విభాగం ఇవ్వాలో కూడా ఖరారు చేయాలని సూచించింది. దీనివల్ల ఒకే నేతకు నివాళిగా పలు ప్రకటనలు ఇవ్వడాన్ని నిరోధించవచ్చని పేర్కొంది. అలాగే ఆ ప్రకటనల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదని స్పష్టం చేసింది. -
చార్జిషీట్ మీడియాకు ఎలా లీకైంది?
కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలెలా వస్తున్నాయి? వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్న ఈ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ న్యాయవాది హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీట్ మీడియాకు ఎలా లీక్ అయిందని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ప్రశ్నించారు. ‘చార్జిషీట్‌ను మీడియాకు ఎవరు ఇస్తున్నారు? నేనే ఇంకా చదవలేదు. చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలు తదితర అంశాలపై యథాతథంగా కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి’ అని అన్నారు. చార్జిషీట్లోని సమాచారాన్ని సీబీఐ ఇస్తోందా? నిందితుల తరఫు న్యాయవాదులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ కథనాలను ప్రచురిస్తుండడంపై జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిశీలనలో ఉన్న చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ మీడియా కథనాలను ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. మీడియా ట్రయల్స్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసినా... చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే, కోర్టు పరిశీలనలో ఉండగానే అందులోని అంశాలను పేర్కొంటూ వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ‘సీబీఐ సమర్పించిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. చార్జిషీట్లోని అన్ని అంశాలను, డాక్యుమెంట్లను పరిశీలించి విచారణకు స్వీకరించిన తర్వాతే నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు అందజేస్తుంది. కోర్టు నుంచి గానీ, మా నుంచి గానీ చార్జిషీట్ లీక్ అయ్యే అవకాశం లేదు. సీబీఐ మాత్రమే దాన్ని లీక్ చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. చార్జిషీట్ మీడియాకు ఎలా అందిందో తమకు తెలియదని సీబీఐ స్పెషల్ పీపీ కోర్టుకు నివేదించారు. నిబంధనలకు లోబడే తమకు భూకేటాయింపులు జరిగాయని, ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటిరో డ్రగ్స్ ఎండీ శ్రీనివాసరెడ్డి, హెటిరో సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను మంగళవారం విచారించిన సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ వాదనలు వినిపిస్తోందని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభియోగాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారంగా చూపించి, వాదనలు వినిపిస్తే వాటికి తాము వివరణ ఇస్తామని నివేదించారు. ఈ సందర్భంగా చార్జిషీట్లోని పేర్కొన్న అంశాలను సీబీఐ తరఫు న్యాయవాది చదివి వినిపిస్తూ.. నిందితులపై అభియోగాలు నమోదు చేయవచ్చని నివేదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. -
మీడియాపై కక్ష సాధింపు తగదు
‘సాక్షి’ ప్రతినిధులను అడ్డుకోవడం చట్టవిరుద్ధం ఆంధ్రా సీఎం తీరు అప్రజాస్వామికం ఐజేయూ జాతీయ సమావేశాల్లో కీలకతీర్మానాలు తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో రెండో రోజు ఆదివారం ఐజేయూ కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా అధ ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ కార్యదర్శి నివేదికను అందించారు. 16 రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొని, దేశవ్యాప్తంగా మీడియా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత, మీడియాపై దాడులు, ట్రాయ్ సిఫార్సులు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ చానల్ ప్రతినిధులను హాజరుకానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపైనా చర్చించారు. ఇది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం, మీడియా వ్యతిరేక చర్యగా ఐజేయూ ప్రతినిధులు పేర్కొన్నారు. సమాచార పౌరసంబ ంధాల శాఖ నుంచి అక్రిడిటేషన్ కలిగిన ‘సాక్షి’ సిబ్బందిని సీఎం పత్రికా సమావేశాలకు రానీయకపోవడం మీడియా స్వేచ్ఛపై దాడిగా, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కుకు అవరోధం కలిగించే చర్యగా ఐజేయూ అభిప్రాయపడింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న సాక్షి పత్రిక ప్రతినిధుల పట్ల సీఎం భద్రతా సిబ్బంది అనుసరిస్తున్న వివక్షపూరిత చర్యలను విరమించుకోవాలన్నారు. దీనిపై ఏపీ సీఎం సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి సాక్షి ప్రతినిధులను తన పత్రికా సమావేశాలకు హాజరయ్యేట్లు చూడాలని, పత్రికా స్వేచ్ఛకు గల పవిత్రతను కాపాడాలని కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన తెలంగాణలో మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతినిధులు చర్చించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతినిధిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీడియాపై ఇంత దారుణంగా విరుచుకుపడుతున్న వ్యక్తి మరెవ్వరూ లేరన్నారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపు
బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ జిల్లాలో వివిధ పత్రికలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(టీడబ్ల్యూజేఎఫ్) పేర్కొంది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్, వీబీఎన్ పద్మరాజులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమిరెడ్డిని కలిసింది. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు మినహాయింపుపై ఉత్తర్వులు జారీ చేయడం పట్ల డీఈవో సోమిరెడ్డికి హెచ్‌యూజే తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలని కోరుతూ జర్నలిస్టు సంఘాలు చేస్తున్న విజ్ఞప్తిని డీఈవో అంగీకరించి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు ముందుగా పిల్లల ఫొటోలతో ఉన్న దరఖాస్తులను పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయానందరావు, నవీన్, భీష్మాచారి, ఆశాలత, యశోద, నాగమణి తదితరులు ఉన్నారు. త్వరలో కార్డుల పంపిణీ పంజగుట్ట: హైదరాబాద్ జిల్లా పరిధిలోని పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించడానికి విద్యా శాఖ అధికారులు అంగీకరించడం అభినందనీయమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి పాలకూర రాజు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు టీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో ఫ్రీ ఎడ్యుకేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 15న నగరంలోని తెలంగాణ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. అర్హులైన తెలంగాణ జర్నలిస్టులు తమ పిల్లల ఫొటోలతో పాటు జర్నలిస్టుల ఫొటోలు, గుర్తింపు కార్డులను తీసుకొని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
జెండర్ వివక్ష మీద ఖడ్గధార
సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిలో స్త్రీ-పురుషులు జమిలిగా పాలు పంచుకోవడం వల్లనే సామాజిక జీవనం సజావుగా సాగడానికి వీలు కలిగింది. ఈ కనీస జ్ఞానం చాలా మందిలో లోపించడం వల్లనే ఈ వివక్ష, ఈ పెడబుద్ధులు చోటు చేసుకుంటున్నాయి. ‘నేను స్త్రీల నుంచి, ముఖ్యంగా స్త్రీవాద మహిళల నుంచి నేర్చుకుంటున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. జెండర్ హింస గురించి స్వయంగా ఆ హింసకు గురైన మహిళల నుంచే ముఖతహ తెలుసుకున్నాను. స్త్రీల పట్ల అత్యాచారం ఆధారం లేని శూన్యంలో జరగదు. ఒక స్త్రీని అవమానించే ఒక పురుషుడు తన పురుష జన్మను గౌరవించే నాగరికతలో మాత్రమే బతికి బట్టక డుతూ ఉంటాడు. వీధుల్లో స్త్రీలను వేధించటం, సమాన గౌరవంతో చూడకపోవటం, పని మధ్యలో వారిని అటకాయించటం, నోటికొచ్చినట్టు వదరటం, అధికారం, పెత్తనం చెలాయించ బోవటం, పని చేసుకునే చోట లైంగికంగా వేధించటం - ఇత్యాది వేధింపులన్నీ ఈ దుర్మార్గాలన్నింటికీ పునాది. ఈ పునాది మీదనే జెండర్ వివక్ష, హింస మరింతగా కొనసాగుతోందని గుర్తించాలి’ - బెన్జిమన్, సంస్కర్త (లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 20 ఏళ్లుగా పని చేస్తున్న ‘నోమాస్’ సంస్థ ప్రతినిధి.) మహిళలపై అత్యాచారాలనూ, హింసనూ అరికట్టి స్త్రీ-పురుష సమానత్వం గురించి ప్రబోధించేందుకు బెన్జిమన్ వచ్చేవారం సతీసమేతంగా ఇండియా వస్తున్నారు. యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించడం ఆయన ఉద్దేశం. ఈ సందర్భంగా మన ఆడపడుచుల మీద రకరకాల వేధింపులు, అత్యాచారాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వాటి వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలను పరిశీలించడం అవశ్యం. అసలు స్త్రీ-పురుష నిష్పత్తిలో ఇప్పుడున్న తీవ్రమైన వ్యత్యాసానికి కారణం ఏమిటి? ఈ అసమ వ్యవస్థలో మున్నెన్నడూ లేని రీతిలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎందుకు కుంచించుకుపోతున్నది? ఆడ శిశువును కడుపులోనే, లేకుంటే పుట్టగానే ఎందుకు చిదిమేస్తున్నారు? 21వ శతాబ్దంలో కూడా ఇంకా కొందరు స్త్రీ విద్య అంటే ఎందుకు గొణుగుతున్నారు? ఏ రంగంలో, విద్యలో ఆడపిల్లలు మగపిల్లల కన్నా వెనుకబడి ఉన్నారు, వివక్షలో తప్ప! సమాజంలో అనాదిగా మత ఛాందసానికీ, అభివృద్ధి నిరోధక భావాలకూ పెద్ద పీట వేసిన ‘మగరాయుళ్లు’ ఇందుకు కారణం. సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిలో స్త్రీ-పురుషులు జమిలిగా పాలు పంచుకోవడం వల్లనే సామాజిక జీవనం సజావుగా సాగడానికి వీలు కలిగింది. ఈ కనీస జ్ఞానం చాలా మందిలో లోపించడం వల్లనే ఈ వివక్ష, ఈ పెడబుద్ధులు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ‘అభయ’మివ్వాలా? రకరకాల మానసిక దౌర్బల్యాల ద్వారా, అడ్డంకుల ద్వారా స్త్రీ జాతి ప్రగతికి సంకెళ్లు తగిలించి, ఆమె కంటకమార్గాలలో ప్రయాణించేటట్టు చేసింది మన మగరాయుళ్లే. ఆ వివక్ష ఈ 21వ శతాబ్దంలో కూడా పురుషుడి మనసును కుమ్మరి పురుగులా తొలుస్తున్నందునే ‘పూట బత్తెం పుల్ల వెలుగు’ జీవితాలు గడుపుతున్న పేద సాదల ఆడపడుచుల పట్లనే కాదు, విద్యార్థినుల పట్లనే కాదు, చివరికి ముక్కుపచ్చలారని చిన్నారులపై కూడా కళ్లు పూడుకుపోయిన కాముకతతో మగరాయుళ్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటివాళ్లు ఇంతగా బరితెగిస్తున్నారంటే, ఈ ‘పుండు’ ఎక్కడుందో గమనించడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో వ్యవహరించవలసిన సమయం వచ్చింది. మన ఆడపడుచులలో నిర్భీతి ఆచరణాత్మకంగా కనిపించాలంటే ధనిక వర్గ వ్యవస్థకు కాపలాదార్లుగా వ్యవహరిస్తున్న పార్టీలూ, ప్రభుత్వాలూ ‘అభయ’, ‘నిర్భయ’ అంటూ ప్రకటనలకు పరిమితమైతే చాలదు. నిజానికి ‘అభయం’, ‘నిర్భయం’ అనడంలోనే వేరెవరో స్త్రీ రక్షణ బాధ్యతను తీసుకోవాలన్న ధ్వని ఉందనిపిస్తుంది. ఆమె ‘అబల’, ‘అస్వతంత్రురాలు’ అన్న భావనను నూరిపోసే తంతు ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికితోడు, ‘ఇంత జనాభా ఉన్న దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరగకుండా ఆపడం కష్టం’ అంటూ కొందరు నాయకులు సిగ్గు విడిచి చేస్తున్న ప్రేలాపన ఒకటి. మరో వైపున మతాంతర కులాంతర వివాహాల మీద ‘హిందుత్వ’ దాడులు కూడా కొనసాగుతున్నాయి. మోసపూరిత ప్రకటనలే అండ మీడియా నాలుగు చెరగులా ఇంతగా విస్తరించి ఉండకపోతే ఈ మాత్రం సమాచారం కూడా ప్రజల ముందుకీ, ప్రభుత్వాల దృష్టికీ వచ్చి ఉండేది కాదు. సుప్రీంకోర్టు ఎన్ని హెచ్చరికలూ, తీర్పులూ ఇచ్చినా ఈ అత్యాచారాలూ, హత్యలూ అదుపులోనికి రాకపోవడానికి ప్రధాన కారణం- 65 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా పెట్టుబడిదారీ, ఫ్యూడల్, ధనికవర్గ పార్టీలు పైపై మోసపూరిత ప్రకటనలతో సరిపెట్టడమే. ఇన్ని దుర్మార్గపు పరిణామాల మీద భావుకులూ, స్త్రీవాద రచయితలూ, రచయిత్రులూ, కవులూ ఆగ్రహం ప్రకటించకుండా ఉండడం ఎలా సాధ్యం? ‘కళ్లల్లో కాలాగ్ని’ ద్వారా అత్యాచారాల మీద ‘సంహార శక్తి’ని ఆవాహనం చేస్తూ సుద్దాల అశోక్‌తేజ ఇలా గళం విప్పవలసివచ్చింది- ‘ఓ దురాత్మ రక్తదాహినీ/ సంహార శక్తిశాలినీ/ మహాగ్ని జ్వాలా శూలినీ/ కాళివా, నవకాళికలేకమైన అగ్నిశూలివా/ కళ్లల్లో కాలాగ్ని/ గుండెల్లో జ్వాలాగ్ని/ చేతుల్లో త్రేతాగ్ని/ శ్వాసిస్తే విషయాగ్ని/ నీ చెల్లెళ్ల కన్నీళ్లే నిలువెత్తున దహిస్తుంటే/ కిరాతకుల కాల్చివేయ/ కదులుతున్న -భస్మాగ్నివై/ పిశాచకుల కూల్చివేయ- ఏకమైన యోగాగ్నివై/ కదలివచ్చి’’ ఆ స్ఫూర్తిలోనే దేశంలోని ఆడపడుచులంతా నిర్భీతిగా బతకాలని కోరుకున్నాడు మన కవి. ఉల్స్టోన్ క్రాఫ్ట్ అనుభవం ఇలాంటి ఆశావహమైన, ఉత్తేజమైన సందేశానికి ఇంగ్లండ్ మహిళ మేరీ ఉల్స్టోన్క్రాఫ్ట్ నాంది పలికింది. ఫ్రెంచ్ విప్లవ కాలం(1789)లో స్వీయానుభవమే పాఠంగా స్త్రీ విమోచన కోసం ప్రపంచ మహిళల హక్కుల ఉద్యమానికి క్రాఫ్ట్ శ్రీకారం చుట్టారు. ‘మహిళల హక్కుల మేనిఫెస్టో’ (ఎ విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్) అనే మహత్తర రచనను ఆవిష్కరించారామె. క్రాఫ్ట్ రచన పురుషాధిక్య సమాజం మీద ధర్మాగ్రహంతో కూడిన తిరుగుబాటు తప్ప, మరొకటి కాదు. ఎలాగంటే, స్త్రీ-పురుష బంధం బానిస బంధంలా ఉండకూడదనీ, సహజమైన పరస్పర ప్రేమానుబంధంతో ముడిపడి ఉండాలని క్రాఫ్ట్ అందులో పేర్కొన్నారు. కృత్రిమ బంధనాల మధ్య అస్వతంత్రతా సంబంధాలతో కుములుతున్న స్త్రీలకు చేయూతనివ్వడానికి పురుషులు బేషరతుగా ముందుకు వచ్చిననాడు ‘మమ్మల్ని (స్త్రీలను) పురుషులు అణుకువ గల కుమార్తెలుగా, ప్రేమాస్పదులైన అక్కాచెల్లెళ్లుగా, మరింత అనుకూలవతులైన, నమ్మదగిన భార్యలుగా, హేతుబద్ధమైన తల్లులుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మరింత బాధ్యత గల పౌరులుగా చూడగలుగుతారు’ అని 300 ఏళ్ల నాడే క్రాఫ్ట్ ఎలుగెత్తి చాటింది. ఇంకా, ‘అప్పుడు మాత్రమే మేము (స్త్రీలు) పురుషులను నిజమైన ఆప్యాయత, అనురాగాలతో ప్రేమించగలుగుతాం. ఎందుకంటే, బాధ్యత గల స్త్రీలుగా మమ్మల్ని మేము గౌరవంతో మెలిగేలా, ఎదిగేలా చూసుకోవాలి గనుక!’ అని కూడా చెప్పారు క్రాఫ్ట్. మగ అహంకారాన్ని గుర్తు చేసేందుకే క్రాఫ్ట్ చాటిన విశ్వాసం ఈ దోపిడీ సమాజ వ్యవస్థలో కలిగే వరకు వర్గ వ్యవస్థలో, కుటుంబంలో భర్త బూర్జువాగానూ, భార్య శ్రమ జీవిగానూ (ప్రోలిటేరియన్)కాలం గడుపుతారని ఫ్రెడరిక్ ఏంగెల్స్ అన్నాడు. కనుకనే తాజా సర్వేలో ఐక్య రాజ్య సమితి పురుషులతో పోల్చితే స్త్రీ జనాభా నిష్పత్తి క్రమంగా తరిగిపోతూ ఉండడానికీ, మరిన్ని అరాచకాలకూ కారణమవుతోందని ఇండియాను ఉదహరిస్తూ పేర్కొన్నది. కనుకనే మగజాతికి బాధ్యతలూ అహంకార దర్పాన్నీ గుర్తు చేయడానికి ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఒక చలం, ఒక మహాశ్వేతాదేవి, ఒక రంగనాయకమ్మ, ఒక జయప్రద, ఒక సత్యవతి, ఒక కుప్పిలి పద్మ అవసరం అనివార్యమౌతుందేమో! ఇన్ని ఆటుపోట్ల మధ్య ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రాస్తోంది. అటు చూడండి! వివక్షకూ, పరువు హత్యలకూ పేరొందిన హర్యానాలో దూసుకుపోతున్న కుస్తీలు పట్టే మహిళా వస్తాదులను చూసి మగరాయుళ్లు సుస్తీ పడుతున్నారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు) - ఏబీకే ప్రసాద్ -
కల్లోల ప్రదేశ్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ రెండున్నరేళ్లక్రితం ప్రమాణస్వీకారం చేసినప్పుడు మీడియా అంతా ఆయనకు బ్రహ్మ రథం పట్టింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం బరువు బాధ్యతలు అతి పిన్న వయస్కుడు చేపట్టారని, ఆయన నేతృత్వంలో యూపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. కానీ, యూపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంతకాలం గడిచినా ఆయనకు పాలనపై పట్టు రాలేదని స్పష్టమవుతున్నది. అత్యాచారాలతోసహా మహిళలపై ఎడతెగకుండా సాగుతున్న హింస ఒకపక్క... అడపా దడపా సంభవిస్తున్న మత ఘర్షణలు మరోపక్క ఆ రాష్ట్రంలో సామా న్యులకు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. అఖిలేష్ ప్రభు త్వాన్ని పట్టిపీడిస్తున్న అపరిపక్వత, అవగాహన లేమి నేరగాళ్లకు బాగా అందివస్తున్నది. మతం పేరిట ప్రజల్ని విభజించడానికి, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి సాగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో అఖిలేష్ సర్కారు విఫలమవుతున్నది. అది మొద్దునిద్ర పోతున్నదా లేక అచేతన స్థితికి చేరిందా అన్నది అర్ధంకావడం కూడా కష్టమే. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ప్రారంభమవుతున్న ఘర్షణలు చివరకు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. గృహదహనాలు, ఆస్తుల ధ్వంసం, లూటీలు సాగిపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు మొదలు కొని ఈనాటి వరకూ ఆ రాష్ట్రంలో... మరీ ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలో విడవకుండా సాగుతున్న మత ఘర్షణల విష యంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఆ ప్రాం తంలో ఏదో ఒక మూల మత ఘర్షణలు జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. మే 16 నుంచి గత నెల 25 వరకూ ఈ ప్రాంతంలో మొత్తం 605 మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఒక ఆంగ్ల దినపత్రిక పరిశీలనలో తేలింది. ఇందులో నిరుడు అల్లర్లతో అట్టుడికిన ముజఫర్‌నగర్ ప్రాంతంతోసహా సహా అనేక పట్టణాలు, గ్రామాలు న్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా మీరట్ జిల్లాలోని ఒక మదర్సాలో పని చేస్తున్న యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం జరిపి మతమార్పిడికి పాల్పడ్డా రన్న వార్త ఆ ప్రాంతాన్ని అట్టుడికిస్తున్నది. ఈ ఉదంతంలో బాధితు రాలు ఫిర్యాదును పోలీసులు స్వీకరించేందుకు నిరాకరించారని తేల డంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రభుత్వ జోక్యంతో చివరకు ఫిర్యాదు తీసుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని అరెస్టుచేశారు. అయితే, ఇన్ని నెలలుగా వరసబెట్టి ఘర్షణలు, ఉద్రిక్త తలు చోటుచేసుకుంటున్న రాష్ట్రంలో పోలీసులు ఇంత నిర్లక్ష్యాన్ని ఎందుకు ప్రదర్శించవలసి వచ్చిందన్నది కీలకమైన ప్రశ్న. మత ఘర్షణలకూ, ఎన్నికలకూ సంబంధం ఉన్నదని ఇప్పటికే జరిగిన అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అసాంఘిక శక్తులు, రాజ కీయ పార్టీలమధ్య విడదీయరాని బంధం ఏర్పడటమూ... మతాన్ని, సంస్కృతిని తమ స్వప్రయోజనాల కోణంలోనుంచి నిర్వచించి ఉద్రిక్త తలను రెచ్చగొట్టడమూ రాను రాను పెరుగుతున్నదని ఆ అధ్యయ నాలు చెబుతున్నాయి. యూపీలో ఇప్పుడు జరిగిన 605 మత ఘర్షణలనూ గమనిస్తే మరోసారి ఇదే వాస్తవం బయటపడుతుంది. 259 ఘర్షణలు సంభవించిన పశ్చిమ యూపీలో మొత్తం అయిదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ప్రాంతాలవారీగా చూస్తే 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన తెరైలో 29, ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సిన అవధ్‌లో 53, రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన తూర్పు యూపీలో 16, రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 6 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఎక్కువ ఘటనలు ఉప ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతం కావడం గమనార్హం. ప్రార్థనా స్థలాల నిర్మాణం, లౌడ్ స్పీకర్లను అమర్చడంవంటి కారణాలే ఈ ఘర్షణల్లో చాలావాటికి ప్రధాన కారణం కావడం కూడా యాదృచ్ఛికం కాదు. దాదాపు నిత్యమూ చోటుచేసుకుంటున్న ఈ అల్లర్లన్నిటి వెనకా ఒక స్పష్టమైన పథకం కనబడుతుండగా యూపీ ప్రభుత్వం ఎందుకని మిన్నకున్నదని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ అల్లర్లతో ప్రయోజనం పొందాలనుకుంటున్న శక్తులు కేవలం ఒక మతానికి చెందినవారు మాత్రమే కాదు. అలాంటివారు అన్నిటా ఉన్నారు. ఇలాంటి శక్తులు పోటీపడి సాగిస్తున్న కార్యకలాపాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడమే కాదు...అమయాక పౌరుల ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి. ఓటు లెక్కలేసుకుని రాజకీయ పార్టీలు అడుగులేయడంవల్లే ప్రధా నంగా మత ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నది నిజం. గ్రామ స్థాయినుంచి కమిటీలు, కార్యకర్తలు దండిగా ఉండే ఈ పార్టీలకు తెలి యకుండా, వాటి ప్రమేయం లేకుండా ఎక్కడైనా, ఏదైనా జరుగుతుం దనుకోవడం భ్రమ. ఇలాంటి ఘర్షణల్లో తాము సైతం లబ్ధిపొంద వచ్చునని ప్రతి ఒక్కరూ తహతహలాడబట్టే అవి నిర్నిరోధంగా సాగిపోతున్నాయి. జాతీయ సమగ్రతా మండలిలో మత కల్లోలాలను తీవ్రంగా ఖండించడం, మతతత్వాన్ని నిరోధించేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునివ్వడం తప్ప మత ఘర్షణల మూలకార ణాల్లోకి పార్టీలుగానీ, ప్రభుత్వాలుగానీ ఏనాడూ పోలేదు. మత హింస నిరోధానికి బిల్లు తెస్తామని చెప్పిన యూపీఏ ఆ వంకన మైనారిటీలకు దగ్గరవుదామని ప్రయత్నించింది. ఆ బిల్లు అయినా లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడ్డాక పార్లమెంటు ముందుకు తీసు కొచ్చింది. రాజకీయ పక్షాలు ఇకనైనా పాక్షిక ప్రయోజనాలను పక్కన బెట్టి ఆలోచించాలి. మతకలహాల చిచ్చును మొగ్గలోనే తుంచడానికి ప్రయత్నించాలి. -
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ నయ వంచన
నమ్మించి మహిళను లొంగదీసుకుని దగా డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు కదిరి టౌన్:చట్టాన్ని రక్షిస్తూ.. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే.. ఓ మహిళను ప్రేమ పేరుతో నమ్మించి లొంగదీసుకుని.. ఆపై వంచించాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కదిరి పట్టణ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. శనివారం బాధితురాలు మీడియాకు ఈ వివరాలు వెల్లడించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మేరీ(38) కొంత కాలం క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. మదనపల్లిలోనే ఆమె ఆదర్శ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. అప్పట్లో తన సంస్థ కార్యక్రమాలకు కదిరి ఎమ్మెల్యే షాజహాన్‌ను ఆహ్వానిస్తుండేది. అప్పట్లో ఆయన వద్ద గన్‌మెన్‌గా ఉన్న వివాహితుడైన కానిస్టేబుల్ ఆంజనేయులు(పీసీ-141) మేరీతో పరిచయం పెంచుకున్నాడు. ఏదైనా పని ఉంటే ఎమ్మెల్యేతో చెప్పి చేయిస్తానంటూ ఆశ చూపాడు. అనంతరం నిన్ను ప్రేమిస్తున్నాను.. జీవితాంతం నీకు తోడుగా ఉంటానంటూ నమ్మబలికి సన్నిహితంగా మెలిగాడు. ఏడాది క్రితం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో.. తనకు తిండితో ఇబ్బందిగా ఉందని, కదిరికి వచ్చి తనతో పాటు ఉండాలని మేరీని కోరాడు. కానీ తన సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని తొలుత ఆమె నిరాకరించినప్పటికీ, తర్వాత కొందరితో చెప్పించడంతో ఒప్పుకుంది. దీంతో మే 23న కదిరిలోని రాజేంద్రప్రసాద్ వీధిలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసి సదరు కానిస్టేబుల్ సోదరుడు వెంకటస్వామి, అతని ఇరువురు కుమారులు ఇటీవల మేరీ ఇంట్లోకి చొరబడి నానా దుర్భాషలాడుతూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యం చేశారు. ఆంజనేయులు సైతం తనను కులం పేరుతో దూషిస్తూ.. ఇకపై నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు.. జరిగిన విషయాన్ని ఎక్కడైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి, వస్తువులు చిందరవందర చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు డీఎస్పీ ఎదుట వాపోయింది. తనకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని, నిందితుడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కానిస్టేబుల్ ఆంజనేయులుపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ దేవదానం, పట్టణ ఎస్ఐ-2 రహిమాన్ తెలిపారు. -
ఎందుకిలా..?
పోటెత్తని ఓటింగ్ తలకిందులైన అధికారుల అంచనాలు 60 శాతం మందికి అందని ఓటరు చీటీలు గుర్తింపు కార్డులనూ పట్టించుకోని సిబ్బంది అధికార యంత్రాంగం వైఫల్యం సాక్షి, సిటీబ్యూరో: ‘ఓటేయండి.. జనం సత్తా చాటండి’ గత కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడా చూసినా ఇదే ప్రచారం. ఎన్నికల యంత్రాంగం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, మీడియా మూకుమ్మడిగా ఓటుహక్కుపై ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇలా ‘గ్రేటర్’లో పోలింగ్ శాతం పెంచేం దుకు ఎవరెన్ని విధాలుగా ఎంత కసరత్తు చేసినా.. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో కాదు కదా, కనీసం గతంలో కన్నా పోలింగ్ శాతం పెరగలేదు. కారణాలేంటి? ఎందుకిలా జరిగింది? ఇప్పుడు అధికారులను, అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవడంలో కనిపించిన ఉత్సాహం.. పోలింగ్ రూపంలో కానరాలేదు. మూడు మాసాల వ్యవధిలోనే దాదాపు 3 లక్షల మంది కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఓటుహక్కుపై అవగాహన వల్లే అంతమంది ముందుకొచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారని భావించిన అధికార యంత్రాంగం.. పోలింగ్‌లోనూ అది ప్రతిఫలిస్తుందనుకున్నారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. గత ఎన్నికల కంటే ఒక్కశాతం పోలింగ్ కూడా పెరగకపోవడం వెనుక వివిధ కారణాలను ప్రస్తావిస్తున్నారు. అటు అధికారులు.. ఇటు రాజకీయ విశ్లేషకులు.. ఎన్జీవోలు.. తదితరుల అభిప్రాయాల మేరకు పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణాలివీ... గతంలో ఓటరు స్లిప్పుల్ని రాజకీయ పార్టీలూ పంచేవి. ఈసారి దాన్ని నివారించారు. ఎన్నికల ఉద్యోగులే ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పుల్ని పంచితే మంచి ఫలితముంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. తగినంత వ్యవధి లేకపోవడం.. ఒక్కో బీఎల్ఓ రోజుకు 200 ఇళ్లు తిరగ్గలరని భావించినప్పటికీ అమలులో అది సాధ్యం కాకపోవడం వంటి కారణాలతో దాదాపు 60 శాతం ఓటర్లకు స్లిప్పులే అందలేదు. ఎస్ఎంఎస్ ద్వారా పోలింగ్ కేంద్రం తెలిసే ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఈ సదుపాయాన్ని కొందరే వినియోగించుకున్నారు. ఓటరు స్లిప్పులు లేకపోయినా నిర్ణీత 11 డాక్యుమెంట్లలో ఏది చూపినా ఓటుకు అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, అమలులో ప్రజలకు ఇబ్బందులెదురయ్యాయి. గుర్తింపు కార్డుల్ని చూపినా ఓటరు స్లిప్ కావాల్సిందేనంటూ చాలా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు వెనక్కు పంపారు. ఎపిక్ కార్డు నెంబరు తెలిపినప్పటికీ.. ఓటరు జాబితాలో సీరియల్ నెంబరు వంటివి బీఎల్ఓలు చెప్పలేకపోయారు. ఈ కారణం వల్ల కూడా చాలామంది ఓటు వేయలేదు. కొన్ని కుటుంబాల వారికి ఇంట్లో నలుగురు సభ్యులుంటే.. ముగ్గురికి ఒక పోలింగ్ కేంద్రంలో, మరొకరికి 4 కి.మీ.ల దూరంలోని మరో పోలింగ్ కేంద్రం కేటాయించారు. వీటి వల్ల కూడా పలువురు ఓటు హక్కుకు దూరమయ్యారు. ఆన్లైన్ ద్వారా ఓటరు నమోదుకు కల్పించిన సదుపాయాన్ని వినియోగించుకున్న చాలామంది.. రెండు మూడు పర్యాయాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. ఎన్ని మార్లు దరఖాస్తులు చేస్తే అన్ని పర్యాయాలు ఓటరుగా నమోదు చేశారు. అలా ఒకే వ్యక్తి రెండు మూడు పర్యాయాలు ఓటరుగా నమోదు కావడంతో వాస్తవ ఓటర్ల కంటే ఎక్కువమంది ఓటర్లు లెక్కలో చేరారు. ఎక్కువ పర్యాయాలు ఉన్న పేర్లను తొలగించడంలో అధికారులు విఫలమయ్యారు. అది కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపింది. ఓటర్లుగా పేరు నమోదు చేయించుకోవడంలో ఉత్సాహం చూపిన పలువురు.. పోలింగ్‌లో దాన్ని ప్రదర్శించలేదు. ముఖ్యంగా నవఓటర్లు.. యువత ఆశించిన స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనలేదు. యంత్రాంగం వైఫల్యం అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైంది. ఓటరు స్లిప్పుల పంపిణీ నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరేంతదాకా ఎన్నికల విధుల్లోని పలు విభాగాల ఉద్యోగుల్లో సమన్వయం లోపించింది. ఉన్నతాధికారులు ఒక విభాగం వారు.. ఉద్యోగులు మరో విభాగం వారు ఉన్నందున విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిచారు. నామినేషన్ల నాటి నుంచి ఈ లోపం కనిపించినా.. పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకే నామినేషన్ల గడువు ముగిసినా.. ఏరోజు ఎంతమంది నామినేషన్లు వేశారో చెప్పేందుకు అధికార యంత్రాంగానికి రాత్రి 9 గంటల వరకు సమయం పట్టిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్‌పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చాలా కేంద్రాల్లో అది జరగలేదు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన పోలింగ్ పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది. ఓటరు జాబితాలో పేరున్నదీ లేనిదీ నిర్ణీత వ్యవధిలోగా చాలామంది ఓటర్లు చూసుకోలేకపోయారు. దానికి విస్తృతప్రచారం కల్పించలేకపోయారు. ఓటరుగా నమోదుకు పెంచిన గడువుపై జరిగిన ప్రచారం.. ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోవడంపై జరగలేదు. తమకు ఎపిక్ కార్డులున్నందున తమ పేర్లు జాబితాలో ఉన్నాయనే అందరూ భావించారు. కార్డున్నంత మాత్రాన సరిపోదని.. జాబితాలోనూ చూసుకోవాలనే సందేశం ప్రజలకు చేరాల్సిన స్థాయిలో చేరలేదు. అది కూడా పోలింగ్‌పై ప్రభావం చూపింది. అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపానికి ఇదో మచ్చుతునక. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం కాగా.. గురువారం సాయంత్రం వరకు కూడా ఎంతమంది ఓటర్లు పోలింగ్‌ను వినియోగించుకున్నారో అధికార యంత్రాంగం స్పష్టం చేయలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం వరకు పేర్కొన్న పోలింగ్ శాతం కంటే.. అంతిమంగా గురువారం వెల్లడించిన పోలింగ్ శాతం తగ్గింది. ఆసక్తి చూపని సంపన్నులు ఖైరతాబాద్ నియోజకవర్గం పంజగుట్ట డివిజన్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 76 శాతం పోలింగ్ అయింది. అదే నియోజకవర్గం ఎర్రమంజిల్ కాలనీలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కేవలం 33 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. విశ్వేశ్వరయ్య భవన్ కేంద్రంలోని అధిక శాతం ఓటర్లు బస్తీల్లో నివసించే పేదలు, నిరక్షరాస్యులు. ఎర్రమంజిల్ కాలనీ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లు సంపన్నులు.. ఎగువ మధ్యతరగతి వర్గాల వారు, బాగా చదువుకున్న వారు కావడం గమనార్హం. -
ఆడ పిండానికి అబార్షన్ గండం
నగరంలోని పలు ఆస్పత్రుల్లో కొనసాగుతున్న అమానుషం కాసులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్లు కన్సల్ట్ వైద్యులతో గుట్టుగా సాగిస్తున్న దందా ఎంజీఎం, న్యూస్‌లైన్ : తల్లి కడుపులో ఎదుగుతున్న ఆడ పిండాలను అబార్షన్ గండం వెంటాడుతోంది. ఆడ శిశువుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా గర్భస్త ఆడ శిశువుల హననం కొనసాగుతోంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే తల్లి కడుపులో ఆడ పిండాల ఆయువు తీస్తున్నారు. జిల్లాలో లైంగిక నిష్పత్తిలో సమతుల్యం దెబ్బతింటోందని స్వచ్ఛంద సంస్థలు, మీడియా గగ్గోలు పెడుతున్నా కొందరు వైద్యులకు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులకు పట్టడం లేదు. కాసుల కోసం కక్కుర్తిపడి ఆడపిల్లను వద్దనుకునేవారికి అబార్షన్ చేస్తున్నారు. వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. హన్మకొండలోని హనుమాన్‌నగర్(పెగడపల్లి డబ్బాలు)లో బుధవారం రాత్రి ‘సాక్షి’ సమాచారంతో మహాలక్ష్మి క్లినిక్‌లో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగరంలో భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. స్కానింగ్‌లో ఆడ పిల్ల అని తేలగానే తల్లిదండ్రులు అబార్షన్ కోసం తాపత్రయపడుతున్నారు. గ్రామాల్లోనైతే కొందరు ఆర్ఎంపీలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగర శివార్లలోని పలు ఆస్పత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆర్ఎంపీలు మగపిల్లలు కావాలనుకునే గర్భిణీలకు హన్మకొండ భీమారంలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయిస్తున్నట్లు రెండు నెలల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సాక్షిలో డిసెంబర్ 20, 2013న కథనం ప్రచురించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. లింగ నిర్ధారణతోనే.. కాసులకు కక్కుర్తిపడి నగరంలోని కొన్నిస్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డాక్టర్లకు సహకరిస్తున్నారు. స్కానింగ్ చేసిన సమయంలో ఆడ, మగా అని లింగ నిర్ధారణ చేయడం నేరమైని తెలిసినా కొంద రు పెడచెవిన పెడుతున్నారు. అక్రమ సంపాదన కోసం అర్రులు చాస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ కొరవడడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. స్కానింగ్ సెంటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పలువురు పలుకుబడి ఉన్న వ్య క్తులు అడ్డుకోవడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న క్లినిక్‌లు నగర పరిధిలో పుట్టగొడుగుల్లా అనుమతి లేని క్లినిక్‌లు నడుస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేయడంతోపాటు ఏకంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. అబార్షన్ కేసులో చిక్కిన మ హాలక్ష్మి క్లినిక్‌ను సదరు వైద్యురాలు 15 ఏళ్లుగా ఎలాం టి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఆయుర్వేద వైద్యురాలైన డాక్టర్ ప్రమీలాకుమార్ ఎలాంటిఅర్హత లేకుండానే గైనకాలజిస్టుగా చెలామణి అవుతూ శస్త్రచికిత్సలు చేస్తున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహాలక్ష్మి క్లినిక్ సీజ్ చేస్తాం : డీఎంహెచ్ఓ ఆనుమతి లేకుండా క్లినిక్ నిర్వహించడమేగాక భ్రూణ హత్యకు పాల్పడిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ప్రమీల కుమార్ వ్యవహారంపై విచారణ జరుగుతుందని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. మహాలక్ష్మి క్లినిక్‌కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయుర్వేద వైద్యురాలు శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదని, ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేసే మెరుగైన సౌకర్యాలు కూడ ఏమీ లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పెషంట్లు డిశ్చార్జ్ అయిన వెంటనే ఆస్పత్రిని సీజ్ చేస్తామని తెలిపారు.