మువ్వా హవ్వా!
33 మంది ఎంఈవోలను తప్పించి తన వారిని నియమించుకునే యత్నం
తాము పనిచేయలేమని కొందరు ఎంఈవోల నుంచి బలవంతంగా లేఖలు
ఆయన మళ్లీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి గంటాకు ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు
ఆరోపణల్లో నిజం లేదని మువ్వా వివరణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
వివాదాస్పద పరిస్థితుల్లో మరోసారి జిల్లాకు వచ్చిన డీఈవో మువ్వా రామలింగం పనితీరుపై అప్పుడే వివాదాలు ముసురుకుంటున్నాయి. మండల విద్యాశాఖాధికారులను బలవంతంగా తప్పించి ఆ స్థానంలో తన ప్రయోజనాలు తీర్చే వారిని నియమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మానవవనరులశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాయి.
వివాదాస్పద పరిస్థితుల్లో బదిలీ
జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన మువ్వారామలింగం వివాదాస్పద పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రాష్ట్ర స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని మువ్వా రెండు నెలల కిందట మళ్లీ జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చారు. గతంలో ఆయన వివాదాస్పద పనితీరు వల్ల కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రెండోసారి ఆయన రాకను వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో రామలింగం జిల్లా విద్యాశాఖపై తన పట్టు సాధించుకోవడానికి వ్యూహ రచన చేశారు. జిల్లాలో పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో ఎంఈఓలుగా పనిచేస్తున్న 33 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయుల్లో ఎక్కువ మందిని తప్పించి తనకు ఉపయోగపడే వారిని నియమించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. తాము ఎంఈఓలుగా పనిచేయలేమని వారి నుంచి బలవంతంగా లేఖలు తీసుకునేలా ఉప విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉపవిద్యాధికారులు కొందరు ఎంఈఓల నుంచి ఈ తరహా లేఖలు తీసుకుని ఎంఈఓలుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి లేఖలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియామకాల వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ మీద మానవవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అంగీకారంతోనే మార్పులు చేయాలనుకుంటున్నాం : డీఈఓ మువ్వా రామలింగం
జిల్లాలో పనిచేస్తున్న కొందరు మండల విద్యాశాఖాధికారులను వారి అంగీకారంతోనే మార్చాలని యోచిస్తున్నాం. అంతే కానీ ఇందులో ఇతరత్రా ఏమేమో జరిగినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏ ఎంఈఓ నుంచి కూడా బలవంతంగా లేఖలు తీసుకోవడం లేదు.