ఎలా సర్వేశ్వరా..?
► సర్వే శాఖలో సిబ్బంది లేక సతమతం..
► నిలిచిపోయిన ముఖ్యమైన సర్వేలు
► సెలవులో ఎ.డి.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని భూమి, సర్వే శాఖ సిబ్బంది కొరతతో అల్లాడుతోంది. జిల్లాలో అధికారికంగా చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలకు సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైతుల అవసరార్థం నిత్యం ఏదో ఒక సర్వే కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. కానీ సిబ్బంది కొరత తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. సర్వే శాఖలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ సర్వేయర్లు ఉండాలి. కానీ ఎనిమిది మందే ఉన్నారు. ఇప్పుడు ఏం అవసరం వచ్చినా ఒక మండలం నుంచి మరో మండలానికి సర్వేయర్లు వెళ్లాల్సిందే! ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రైవేటు సర్వేయర్లకు తర్ఫీదు ఇచ్చేవారు కూడా లేరు. ప్రభుత్వానికి సంబంధించి ఏపీఐఐసీ కోసం స్థల సేకరణతోపాటు పలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుకు సర్వే చేరుుంచాల్సి ఉందని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అవసరమైన సర్వేయర్లు మాత్రం జిల్లాలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.
అసలే లేరంటే...
అసలు సిబ్బందే తక్కువంటే.. ఇక్కడి నుంచి డెప్యుటేషన్‌పై సర్వేయర్లను, డిప్యూటీ సర్వేయర్లను పంపిస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నారుు. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సర్వే కార్యక్రమాలు అట్టడుగున నిలిచారుు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో సర్వే కార్యక్రమం కావాలన్నా జిల్లా సర్వేయర్లు, ముఖ్యమైన అధికారులను పంపిస్తున్నారు. ఇలా సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్‌సర్వే వంటి అధికారులను ఇప్పటికే పంపించారు. అది ఇంకా కొనసాగుతోంది.
మచిలీపట్నానికి నలుగురు ఉప తహసీల్దార్లు
జిల్లాలో పని చేస్తున్న నలుగురు ఉప తహసీల్దార్లను ఇటీవలే మచిలీపట్నంలోని (మాడా) అభివృద్ధి సంస్థకు పంపించారు. మక్కువకు చెందిన పి.మోహనరావు, కురుపాం నీలకంఠరావు, టాస్క్‌ఫోర్స్ సర్వేయర్లు పి.ఖాదర్, రామ్‌కుమార్‌లను పంపించారు. దీంతో ఇక్కడ మరింత ఇబ్బందులు తప్పడం లేదు.
ఇనాం సర్వేలు, గ్రామ సర్వేలు పెండింగ్‌లోనే..
ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న ఇనాం సర్వేలు, గ్రామాల్లో అస్సలు జరుగని సర్వేలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న దశలో ఇలా అధికారులు, సర్వేయర్లు జిల్లా నుంచి వెళ్లిపోతుండటం సమస్యలను తగ్గించేందుకు అవాంతరాలుగా నిలుస్తున్నారుు. అలాగే ఇనాం సర్వేలకు కూడా ఇన్చార్జిలుగా వివిధ ప్రాంతాలనుంచి సర్వేయర్లను నియమించారు. అరుుతే శ్రీకాకుళం వంటి పొరుగు జిల్లాల్లో అదనంగా సర్వేయర్లున్నా.. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి నుంచి కొంత మంది సర్వేయర్లను ఇక్కడ నియమిస్తే శాఖాపరంగా ఇబ్బందులు తొలగే పరిస్థితి ఉంది.
సెలవులో ఎ.డి.
జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎం.గోపాలరావు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై ఇప్పటికీ ఆయన స్థానంలో ఎవరినీ ఇన్చార్జిగా కానీ, ఎఫ్ఏసీగా కానీ నియమించలేదు. అరుుతే ఇక్కడ సీనియర్ అధికారిగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బీఎల్ నారాయణను ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నా.. ఇంకా ఉన్నతాధికారులు ఆదేశాలివ్వలేదని తెలుస్తోంది.