పీసీ అమ్మకాలు పుంజుకుంటాయ్
న్యూయార్క్/న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సాంకేతిక తోడ్పాటునందించడాన్ని నిలిపేయాలన్న మైక్రోసాఫ్ట్ నిర్ణయించడం వల్ల పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు కొంచెం మెరుగుపడతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు, ఐడీసీ, గార్ట్నర్లు అంచనా వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నిర్ణయం వల్ల పడిపోతున్న పీసీల అమ్మకాలు స్వల్పంగా పుంజుకోగలవని ఈ సంస్థల అభిప్రాయం. విండోస్ ఎక్స్‌పీని ఉపయోగించే పీసీల స్థానంలో తాజా ఓఎస్‌లపై నడిచే పీసీలను వినియోగిస్తారని ఫలితంగా పీసీల విక్రయాలు పుంజుకోగలవని ఈ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001 అక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకటిది.
ఐడీసీ, గార్ట్నర్ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం...,
ఈ ఏడాది మొదటి క్వార్టర్లో పీసీల అమ్మకాలు 1.7 శాతం క్షీణించి 7.66 కోట్లకు చేరాయని గార్ట్నర్ పేర్కొనగా, 4.4 శాతం క్షీణించి 7.34 కోట్లకు తగ్గాయని ఐడీసీ తెలిపింది.
మొబైళ్లు, ట్యాబ్‌ల వినియోగం పెరుగుతుండటంతో పీసీల అమ్మకాలు తగ్గుతున్నాయ్.
వృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది మొదటి క్వార్టర్లో పీసీలకు డిమాండ్ గత ఏడాది ఇదే క్వార్డర్లో ఉన్న డిమాండ్‌తో పోల్చితే స్వల్పంగా పెరిగింది.
విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్‌ను నిలిపేయడం జపాన్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో పాటు అమ్మకం పన్నులో మార్పు కారణంగా జపాన్‌లో పీసీల విక్రయాలు 35 శాతం వృద్ధి చెందాయి.
ఇక పీసీ విక్రయాల్లో చైనా కంపెనీ లెనొవొ 17% మార్కెట్ వాటాతో, 1.29 కోట్ల పీసీల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది.