ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్‌ను సాధించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది.
ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్‌షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్‌ఫామ్‌పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది.
కాగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్‌లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది.