కార్లపై జీఎస్‌టీ సెస్ పెంపుపై ఈ వారంలో ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: పెద్ద కార్లు, ఎస్‌యూవీలు, మిడ్‌సైజ్ కార్లపై జీఎస్‌టీ సెస్‌ను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనపై ఈ వారంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా కార్ల ధరలు తగ్గినందున, వీటిపై సెస్‌ను పెంచే ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆగస్టు 5న ఆమోదం తెలిపింది. అయితే సెస్ పెంపునకు జీఎస్‌టీ చట్టం సెక్షన్ 8లో సవరణలు చేయాల్సివుంటుంది.
అందుచేత ఈ సవరణకు అవసరమయ్యే ఆర్డినెన్స్ జారీపై వచ్చే కొద్దిరోజుల్లో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సెస్ పెంపుపై నిర్ణయం తీసుకునేముందు...రోడ్డు రవాణా, భారీ పరిశ్రమల శాఖల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ జారీ తర్వాత ఆరునెలలలోపుగా చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం పొందాల్సివుంటుంది. తదుపరి సెస్ పెంపును ఎప్పటినుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు. జీఎస్‌టీ కౌన్సిల్ తదుపరి భేటీ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరుగుతుంది.