Minister k taraka rama rao
-
అన్నీ కుదిరితే.. త్వరలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: అదిగో డబుల్ డెక్కర్.. ఇదిగో డబుల్ డెక్కర్ అంటూ ఊరించిన ఆర్టీసీ చివరకు వాటి ధరతో హడలిపోతోంది. అవసరమైన నిధులపై మల్లగుల్లాలు పడుతోంది. ముందుగా ప్రతిపాదించిన ప్రకారం నగరంలో కొత్తగా 25 డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టాలంటే ఇప్పటికిప్పుడు రూ.17 కోట్లు కావాలి. అన్ని డబ్బులు లేకపోవడంతో కొత్త డబుల్ డెక్కర్ బస్సులకు ఆర్డర్ ఇవ్వలేకపోతోంది. అయితే హైదరాబాద్ సిటీ షాన్‌ను తిరిగి తెప్పించేందుకే ఈ బస్సులు కొనాలనుకున్నందున.. ఆ ఖర్చును పురపాలక పట్టణాభివృద్ధి శాఖ భరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదే విషయాన్ని ఆ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా కేటీఆర్‌దే కావటంతో సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే ఆశాభావంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఒక్కో బస్సు రూ.68 లక్షలు.. మొదట్లో 40 బస్సులు ప్రారంభించాలని భావించినా వాటికయ్యే వ్యయం దృష్ట్యా 25 బస్సులకు పరిమితమయ్యారు. ఈ మేరకు టెండర్లు పిలవగా, ఐషర్, అశోక్ లేలాండ్, వీరవాహన, ఎంజీ కంపెనీలు స్పందించాయి. చివరకు అశోక్ లేలాండ్ టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు చొప్పున ధర కోట్ చేసింది. అయితే టీఎస్ఆర్టీసీ చర్చల నేపథ్యంలో చివరకు రూ.68 లక్షలకు ఖరారు చేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత ధర పెట్టి 25 బస్సులు కొనేందుకు ఆర్టీసీ వద్ద డబ్బులు లేకపోవటంతో కొనుగోలు దిశగా ముందుకు వెళ్లలేకపోతోంది. ఆ అప్పులోంచి డబ్బులిచ్చినా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ఆర్టీసీ ఓ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది. వివిధ రూపాల్లో చెల్లించాల్సినవి రూ.2 వేల కోట్లు, దగ్గరున్నవి రూ.500 కోట్లే కావటంతో సీఎంతో చర్చించిన ఎలా ఖర్చు చేయాలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లకు పూచీకత్తు ఇవ్వగా, ఆ బ్యాంకు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో మిగతా రూ.500 కోట్లను మరోచోట నుంచి తెచ్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. అదే అప్పు నుంచి డబుల్ డెక్కర్ బస్సులకు నిధులు కోరే ఆలోచనలో ఉంది. ఆశించిన విధంగా మంత్రి కేటీఆర్ స్పందించినా, రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు అప్పు నుంచి వాడుకునేందుకు అనుమతించినా.. కొత్త డబుల్ డెక్కర్ బస్సుల్ని మరోసారి భాగ్యనగరంలో పరుగులు తీయించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఒక ట్వీటు .. వెంటనే స్పందన డబుల్ డెక్కర్లు ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇతర ప్రాంతాల నుంచి నగర పర్యటనకు వచ్చినవారు ఈ బస్సులో ఒకసారైనా పైన కూర్చొని ప్రయాణించకుండా వెళ్లేవారు కాదు. సికింద్రాబాద్–మెహిదీపట్నం వంటి కొన్ని పరిమిత రూట్లలో ఈ బస్సులు నడిచేవి. వీటిల్లో సికింద్రాబాద్–అఫ్జల్‌గంజ్–జూ పార్క్ రూటు బాగా ప్రజాదరణ పొందింది. గత ఏడాది నవంబర్ 7న నగరవాసి ఒకరు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్–జూపార్క్ 7 జడ్ నంబర్ పాత డబుల్ డెక్కర్ ఫొటోను పంచుకుంటూ.. నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వస్తే బాగుంటుందని ట్వీట్ చేశాడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. అప్పట్లో హైదరాబాద్‌కు అలంకారంగా ఉన్న ఆ బస్సులను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదని పేర్కొన్నారు. అవకాశం ఉంటే మళ్లీ నడిపే అంశాన్ని పరిశీలించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచిస్తూ ట్వీట్ చేశారు. దీనికి పువ్వాడ వెంటనే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడటంతో డబుల్ డెక్కర్ల కొనుగోలు తెరపైకి వచ్చింది. ప్రతిపాదిత రూట్లు ఇవే.. నం.219: సికింద్రాబాద్–పటాన్చెరు వయా బాలానగర్ 229: సికింద్రాబాద్–మేడ్చల్ వయా సుచిత్ర 218: కోఠి–పటాన్చెరు 9 ఎక్స్: సెంట్రల్ బస్‌స్టేషన్–జీడిమెట్ల 118: అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం -
రైతులకు ట్యాబ్‌లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: చదువు రాని వారని రైతులను తక్కువ అంచనా వేయొద్దని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ల రాకతో వారు ఎంతో అవగాహన పెంచుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరగాలని, రైతులకు ట్యాబ్‌లు అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలని కోరారు. సాగు రంగంపై వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. ‘ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో డెమానిస్ట్రేట్ ఫార్మ్‌ల ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వర్సిటీ కేంద్రంగా కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రొఫెసర్ స్వామినాథన్, జయతీ ఘోష్, పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్‌ను మంత్రివర్గ ఉపసంఘం సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించాలి. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలి’అని కేటీఆర్ కోరారు. 2021–22 సంవత్సరానికి గాను రైతుబీమా వార్షిక ప్రీమియం కింద రూ.1,450 కోట్ల చెక్కును ఎల్ఐసీకు ఈ కార్యక్రమంలో మంత్రులు అందజేశారు. వేరుశనగ సాగును ప్రోత్సహించాలి... యాసంగిలో వేరుశనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వేరుశనగ వంగడాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం నుంచి ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆలుగడ్డ సాగును పెంచుకోవడానికి స్థానికంగా విత్తన లభ్యతను పెంచాల్సి ఉందన్నారు. రైతుకు మించిన శాస్త్రవేత్త లేడని, అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 150 సహకార సంఘాలు చురుకుగా పనిచేస్తున్నాయని, మిగతా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు తగ్గించి, అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. చెరుకు సాగును ప్రోత్సహించాలన్నారు. గతంలో దిగుబడి సరిగ్గా లేక చెరుకు రైతులు నష్టపోయారని, ఇప్పుడు 60 నుంచి 100 టన్నుల దిగుబడినిచ్చే వంగడాలు మార్కెట్లోకి వచ్చాయన్నారు. చిన్న కమతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరుతున్నా రైతుల్లో పెద్దగా స్పందన రావడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల సాగు తగ్గిందని, మార్కెటింగ్ సమస్యలే దీనికి కారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆర్గానిక్ సాగు వైపు ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. మిద్దె తోటలకు ప్రోత్సాహం... వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి. సాగు పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేయాలి. వేరుశెనగ, టమాటా ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలతో పాటు మిద్దె తోట సాగును ప్రోత్సహించాలి. దుర్భిక్షం నుంచి సుభిక్షం.. రాష్ట్ర వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి సంవృద్ధి సాధించింది. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉండేది. నేడు అక్కడ లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తోంది. – కేటీఆర్ -
ఈ కామర్స్‌తో చేనేతకు చేదోడు
ఖైరతాబాద్: ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు కొత్తదనం తీసుకువస్తున్నామని చెప్పారు. శనివారం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వేదికగా వారంపాటు ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. స్టాళ్లలోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీతాంబరం, ఆర్మూర్ చీరల పునరుద్ధరణ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ గోల్కొండ వెబ్‌సైట్‌తోపాటు చేనేత ఫ్యాషన్ షోను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. 31 మంది చేనేత కళాకారులను సత్కరించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ను రూ.70 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళలలకు వైభవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్, సిల్క్ చీరలు, నారాయణపేట కాటన్, వరంగల్ జరీలు, కరీంనగర్ బెడ్షీట్లు తెలంగాణ కళాకారుల అత్యున్నత నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అద్భుత చేనేత కళాకారులను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి చేనేత ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. 25,319 మందికి చేనేతమిత్ర చేనేతమిత్ర పథకం ద్వారా 25,319 మంది చేనేత, అనుబంధ కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటివరకు రూ.13 కోట్ల 34 లక్షలు జమ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం ద్వారా 2010 నుంచి 2017 వరకు తీసుకున్న రుణాలపై రూ.28 కోట్ల 96 లక్షల మేర మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చామన్నారు. అందరం బాధ్యతగా ముందుకొచ్చి చేనేత రంగాన్ని బతికించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : పురపాలకశాఖ మంత్రిగా కె. తారక రామారావు సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఆదివారం మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మసాబ్ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో సంబంధిత విభాగాధిపతులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. దీనితోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపైన విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతానని తెలిపిన మంత్రి.. శాఖ కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపై నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు విభాగాధిపతులు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేస్తామని మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి 5వ స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017–18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు. విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది. అంతర్రాష్ట్ర వాటాలు ఇలా.. అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది. మంత్రి కేటీఆర్ హర్షం విదేశీ ఎగుమతుల్లో 5వ స్థానంలో తెలంగాణ నిలవడం హర్షణీయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఉత్పత్తి రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరసన నిలవటం గర్వంగా ఉందన్నారు. -
అటు చార్మినార్.. ఇటు ఇమేజ్ టవర్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్(ఏవీజీసీ) పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ రాష్ట్రానికి మరో చార్మినార్‌లా కీర్తిప్రతిష్టలు తెచ్చి పెడుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సృజనాత్మక రంగ పరిశ్రమలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తామని, అందుకే ఇమేజ్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో ఇమేజ్ టవర్ నిర్మాణ పనులకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏవీజీసీ పరిశ్రమలకు అత్యాధునిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాలకు ఇమేజ్ టవర్ అద్దం పడుతుందన్నారు. ప్రైవేటు–పబ్లిక్ భాగస్వామ్యంతో రూ.945 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని, 2020 నాటికి పూర్తవుతుందని చెప్పారు. 16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ భవనంలో మోకాప్ స్టూడియోలు, ట్రీన్‌మ్యాట్ స్టూడియోలు, సౌండ్స్ అండ్ అక్విస్టిక్ స్టూడియోలు, కలర్ కోడింగ్ అండ్ డీఐ స్టూడియోలు, రెండర్ ఫారŠమ్స్, డాటా సెంటర్, హై డెఫినేషన్ బ్యాండ్ విడ్త్, షేర్డ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. గేమింగ్, యానిమేషన్ పరిశ్రమల అభివృద్ధికి ఈ భవనం చోదక శక్తిగా ఉపయోగపడుతుందన్నారు. ఏవీజీసీ రంగానికి సంబంధించి సకల సదుపాయాలను ఇలా ఒకే గొడుగు కింద అందించడం ఆసియా, ఫసిపిక్ దేశాల్లో ఇదే తొలిసారి అని, యూకేలోని మీడియా సిటీ, సియోల్‌లోని డిజిటల్ సిటీలను తలదన్నేలా ఈ భవనం ఉంటుందని పేర్కొన్నారు. ఏ దిక్కు నుంచి చూసినా ఆంగ్ల అక్షరం ‘టీ’ఆకారంలో కనిపించే విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. టెక్నాలజీ ఎగుమతులు, ఉద్యోగాల సృష్టిని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఏవీజీసీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే ఐటీ/ఐటీఈఎస్ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండగా.. ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న విధానాలతో సృజనాత్మక పారిశ్రామిక కేంద్రంగా తెలంగాణ రూపు దిద్దుకుంటుందని చెప్పారు. ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో యానిమేషన్ డిగ్రీ స్థాయిలోని అన్ని ఫైన్ ఆర్ట్స్ కోర్సులు, ఐటీఐ, ఇతర నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సుల్లో యానిమేషన్, గేమింగ్‌లను చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. టాస్క్ ద్వారా ఏవీజీసీ రంగంలో యువతకు శిక్షణ కల్పిస్తామన్నారు. ఇమేజ్ యానిమేషన్ రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 27,000 చదరపు అడుగుల స్థలంలో ఇన్క్యుబేటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలకు దేశంలో మంచి వ్యాపార అవకాశాలున్నాయని, అయినా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అన్నారు. యానిమేషన్, గేమింగ్‌కు పుట్టినిళ్లు విజువల్ ఎఫెక్టŠస్ స్టూడియోలు, 2డీ, 3డీ యానిమేషన్, గేమింగ్ రంగాలకు చెందిన 100 పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయని, 30 వేల మంది వృత్తి నిపుణులు ఇందులో పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏవీజీసీ పరిశ్రమలు ఏటా 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఇక్కడ రూపొందిస్తున్నాయన్నారు. ‘‘విజువల్ ఎఫెక్టŠస్ ద్వారా సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బాహుబలి, లైఫ్ ఆఫ్ పై, అరుంధతి, మగధీర, ఈగ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రాష్ట్రం పుట్టినిళ్లు. ప్రపంచంలోని అత్యుత్తమ యానిమేషన్ గేమ్స్ అయిన ఫార్మ్ విల్, ఎస్కేప్ ఫ్రం మడాగాస్కర్లను హైదరాబ్లోనే అభివృద్ధి చేశారు. విజువల్ ఎఫెక్టŠస్కు సంబంధించి ఎన్నో ఇంగ్లిష్ బ్లాక్ బస్టర్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి’’అని మంత్రి వివరించారు. యానిమేషన్, గేమింగ్స్ రంగంలో యువతకు శిక్షణ కల్పించేందుకు డిసెంబర్ 16న ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. లక్షా 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ఇండియా–2017 సదస్సు సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇస్తున్న రాయితీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు ఈ రంగంలో పరిశ్రమల ఏర్పాటు కోసం 13 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బికనీర్‌వాలా, ప్రయాగ్ న్యూట్రియన్స్ ఫుడ్, అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బేకరీస్, బ్లూక్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీమ్‌లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలు తదితర రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మొత్తంగా సదస్సులో రెండు రోజుల్లో కుదుర్చుకున్న మొత్తం ఒప్పందాల విలువ రూ.7,200 కోట్లకు చేరింది. వీటి ద్వారా రాష్ట్రంలో 10 వేల మందికి ప్రత్యక్షంగా.. 20 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం తెలంగాణలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని.. 1,25,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం పెద్దదే అయినా.. రైతులను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో అనుసంధానం చేయడం ద్వారా అది సాధ్యమవుతుందని ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చేపల పెంపకం, ఆగ్రో ఉత్పత్తుల సాగులో శిక్షణ ఇచ్చి నాణ్యమైన ఉత్పత్తులు చేయండం ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చు. ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరింత ఆయకట్టు సాగులోకి వచ్చి రైతుల ఆదాయంలో వృద్ధి వచ్చే అవకాశముంది. మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేస్తున్న చెరువులను సాగునీటి అవసరాలకే కాకుండా చేపల పెంపకానికి కూడా వినియోగిస్తాం. ఇది ఒక విప్లవం కాబోతోంది. ఈ–నామ్ మార్కెట్ల ద్వారా మధ్యవర్తి అవసరం లేకుండా రైతు తాను పండించిన పంటను నేరుగా అమ్మే వెసులుబాటు ఉంది. మొత్తంగా ఒకే పంటపై ఆధారపడకుండా అదనంగా గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చెరువుల్లో చేపల పంపకం, ఆగ్రో ఉత్పత్తుల సాగులో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల సామర్థ్యాన్ని కూడా 4 లక్షల టన్నుల నుంచి 21 లక్షల టన్నులకు పెంచాం..’’ అని తెలిపారు. సులభ వ్యాపారంలో మేమే నంబర్ వన్ సులభతర వాణిజ్య, వ్యాపార అంశం (ఈవోడీబీ)లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని.. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, అనుమతుల మంజూరులో పారదర్శకతే దీనికి కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని, జాప్యం చేస్తే సంబంధిత అధికారిపై జరిమానా కూడా విధిసున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ప్రారంభించిన రెండున్నరేళ్లలో ఐదు వేల అనుమతులిచ్చామని.. తద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు, రెండున్నర లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆరు రకాల నేలలు భిన్న పంటలకు నిలయంగా ఉన్నాయని, అందుకే తెలంగాణ సీడ్ బౌల్‌గా ఉందని చెప్పారు. పసుపు సాగులో దేశంలోనే మొదటి స్థానంలో, మిర్చి, మొక్కజొన్నలో రెండో స్థానం, గుడ్ల ఉత్పత్తి, మామిడిలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నామని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని రకాల అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోని ముఖ్య అంశాలు – పాలసీ కాలపరిమితి ఐదేళ్లు.. – వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ – 1,25,000 ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక – రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం – దీని కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం, పశుసంపద పంపిణీ కార్యక్రమాలను అనుసంధానం చేయడం – అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయం–ఆహార ఉత్పత్తుల వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయడం – ఇందుకోసం ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కుల అభివృద్ధి – సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20 శాతం పెంచడం – పాలసీలో భాగంగా స్టార్టప్స్ కోసం అగ్రి నిధి ఏర్పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కల్పిస్తున్న రాయితీలివే.. – ఆయా పరిశ్రమలకు భూముల ధరల తగ్గింపు – స్టాంపు డ్యూటీ, కరెంటు బిల్లులు, వ్యాట్ రీయింబర్స్మెంట్, వడ్డీపై సబ్సిడీ – మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చించిన ఖర్చు రీయింబర్స్ – ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి సాయం – శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి కోసం చేసే ఖర్చు రీయింబర్స్ -
ఐ- తెలంగాణ 2017 సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 సదస్సును ఐటీ శాఖమంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇదే ప్రాంగణలోన టీ- ఎయిర్ సమ్మిట్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్నెట్, రోబోటిక్స్‌పై చర్చించనున్నారు. -
కాలిఫోర్నియాతో తెలంగాణ ఎంఓయూ
► సంప్రదాయేతర ఇంధన రంగంలో పరస్పర సహకారం ► కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్‌తో కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో పరస్పర సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో.. కాలిఫోర్నియా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు గురువారం కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రీ బ్రౌన్‌తో సమావేశమయ్యారు. ఇద్దరి సమక్షంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇరు పక్షాలమధ్య ఈ ఒప్పందం కుదరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మినిస్టీరియల్ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 13 ప్రాంతాలకు ఆహ్వానం అందగా.. భారత్ నుంచి కేవలం తెలంగాణకు మాత్రమే చోటు దక్కింది. లింక్డ్ఇన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌కు ఆహ్వానం: లింక్డ్ఇన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మెన్తో మంత్రి కేటీఆర్ గురువారం భేటీ అయ్యారు. భారతదేశంలో లింక్డ్ ఇన్ విస్తరణ ప్రణాళికలపై ఆరా తీసిన మంత్రి.. కంపెనీ ప్రణాళికల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పర్యటనకు రావాల్సిందిగా హాఫ్మెన్ను ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన హాఫ్‌మెన్, వచ్చే ఏడాది తమ కంపెనీ ప్రతినిధి బృందంతో కలసి హైదరాబాద్ పర్యటనకు వస్తామని తెలిపారు. అనంతరం కేటీఆర్, శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు ఉన్న అవకాశాలను సేల్స్‌ఫోర్స్ ప్రతినిధులకు వివరించారు. -
గ్రామాల రూపురేఖలు మార్చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో సీఎస్ఆర్ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలోని 8,700 గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 46 వేల చెరువులు ఉన్నాయని.. వాటన్నిటిని మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో రూ.20వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.35వేల కోట్లతో మంచి నీటిని ప్రతి ఒక్కరికీ అందించే దిశగా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణానది మూడోదశ నవంబర్ 15లోగా పూర్తవుతుందని, గోదావరి నీటిని డిసెంబర్ 15లోగా నగరానికి తీసుకువస్తామని చెప్పారు. హైసియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ పథకంలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఐ, ఫిక్కినాస్ డాట్కాం వంటి కంపెనీలు పాలుపంచుకున్నాయి. సామాజిక సేవలు చేసినందుకు పలు కంపెనీలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, హైసియా ప్రతినిధులు రమేశ్ లోకనాథన్, భరణి తదితరులు పాల్గొన్నారు. -
గాడ్జెట్ ఎక్స్పో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రదర్శన, సదస్సు ‘ఇండియా గాడ్జెట్ ఎక్స్పో 2015’ ఇక్కడి హైటెక్స్ వేదికగా శుక్రవారం మొదలైంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ప్రదర్శన 21 వరకు సాగనుంది. గాడ్జెట్ ఎక్స్పో హైదరాబాద్‌లో జరగడం ఇది రెండోసారి. 100కుపైగా దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నూతన టెక్నాలజీని, ఉపకరణాలను ఇవి ప్రదర్శిస్తున్నాయి. 50 స్టార్టప్ కంపెనీలు సైతం ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు 5 ఉత్పాదనలను ఆవిష్కరించనున్నారు. ఓర్విటో, బి-వన్లు ప్రపంచంలో తొలిసారిగా తమ ఉత్పాదనలను ప్రదర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇండియా గాడ్జెట్ ఎక్స్పో ప్రపంచ ప్రముఖ ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తుందని తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భాగంగా గాడ్జెట్ ఎక్స్పో వేదికగా 100 కంపెనీల సీఈవోలతో సమావేశమవుతున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగంలో ఉన్న ఎస్ఎంఈల కోసం టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్స్పో చైర్మన్ జె.ఎ.చౌదరి ఈ సందర్భంగా మంత్రిని కోరారు. సేఫర్ పెండెంట్.. చూడ్డానికి ఇది పెండెంట్ మాత్రమే. ఆపదలో ఉన్న వ్యక్తులకు మాత్రం రక్షణ కవచం. ఢిల్లీ కేంద్రంగా ఉన్న స్టార్టప్ కంపెనీ లీఫ్ వేరబుల్స్ ‘సేఫర్’ పేరుతో దీనిని అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌లో సేఫర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని పెయిర్ (అనుసంధానం) చేయాలి. అత్యవసర సమయాల్లో పెండెంట్ వెనకాల ఉన్న చిన్న బటన్‌ను నొక్కితే చాలు. స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా నిర్దేశించిన అయిదుగురు వ్యక్తుల మొబైల్స్‌కు సందేశం వెళుతుంది. దర రూ.2,700. కంపెనీ ఇచ్చే జీవితకాల సర్వీసుకు ఎటువంటి చార్జీ ఉండదు. పెండెంట్‌తో సెల్ఫీ కూడా తీసుకోవచ్చని లీఫ్ వేరబుల్స్ మార్కెటింగ్ డెరైక్టర్ పరాస్ బాత్రా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పెండెంట్ వాడుతున్న వ్యక్తి స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటే ఆపద సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నది గూగుల్ మ్యాప్ లొకేషన్ చిత్రం రూపంలో అయిదుగురికి చేరుతుంది. నెట్ కనెక్షన్ లేకపోయినా ప్రాంతం చిరునామా సందేశం రూపంలో వెళ్తుంది. -
పరువు తీస్తారా?
సాక్షి, సంగారెడ్డి: ‘రోడ్లను అద్దంలా తయారు చేయాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే.. ఆయన సొంత జిల్లాలోనే ఒక్క రోడ్డు కూడా ప్రారంభించరా..?, ఏం చేస్తున్నారు..?, పక్క జిల్లా నల్గొండలో పనులు పూర్తి కావచ్చాయి.. సీఎం జిల్లా పరువు తీస్తున్నారు..’అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పీఆర్, ఆర్ అండ్‌బీ అధికారులపై మండిపడ్డారు. త్వరలో పనులు పూర్తి చేయండి.. రెండు, మూడు నెలల్లో మళ్లీ వస్తా.. అప్పటికీ పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవం టూ హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలోని కలెక్టరే ట్ సమావేశ మందిరంలో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్, పీఆర్, ఆర్అండ్బీ పనులపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ రాజ్ రోడ్డు పునరుద్ధరణ పనులు, జిల్లాకు కొత్తగా మంజూ రైన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడం పై ఆ శాఖ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రూ.1,769 కోట్లతో రోడ్లు మంజూరు చేశామన్నారు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు ఇప్పటివరకు రోడ్ల పనులు ప్రారంభించలేని మంత్రి హరీష్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదే విషయమై ఆయన పీఆర్ ఎస్ఈ ఆనందంను ప్రశ్నించగా ప్రతిపాదనలు రూపొందిస్తున్న ట్టు చెప్పారు. పొరుగు జిల్లా నల్గొండలో ఇప్పటివరకు నాలుగు ప్యాకేజీలు పూర్తయ్యాయని ఇక్కడ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నారా?, ఇలా పనిచేస్తే ఎలా? అంటూ కేటీఆర్ నిలదీశారు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు నీళ్లు నములుతూ పనుల ప్రారంభించటంలో జాప్యంపై ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకునే ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని, ప్రతి పాదనలు పంపినా ఎస్ఈ అనుమతులు మంజూరు చేయటం లేదని పీఆర్ ఈఈ వేణుమాదవ్ తెలిపారు. ‘మీ శాఖలోనే ఇన్ని సమస్యలుంటే ఎలా?’ అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.ఈ విషయమై పీఆర్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణను వివరణ కోరగా ‘సార్ ఈ జిల్లా అధికారుల్లో సోమరితనం ఎక్కువ’ అందుకే పనులు పూర్తికావటంలేదని తెలిపారు. మెదక్ జిల్లాలో అధికారుల వ్యవస్థ బాగోలేదు.. పదిరోజుల్లో సమీక్ష నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దండి అని కేటీఆర్ పీఆర్ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. రోడ్డు పనుల్లో నాణ్యత లేకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అధికారుల తీరుపై మంత్రి హరీష్‌రావు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఏకకాలంలో పనులు చేపట్టండి... వాటర్‌గ్రిడ్ పనులను ఏకకాలంలో పలుచోట్ల చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ ఆధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచిం చారు. పనులు జరుగుతున్న తీరును మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు సమీక్షిస్తారని చెప్పారు. జిల్లాలో నాలుగు వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు చేపడుతున్నట్టు వివరించారు. వాటర్‌గ్రిడ్ కోసం 4 టీఎంసీ నీళ్లు, 8 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీ, పీఆర్, ఆర్అం డ్ బీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సకాలంలో గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ, రైల్వే అనుమతులను ముందస్తుగానే పొందాలని సూచించారు. వేసవిలో తా గునీటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలన్నారు. గ్రామాలకు కరెంటు కోతలొద్దు.. వేసవి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా గ్రామాల్లో కరెంటు కోతలు విధించ కూడదని మంత్రి కేటీఆర్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. పంచాయతీలు చెల్లించాల్సిన విద్యు త్ బకాయిల విషయంలో డీపీఓ, ట్రాన్స్‌కో ఎస్ఈ లెక్కలు వేర్వేరుగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డీపీఓకు సూచించారు. ఇందిర జలప్రభ కింద మం జూరైన బోర్లకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈజీఎస్ పనులను వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు పిం ఛన్లు అందజేయాలని డీఆర్డీఏ పీడీకి సూ చించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్ పాల్గొన్నారు.