అవి చీకటి రోజులు
నిజాం పాలన చరమాంకంలో తెలంగాణలో ఊళ్లకూళ్లు రక్తంతో తడిశాయి. రజాకార్ల దురాగతాలకు పల్లెలు తల్లడిల్లాయి. ఆడపడుచులు, అమ్మలు, ముసలవ్వలు.. ఇలా ఆడవాళ్లందరూ మానప్రాణాల కోసం సొంతూళ్లను వదిలి వలస వెళ్లారు. బతుకు జీవుడా అంటూ ఊరు కాని ఊరు వెళ్లి తలదాచుకున్నారు. ఆ చీకటి రోజుల గురించి ఆ తరం మనిషి.. హైదరాబాద్ మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనవరాలు, పద్మారావునగర్‌లో ఉంటున్న మాడపాటి సత్యవతి ‘సిటీప్లస్’కు వివరించారు.
- మాడపాటి సత్యవతి,
ఆకాశవాణి మాజీ న్యూస్ ఎడిటర్
ఖమ్మం జిల్లాలోని ఎర్పుపాలెం మా ఊరు. మా తాతగారు మాడపాటి హనుమంతరావు. ఆయన అన్నగారి కొడుకు మా నాన్న మాడపాటి రామచందర్‌రావు. హనుమంతరావుగారికి కొడుకులు లేకపోవడంవల్ల నాన్నని, నన్ను ఆయనే పెంచారు. నాకప్పుడు 15 ఏళ్లుంటాయి. ఒకరోజు ఉదయం ఎవరో అబ్బాయొచ్చి ఊరిని రజాకార్లు చుట్టుముట్టారనే వార్త చెప్పాడు. ఆ మాట వినేసరికి ఒళ్లంతా వణికిపోయింది. రజాకార్ల దారుణకాండ మా ఊరికి ఎరుకే. వారిని ఎదిరించిన ఇద్దరు యువకులను కొట్టి చంపారు. ఆ దృశ్యాలు కనుమరుగు కాకముందే మళ్లీ ఊరు మీదికొచ్చిపడ్డారని తెలిసింది. ఇంట్లో అమ్మ, నానమ్మ, నేనూ ఉన్నాం. నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అప్పటికే మా నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రజాకార్లు మా ఇంటి దగ్గరికి వస్తున్నారన్న విషయం తెలిసిన ఓ కాంగ్రెస్ లీడర్ తుపాకీతో మా ఇంటికొచ్చి నన్ను, అమ్మను దొడ్డి దారిన ఊరు దాటించాడు. నానమ్మ రానంది. ఎడ్ల బండిపై ఊరు దాటి రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ రైలు ఎక్కి విజయవాడలో దిగాం.
విలీనం తర్వాత మళ్లీ ఊరికి..
విజయవాడలో తెలిసిన వాళ్లింట్లో మకాం. ఊళ్లోనే ఉన్న నానమ్మకు మా నాన్న ఓ కబురు పంపాడు. ఆమె విజయవాడకు వెళ్లకపోతే నిజాం ప్రభుత్వానికి లొంగిపోతానని నాన్న హెచ్చరించాడు. కొడుకు చేసే ఉద్యమానికి భంగం కలగకూడదని మా నానమ్మ మా దగ్గరికి వచ్చేసింది. 11 నెలలు మేం ముగ్గురం నానా పాట్లు పడ్డాం. మేమే కాదు రజాకార్ల దాడులకు భయపడి కొన్నాళ్లపాటు తలదాచుకోవడానికి వందల సంఖ్యలో ఆడవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో గర్భవతులున్నారు, పసిపిల్లల తల్లులు, రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. ఇలా వెళ్లిన వారిని పొరుగువారన్నట్టే చూశారు కానీ, సరైన ఆదరణ చూపలేదు. రజాకార్ల దురాగతాలకు అడ్డుకట్ట పడి, భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత తిరిగి మా ఊరికి వెళ్లాం.
ఆ పాట్లు మరచిపోలేం..
తిరిగి ఊరెళ్లి చూసుకుంటే ఏముంది. తాతలు కట్టిన అందమైన ఇల్లు పైకప్పు కూలి పూర్తిగా శిథిలమైపోయింది. మొండి గోడలు, ఎండిపోయిన చెట్లు, ఇంటి ఆవరణ మొత్తం జంతువుల కళేబరాలతో నిండిపోయింది. చాలా ఇళ్లది ఇదే పరిస్థితి. ఊళ్లలో మునుపటి పరిస్థితులు ఏర్పడటానికి కొన్నేళ్లు పట్టింది. ఇక్కడి పరిస్థితి తెలిసిన కొందరు ఊరికి తిరిగిరాకుండా వెళ్లిన చోటే స్థిరపడిన వారూ ఉన్నారు. ఇప్పటికీ రజాకార్ల పేరు ఎత్తితే చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన మా ఆప్తుల విషయాలే గుర్తుకొస్తాయి. పాడుపడ్డ ఊరిని బాగు చేసుకోడానికి మేం పడ్డ పాట్లే గుర్తుకొస్తాయి.
ఓ.. తెలంగి..
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు నేర్చుకోవడం నేరం. ఓ నలుగురు తెలుగు మగవాళ్లు మాట్లాడుకోవాలంటే ఉర్దూలోనే మాట్లాడాలి. ఎవరైనా తెలుగు మాట్లాడితే.. మన తెలుగోళ్లే నవ్వుతూ.. ‘ఓ తెలంగి’ అని హేళన చేసేవారు. అలాంటి రోజుల్లో తాతయ్య మాడపాటి హనుమంతరావు గారు ఓ తెలుగు పాఠశాల స్థాపించారు. దానికి అనుమతివ్వమని నిజాం ప్రభుత్వం హెచ్చరించినా పాఠశాల తెరిచారు. ఆయన పాఠశాలలో మొదటి విద్యార్థి ఆయన భార్య.. మా నాయనమ్మ మాడపాటి మాణిక్యమ్మ, రెండో విద్యార్థి బూర్గుల రామకృష్ణారావు గారి భార్య అనంతలక్ష్మి గారు. నారాయణగూడలో తెలుగు బాలికల ఉన్నత పాఠశాల పేరుతో ఆయన స్థాపించిన స్కూల్లో విద్యార్థులకు పదో తరగతి పరీక్ష రాసే అవకాశాన్ని నిజాం ప్రభుత్వం కల్పించకపోయేసరికి ఆంధ్రా యూనివర్శిటీ ద్వారా ఇక్కడ పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల్ని విజయవాడ పంపించి పరీక్ష రాయించారు. అలా పరీక్ష రాసిన చివరి బ్యాచ్ విద్యార్థిని నేనే.
- భువనేశ్వరి
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి