Mukesh Sharma
-
క్లీన్లీనెస్‌పై బీజేపీకే చిత్తశుద్ధి లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్పై బీజేపీ నాయకులకే చిత్తశుద్ధిలేదని, అందుకే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం లేదని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ ఆరోపించారు. క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బీజేపీ నాయకులు ఫొటోల కోసం ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఫొటోల కోసం నాయకులు పోటీలు పడిన దృశ్యాలు కన్పించాయని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల ఇస్లామిక్ సెంటర్ వద్ద ముందుగా వ్యర్థాలను వెదజల్లి మీడియా వచ్చిన తర్వాత శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవ చేశారు. సీనియర్ నాయకుడే ఇలా చేస్తే, ఈ కార్యక్రమాన్ని కిందిస్థాయి కార్యకర్తలు ఎట్లా విజయవంతం చేస్తారని ప్రశ్నించారు. పార్కులు పచ్చదనాన్ని కోల్పోతే ఆ బాధ్యత బీజేపీదేనని అన్నారు. క్లీన్‌నెస్ క్యాంపెయిన్‌ను ఆజామాషిగా నిర్వహించరాదని, నిత్యం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. -
ఎన్నికలకు బీజేపీ భయపడుతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ బీజే పీ తీరుపై విరుచుకుపడింది అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మేము అన్నివిధాలా సిద్ధమే ‘ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ రద్దుకు బీజేపీ జంకుతోందనే విషయం స్పష్టమైంది. శాసనసభ ఎన్నికల విషయంలో ఆ పార్టీ పలాయనం చిత్తగించింది. మేము ఉప ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నాం. మోడీ వేవ్ అంటూ ఒకవైపు బలంగా వాదిస్తూనే మరోవైపు ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ జంకడం నాకు బాగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సుముఖంగా లేదని తేలిపోయింది. శాసనసభను తక్షణమే రద్దు చేయాలి. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించబోం. ఢిల్లీ శాసనసభకు తక్షణమే ఎన్నికలు జరపాల్సిందే. రాజకీయ అనిశ్చితి తొలగిపోవడానికి ఇంతకుమించి మరో మార్గమే లేదు’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు. -
ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే
న్యూఢిల్లీ: ఓవైపు దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుంటే మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీ సెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. నరేంద్రమోడీ హవాతోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడంపై ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ స్పందించారు. ‘మోడీ హవా మాట నిజమే అయితే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. రాజధానిలో మోడీ మంత్రం పనిచేయదని బీజేపీ నేతలు భయపడుతున్నారు. అందుకే శాసనసభను రద్దు చేయకుండా కాలాయాపన చేస్తున్నారు. మోడీపై ఆ పార్టీ నేతలకు అంత నమ్మకమే ఉంటే ఢిల్లీలో ఎందుకు ఎన్నికలు నిర్వహించరు? మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాజధాని ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉన్నాయి. వాటిని ఎత్తిచూపడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందే ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మేం తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఎన్నికలకే వెళ్లాలనుకుంటున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకే సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నా ఎల్జీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తున్నారు. తాజా పరిస్థితిని అంచనా వేశాక కూడా ఎల్జీ అదే అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా మరో ఐదారుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది. పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తార’ని ప్రశ్నించారు. -
దమ్ముంటే అసెంబ్లీ రద్దు కోరండి
న్యూఢిల్లీ: మోడీ గాలిపై అంత నమ్మకం ఉంటే ఢిల్లీ శాసనసభను రద్దు చేయించాల్సిందిగా కోరాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) డిమాండ్ చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాయం విద్యార్థి సంఘానికి (డూసూ) జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలుపొందిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోడీ వేవ్‌పై అంత నమ్మకం ఉంటే తక్షణమే ఢిల్లీ విధానసభను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో వర్తింపజేయకూడదని అన్నారు. ఎన్ఎస్యూఐ ఓడిపోయినంత మాత్రాన బీజేపీ సంబరపడిపోనవసరం లేదన్నారు. ఎన్ని కల్లో గెలుపు, ఓటములు అత్యంత సహజమ న్నారు. అయినప్పటికీ ఎన్నో ఏళ్ల విరామం తర్వా తనే ఏబీవీపీ గెలిచిందని ఆయన పేర్కొ న్నారు. ఎఫ్‌వైయూపీపై విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజ యం సాధించగలిగిందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలే దు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
చార్జీలకు వ్యతిరేకంగా రైల్‌రోకో
న్యూఢిల్లీ: పెంచిన రైలు చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరుతి ఢిల్లీలోని పాలం రైల్వే స్టేషన్లో కొద్దిసేపు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. -
డీపీసీసీ అధికార ప్రతినిధిగా ముఖేశ్ శర్మ నియామకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మీడియా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న ముఖేశ్ ఇకపై ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శర్మను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు డీపీసీసీ శనివారం ప్రకటించింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శర్మ ఇదివరకు ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డ్ చైర్మన్‌గా, షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇలా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శర్మ లోక్‌సభ ఎన్నికల సమయంలో డీపీసీసీ అధికార ప్రతినిధిగా కూడా తనదైన ముద్ర వేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆయన సహకారంతో తాము లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే ధీమాను డీపీసీసీ అధ్యక్షడు అర్విందర్ సింగ్ లవ్లీ వ్యక్తం చేశారు. శర్మ అనుభవం, లవ్లీ యువభాగస్వామ్యం పార్టీకి కలిసి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. -
ఇది కాల్ సెంటర్ ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాల్ సెంటర్, హెల్ప్‌లైన్‌గా మారిందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. శనివారం నగరంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంద న్న సాకుతో మధ్యలోనే బయటకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ సామాన్యుడికి ఏమీ చేయలేరని అన్నారు. విద్యుత్ కోతలు, అవినీతి, నర్సరీ అడ్మిషన్ల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్లైన్లు ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కాల్ సెంట ర్, హెల్ప్‌లైన్‌గా మారిందన్నారు. ప్రజలకు సేవ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు వారి సమస్యలను గాలికొదిలేస్తుందని ఆరోపించారు. కేజ్రీవాల్ వల్ల తమ సమస్యలు తీరుతాయని భావించిన సామాన్యుడికి చుక్కెదురైందని విమర్శించారు. -
‘ఆప్’ నిర్ణయం హాస్యాస్పదం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీవాసులకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తానంటూనే ఆప్ సర్కార్ షరతులు విధిం చడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖేశ్‌శర్మ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్సర్కార్ పేదలు, మధ్య తరగతి కుటుంబాలపై పెద్దజోక్ వేసిందంటూ ఉచితనీటి సర ఫరా నిర్ణయా న్ని ఎద్దేవా చేశారు. మంగళవారం డీడీయూ మార్గ్‌లోని రాజీవ్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీవాసులందరికి ఉచితంగా ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల నీరు అందిస్తామంటూ ఆమ్ఆద్మీపార్టీ వాగ్ధానం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి షరతులతో అమలు చేస్తాననడం సబబు కాదన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలోని కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే లబ్ధిపొందుతారని పేర్కొన్నారు. అనధికారిక కాలనీలు, పునరావాస కాలనీలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఏంటని, వారి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపుతారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ నిర్ణయం మధ్యతరగతి వారిని దోచుకుని ఆ లాభాన్ని పేదలకు చేసేలా ఉందన్నారు. ఆప్ నిర్ణయాన్ని కాంగ్రెస్ అంగీకరించబోదన్నారు. ఢిల్లీ జల్ బోర్డు చెబుతున్న ప్రకారం 19.5 లక్షల మంది గృహ నీటి వినియోగదారులుండగా 6.5 లక్షల ఇళ్లకు మాత్రమే మీటర్లు కలిగి ఉన్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయం కేవలం వీరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కేజ్రీవాల్ అయోమయంలో ఉన్నాడు: షీలా తాజాగా అధికార పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ అయోమయంలో ఉన్నాడని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ విమర్శించారు. ప్రజలకు చేసిన వాగ్ధానాలు, హామీలు నేరవేర్చడానికి ఆయన తీసుకునే చర్యలేమిటో ఇప్పుడే చెప్పడం కష్టమని, అయితే ఆయన చర్యల్లో గందరగోళం మాత్రం కనిపిస్తోందని స్పష్టం చేశారు.అయితే కేజ్రీవాల్ తాను చేసిన హమీలను ఎలా నెరవేరుస్తాడో కాలమే తెలియజేయాల్సి ఉందని షీలా దీక్షిత్ అన్నారు. ‘వారు ప్రతి ఇంటికి రోజుకు 20 వేల లీటర్ల నీరు సరఫరా చేస్తామన్నారు. అది కూడా ఉచితంగా, అయితే ఢిల్లీ జల్‌బోర్డు ఈ ఖర్చును భరించగలదా? ఇది వేచి చూడాల్సిన విషయం. ఇక విద్యుత్ చార్జీల తగ్గింపు విషయం గురించి ప్రశ్నించగా బహుశా అందుకే ఆయన కాగ్ ఆడిట్‌ను కోరినట్లుంది. కాగ్ అంగీకరిస్తే మంచిదేనని స్పష్టం చేసింది.