ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే
న్యూఢిల్లీ: ఓవైపు దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుంటే మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీ సెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. నరేంద్రమోడీ హవాతోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడంపై ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ స్పందించారు. ‘మోడీ హవా మాట నిజమే అయితే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. రాజధానిలో మోడీ మంత్రం పనిచేయదని బీజేపీ నేతలు భయపడుతున్నారు. అందుకే శాసనసభను రద్దు చేయకుండా కాలాయాపన చేస్తున్నారు. మోడీపై ఆ పార్టీ నేతలకు అంత నమ్మకమే ఉంటే ఢిల్లీలో ఎందుకు ఎన్నికలు నిర్వహించరు? మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాజధాని ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉన్నాయి. వాటిని ఎత్తిచూపడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందే ఉంది.
అందుకే వచ్చే ఎన్నికల్లో మేం తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఎన్నికలకే వెళ్లాలనుకుంటున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకే సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నా ఎల్జీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తున్నారు. తాజా పరిస్థితిని అంచనా వేశాక కూడా ఎల్జీ అదే అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా మరో ఐదారుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది. పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తార’ని ప్రశ్నించారు.