ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసా
నిడమర్రు : ఉపాధ్యాయులకు ఆర్థిక సహకారం అందించేందుకు జాతీయ స్థాయిలో సంక్షేమ నిధిని ఏర్పాటుచేశారు. దీని నుంచి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపాధ్యాయులు సహకారం పొందవచ్చు.. ఆ వివరాలు మీకోసం..
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధీనంలో పనిచేస్తున్న నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిధి ఉంటుంది. ప్రతి ఏటా సర్వీసులో ఉన్న/ ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు అవసరార్థం దీని నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ ప్రకటించిన తేదీలోపు సమర్పించాలి. 2016–17 విద్యా సంవత్సరానికి ఈ నిధి నిమిత్తం ప్రకటన జారీ చేయాల్సి ఉంది. దరఖాస్తులు సంబంధిత అధికారి ద్వారా పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయానికి సెప్టెంబర్ 30లోపు అందజేయాలి.
దరఖాస్తుకు అర్హులు.. సర్వీసులో ఉన్న, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు/కళాశాలల అధ్యాపకులు, 1974కు ముందు ప్రైవేటేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడిన వారు, 1980కు ముందు ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు.
ఆర్థిక సాయం కోరే సందర్భాలు
– ఉపాధ్యాయులు లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనప్పుడు, కుమార్తెల వివాహ ఖర్చు నిమిత్తం, అగ్ని ప్రమాదం సంభవించినపుడు /వరదల్లో తీవ్రమైన నష్టం వాటిల్లినప్పుడు, అభ్యర్థి పిల్లలు ఇంటర్మీడియట్ కంటే పైస్థాయి వృత్తి విద్యను అభ్యసిస్తున్నప్పుడు, దరఖాస్తు విధానం/షరతులు, దరఖాస్తులను సబంధిత పత్రాల నకళ్లతో జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించాలి.
– వైద్య సాయం కోసం దరఖాస్తు చేసేవారు వ్యాధి స్వభావాన్ని స్పష్టంగా తెలిసేలా ఎంబీబీఎస్ వైద్యుని ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.
– దరఖాస్తుదారునిపై ఆధార పడిన పిల్లల వయసు, ఆదాయ వివరాలు తెలియ జేయాలి.
– దరఖాస్తుదారుని భార్య/భర్త ఆదాయ వివరాలు తెలియజేయాలి. పిల్లల విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేస్తే కుమారుడు/ కుమార్తె కోర్సు, కాలపరిమితి, కళాశాల చిరునామా తదితర వివరాలు తెలపాలి. ఏదైనా ఉపకార వేతనం పొందుతున్న కుమారు/కుమార్తె ఈ నిధి నుంచి సాయం పొందేందుకు అనర్హులు. కుమార్తెల వివాహ విషయంలో వారి వయసు, ఆదాయం, ఉద్యోగ వివరాలు విధిగా తెలపాలి. ఉద్యోగంలో ఉన్నవారు తాము పనిచేసే పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా, ఉద్యోగ విరమణ చేసిన వారు వారు పనిచేసిన చివరి పాఠశాల హెచ్ఎంల ద్వారానే దరఖాస్తులు పంపాలి.
ఆర్థిక సాయం ఈ కోర్సులకే.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, మూడేళ్లు తక్కువ కాకుండా ఉండే డిప్లమా కోర్సులు, హలోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విద్యలకు డిగ్రీ తర్వాత చేసే రెండేళ్లకు తక్కువగాని మేనేజ్మెంట్ కోర్సులకు, రెండేళ్లకు తక్కువగాని బీఫార్మసీ డిప్లమా కోర్సులకు ఆర్థిక సాయం లభిస్తుంది.
– విద్యాభ్యాసానికి లభించే గరిష్ట పరిహారం రూ 15 వేలు. విద్యార్థి కింద తరగతులను ఒకేసారి పాసవ్వాలి. సప్లమెంటరీలో ఉత్తీర్ణులైనవారు అనర్హులు. విద్యార్థి గత సంవత్సరం కోర్సులో చేరినా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరికి ఎరియర్స్ చెల్లించబడవు. దరఖాస్తులు ఝజిటఛీ.జౌn/nజ్టఠీ.ఛిౌఝ వెబ్సైట్ నుండి పొందవచ్చు.
– ఉపాధ్యాయుని సెల్ఫ్ డిక్లరేషన్, జీతం ధ్రువీకరణ పత్రం, ఓరిజినల్ ఫీజు రశీదు (జిరాక్స్లు అంగీకరించబడవు)
– తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జారీచేసిన స్టడీ సర్టిఫికెట్ (ఇన్ చార్జ్ సంతకాలు అంగీకరించబడవు)
–దరఖాస్తులను ఉపాధ్యాయులైతే ఎంఈవో/హెచ్ఎం ద్వారా, ఉన్నత పాఠశాల హెచ్ఎంలైతే డీవైఈవో ద్వారా సెప్టెంబర్ 30లోపు పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాలకు పంపించాలి.
ఈ సంక్షేమ నిధి సేకరణ ఇలా.. ప్రభుత్వం నుంచి విడుదలచేసిన నిధులతోపాటు ప్రతీ ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రంతో కూడిన బ్యాడ్జీలను ఉపాధ్యాయులకు ఇచ్చిన సేకరించిన విరాళాలతో ఈ నిధిని సమకూరుస్తారు.