నీటి మధ్య అద్భుత కట్టడం.. నీర్ మహల్
అగర్తల : త్రిపుర రాజధాని అగర్తలకు 55 కిలోమీటర్ల దూరంలో రుద్రసాగర్ అనే 5.35 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న సరస్సు నడుమ నీర్ మహల్‌ను నిర్మించారు. వేసవి విడిదిలో ఈశాన్య రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచిన విహారం నీర్ మహల్ సందర్శన. హైందవ, ఇస్లాం నిర్మాణ శైలి కలబోతతో మొత్తం 24 గదులతో కూడిన భవనం ఇది. రాజు మాణిక్య బహదూర్.. అప్పటి బ్రిటిష్ కంపెనీకి చెందిన మార్టిన్ బర్న్స అనే సంస్థకు దీని నిర్మాణ బాధ్యతలు అప్పగించాడు.
ఈ నిర్మాణం పూర్తి కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి అండర్ మహల్. ఇది పశ్చిమ భాగంలో ఉంది. ఇందులో రాజవంశీయులు బసచేసేవారట. తూర్పు దిక్కున ఉన్న భాగాన్ని భాహ్యరంగం అంటారు. లలితా కళా విభాగంగా చెప్పుకునే దీంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారట.
నీర్మహల్ ఫెస్టివల్..
త్రిపురలో ఏటా భాద్రపద మాసంలో నీర్ మహల్ ఫెస్టివల్ జరుపుతారు. నీర్ మహల్ ఉన్న రుద్రసాగర్ జిల్లాలో ఈ పండుగ సందర్భంగా ‘బోట్‌రేస్’ నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ బోట్‌రేస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురుషులకు దీటుగా మహిళలు సైతం ఉత్సాహంగా ఈ బోట్‌రేస్‌లో పాల్గొనడం విశేషం.