కాపులు ధర్మాన్ని గెలిపించారు
మండలి బుద్ధ ప్రసాద్
తిరుచానూరు : తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు, బలిజలు ధర్మాన్ని గెలిపించారని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. తిరుపతి బలిజ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కాపు ప్రజాప్రతినిధులకు అభినందన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి 13 జిల్లాల నుంచి పలువురు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, తిరుపతి బలిజ జేఏసీ నాయకుడు వూకా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు ధర్మాన్ని గెలిపించారన్నారు. కర్ణుడు కవచ కుండలాలతో జన్మించాడని, కాపులు నీతినిజాయితీ అనే కవచ కుండలాలతో పుట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కాపులను బీసీ జాబితాలో చేర్చినప్పుడే తమ కులం సంతోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నాయే తప్ప న్యాయం చేయలేదన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చినంత మాత్రాన ఇప్పుడున్న బీసీలకు రిజర్వేషన్లలో ఎటువంటి అన్యాయం జరగదని వారు స్పష్టం చేశారు.
పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు కులస్తుడైన చిరంజీవిని కలిస్తే, ఆయన స్పర్శ తగిలితే చాలు జీవితం ధన్యం అవుతుందనుకున్న కాపులను ఆయన నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవుల నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటికోట రామారావు(ఏలూరు), కే.అప్పలనాయుడు(గజపతినగరం), పి.నారాయణస్వామినాయుడు(నెల్లిమర్ల), మీసాల గీత(విజయనగరం), పి.రమేష్‌బాబు(ఎలమంచిలి), డీకే.సత్యప్రభ(చిత్తూరు), కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ ఆశాలత, కోలా ఆనంద్ పాల్గొన్నారు.