నన్ను పీకేస్తున్నారు..!
న్యూఢిల్లీ: ఎన్నివేల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా.. ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో సైరస్ మిస్త్రీకి టాటాలు బాగానే రుచిచూపించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను అర్ధంతరంగా తొలగించడానికి నిమిషాల ముందు భార్య రోహిఖాకు మిస్త్రీ పంపిన సందేశం(ఎస్ఎంఎస్) ఏంటో తెలుసా.. ‘నన్ను పీకేస్తున్నారు’ అని! ఈ విషయాన్ని మిస్త్రీ అనుచరుల్లో ఒకరైన నిర్మల్య కుమార్ బయటపెట్టారు.
మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్ పగ్గాలు చేపట్టాక ఏర్పాటు చేసిన కోర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(జీఈసీ)లో కుమార్ కూడా సభ్యుడు కావడం గమనార్హం. టాటా ట్రస్టులకు మిస్త్రీపై నమ్మకం పూర్తిగా పోయిందని పేర్కొంటూ గతేడాది అక్టోబర్ 24న టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఆయనను అకస్మాత్తుగా తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు బోర్డు సమావేశంలో జరిగిన తతంగాన్ని కుమార్ తన తాజా బ్లాగ్ (హౌ సైరస్ మిస్త్రీ ఫైర్డ్)లో వెల్లడించారు.
మీకు నచ్చింది చేసుకోండి...!
‘అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డు సమావేశానికి కొద్ది నిమిషాల ముందు రతన్ టాటా, బోర్డు సభ్యుడు నితిన్ నోహ్రియాలు మిస్త్రీతో భేటీ అయ్యారు. ముందుగా నితిన్ మాట్లాడుతూ.. సైరస్ నీకు తెలుసు.. రతన్ టాటాకు నీతో పొసగడం లేదని. మీ ఇద్దరి మధ్య సంబంధాలు అస్సలు బాగాలేవు. నిన్ను(మిస్త్రీ) చైర్మన్ పదవి నుంచి తొలగించాలని టాటా ట్రస్టులు నిర్ణయించాయి. ఈ బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. నీకు రెండే మార్గాలు ఉన్నాయి.
స్వచ్ఛందంగా రాజీనామా చేయడం, లేదంటే బోర్డు భేటీలో తొలగింపు తీర్మానాన్ని ఎదుర్కోవడం అంటూ విషయాన్ని వివరించారు. ఈ సమయంలో రతన్ టాటా జోక్యం చేసుకుంటూ... పరిస్థితి ఇంతవరకూ వచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు’ అని కుమార్ వెల్లడించారు. దీనికి సావధానంగా స్పందించిన మిస్త్రీ.. ‘జెంటిల్మెన్, బోర్డు సమావేశంలో ఏం చేయాలన్నది మీ ఇష్టం. నేను ఏం చేయాలో అది చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారని కుమార్ పేర్కొన్నారు.
ఆ తర్వాత సైరస్ మిస్త్రీ బోర్డు సమావేశానికి వెళ్తూ... తన భార్య రోహిఖాకు ‘నన్ను తొలగిస్తున్నారు(ఐయామ్ బీయింగ్ శాక్డ్) అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారని కుమార్ వివరించారు. బోర్డు సమావేశంలో తనపై వేటు వేసేందుకు తీర్మానాన్ని ఆమోదించాలంటే నిబంధనల ప్రకారం 15 రోజులకు ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని మిస్త్రీ వాదించినట్లు కూడా చెప్పారు. అయితే, ఎలాంటి నోటీసూ అక్కర్లేదంటూ బోర్డుకు టాటా ట్రస్టుల నామినీ డైరెక్టర్ వెల్లడించారని కుమార్ తెలిపారు.
బోర్డు సమావేశంలో మొత్తం ఎనిమిది మంది డైరెక్టర్లకు గాను ఆరుగురు.. అమిత్ చం ద్ర, విజయ్ సింగ్, నితిన్ నోహ్రియా(వీళ్లు టాటా టస్టుల నామినీలు), అజయ్ పిరమల్, రోనెన్ సేన్, వేణు శ్రీనివాసన్(వీళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లు) మిస్త్రీని తొలగించే తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఫరీదా ఖంబాటా, ఇషాత్ హుసేన్‌లు మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరవడం గమనార్హం. ‘మిస్త్రీకి వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే నిమిషాల్లోనే ఆయనను తక్షణం తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించేసింది’ అని కుమార్ వ్యాఖ్యానించారు.