మలాలా సిస్టర్స్
టీన్ ట్విన్స్
ఈ ఇద్దరు అమ్మాయిలు... మలాలా ఏ లక్ష్యం కోసం అయితే ఉద్యమించారో ఆ లక్ష్యసాధనకు పాటు పడుతున్నారు. బాలికల చదువు కోసం, సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. వీళ్ల చురుకుదనం మలాలానే ముగ్ధురాలిని చేసింది! మలాల ధ్యేయానికి తోబుట్టువులను చేసింది!
మలాల యూషఫ్సాయ్! ప్రపంచానికి ఒక అబ్బురం. పద్నాలుగేళ్లకే తాలిబన్ తీవ్రవాదులతో పోరాటం, పదిహేడేళ్ల వయసుకే నోబెల్ శాంతి బహుమతి, ఇంకా టీనేజ్లో ఉండగనే ఇప్పుడు... బాలికల చదువు కోసం అంతర్జాతీయంగా ప్రచారోద్యమాన్ని నడపడం. ఇవన్నీ ఈ పాకిస్తానీ అమ్మాయిని ప్రపంచానికే ఓ బ్రాండ్ అంబాసిడర్ స్థాయికి చేర్చాయి! వారం క్రితమే మలాలా కెనడా గౌరవ పౌరసత్వం కూడా పొందారు. కెనడా చట్టసభలో ప్రసంగించారు. కెనడా పార్లమెంటు చరిత్రలోనే అతి చిన్నవయసు అతిథి ప్రసంగం అది. ఒక్కమాటలో... మలాలా ఓ ‘గర్ల్ వండర్’!
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది... మలాలా గురించి కాదు. మలాలానే అబ్బుర పరచిన ఇద్దరు అమ్మాయిల గురించి! వాళ్లదీ పాకిస్తానే కానీ, వాళ్లు ఉంటున్నది కెనడాలో. గౌరవ పౌరసత్వం అందుకోడానికి మలాలా వస్తున్నారని తెలిసి, ఆమెను ఎటూ కెనడా ‘ఎంగ్ అండ్ ఎనర్జిటిక్’ ప్రధాని జస్టిన్ ట్రూడో కలుస్తారని ఊహించి... వాళ్లిద్దర్నీ కలిపి ఇంటర్వూ్య చెయ్యాలని ఈ ఇద్దరు హైస్కూల్ విద్యార్థినులు స్కెచ్ వేసుకున్నారు. వేసుకున్నట్లే ఇంటర్వూ్య కూడా చేసేశారు. వాళ్లలో ఒక అమ్మాయి మరియమ్. ఇంకో అమ్మాయి నివాళ్ రెహమాన్. ఇద్దరూ కవల పిల్లలు. టీనేజ్ జర్నలిస్టులు. పదిహేనేళ్ల వయసు ఉంటుంది.
ఇంటర్వూ చేశారని వీళ్లను జర్నలిస్టులు అనడం కాదు. ఏడాదిగా వీళ్లొక యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు! ఆ చానల్ పేరు ‘ది వరల్డ్ విత్ ఎంఎన్ఆర్’. సమాజంలో మార్పును కోరుకునేవారందరూ కలుసుకునే కూడలి అది. మలాలా లాగే పన్నెండేళ్ల వయసులో వీళ్లు కూడా బాలికల చదువు ప్రాముఖ్యాన్ని సమాజానికి తెలియజెప్పే కార్యకర్తల్లా స్వచ్ఛందంగా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. తల్లిదండ్రులు వీరికి సహకరించారు. బాలికల చదువుకు సహకరించడమే పెద్ద సంస్కరణ అయిన పరిస్థితుల్లో ‘బాలికల్ని చదివించండి’ అనే ప్రచారోద్యమానికి సహకరించడం పెద్ద సాహసమే కదా!
ఇక ఈ పిడుగులు మలాలాను, కెనడా ప్రధాని ట్రూడోను ఎంత చక్కగా, ఎంత చకచకా ఇంటర్వూ చేశారో తెలుసుకోవాలంటే వీడియోను (The Day We Interviewed Malala and Justin Trudeau) చూడాల్సిందే. ఇంటర్వూ ప్రారంభానికి ముందు... తమదొక జెండర్ ఈక్వాలిటీ టీమ్ అని ఆ పెద్దవాళ్లిద్దరితో (మలాలా, ట్రూడో) తమను కలిపేసుకున్నారు ఈ చిన్నవాళ్లిద్దరు! ఆ గడుసుదనానికి వాళ్లవైపు నవ్వుతూ చూశారు ట్రూడో, మలాలా. ఇక ప్రశ్నలు మొదలయ్యాయి. ట్రూడో పాలనా విభాగాలలో మహిళలకు సమాన అవకాశాలు, బాలిక విద్యకోసం కెనడాలో పెట్టుబడులు వంటి కెనడాకే పరిమితమైన ప్రశ్నలతో పాటు... ట్రుడోను, మలాలాను ఉమ్మడిగా అడిగిన ప్రశ్నలూ ఉన్నాయి. మీరు కొత్తగా చదివిన పుస్తకం, మీకు స్ఫూర్తిని ఇచ్చిన మహిళ, పనిలో మునిగిపోయినప్పుడు వేళకాని వేళల్లో మీరు తినే ఆహారం, మిమ్మల్ని ఎప్పుడూ నవ్వించే వ్యక్తి, మీరు వెళ్లాలనుకుంటున్న దేశం (ఈ ప్రశ్నకు సమాధానంగా ట్రూడో పాకిస్తాన్ అని చెప్పారు.
మలాల ఇండియాతో పాటు మరి కొన్ని దేశాల పేర్లు చెప్పారు), స్కూల్లో మీరు నేర్చుకున్న మంచి పాఠం, యువ విద్యార్థులకు మీరిచ్చే సలహా... ఇలా సరదా సరదాగా, కొంచెం సీరియస్గా ఉండే ప్రశ్నలు అడిగారు. వాటికి ట్రూడో, మలాలా ఇచ్చిన సమాధానాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయి. నిజానికి ఇది... నలుగురు నిలుచుని మాట్లాడుకున్నట్లుగానే ఉంది కానీ, ఒక గంభీరమైన ఇంటర్వూ్యలా లేదు. ఆ ఇద్దరు అమ్మాయిలు... లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడ్డం చూసి ట్రూడో, మాలాల ముచ్చటపడినట్లే కనిపించారు. తర్వాత వీళ్లిద్దరి గురించీ మలాలా తన బ్లాగులో గొప్పగా రాశారు కూడా. నిజమైన కవలలుగా మాత్రమే కాదు, మలాలా ఉద్యమదీక్షకు కూడా ఈ ఇద్దరు అమ్మాయిలు కవలలు అని చెప్పాలి.
– కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్
మలాలా, ట్రూడోలను ఇంటర్వ్యూ చేస్తున్న మరియం, నివాళ్