వన్ ప్లస్ ఎక్స్.. వచ్చేస్తోంది!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ రానుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న వన్ ప్లస్ సంస్థ.. సరికొత్త ఫీచర్లతో 'వన్ ప్లస్ ఎక్స్' పేరుతో మరో స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్లో ఇప్పటికే ఈ చైనాకు చెందిన సంస్థ రిలీజ్ చేసిన వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టు ఫోన్లు.. ఆదరణ పొందడంతో వినియోగదారులకు సంస్థ మరో ఫోన్ ను అందించనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో వన్ ప్లస్ ఎక్స్ ఫోన్ ను విడుదల చేసేందుకు సంస్థ.. అన్ని దేశాలకు తమ ఆహ్వానాలను పంపింది. ఫోన్ లాంచింగ్ వేడుక.. ఇండియాలో ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ అక్టోబర్ మొదట్లోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండియాకు ఆహ్వానం పంపింది.
వన్ ప్లస్ ఎక్స్ ధర సుమారు రూ. 16,180 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంతకు ముందే మార్కెట్లో విజయం సాధించిన వన్ ప్లస్ టు కన్నా ప్రస్తుత వన్ ప్లస్ ఎక్స్ కాస్త చిన్నసైజులో, 5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే తో ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. 2 జీబీ ర్యామ్, 2,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ ఎక్స్10 హీలియో ప్రాసెసర్ తో వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. వన్ ప్లస్ టు లో లాగా కనిపించే ఆప్టికల్ స్టెబిలైజర్ లేకుండా సెన్సర్ తో 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉందంటున్నారు. ఈ కొత్త మొబైల్ కు సంబంధించిన ఇతర వివరాలు విడుదల తర్వాత తెలియనున్నాయి.