కౌంటింగా.. వెయిటింగా?
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో గత నెల 30న ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ నెల 6, 11న రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 30న సాధారణ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తే వాటి ప్రభావం తర్వాత జరిగే ఎన్నికలపై ఉంటుంద ని, అందువల్ల ఎన్నికలు ముగిసేంత వరకు ఫలితాలు నిలిపివేయాలని రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.
అంతకుముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మే 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పెండింగ్ పెట్టడం కుదరదని పేర్కొంది. ఈ నెల 9న ఫలితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. దీంతో రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నికల ఫలితాలు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఈ నెల 9న వెల్లడించాలా.. లేదా సార్వత్రిక ఎన్నికల అనంతరం వెలువరించాలా అనే అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఇప్పటికే ఒకసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు పలు ప్రశ్నలు వేసింది. వాటికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంది. ఈవీఎంల భద్రతపై ఎన్నికల కమిషన్ అనుమానం వ్యక్తం చేయడంతో భద్రత ఎందుకు కల్పించలేరని, ఫలితాలు వాయిదా వేస్తే నష్టం ఏమిటో వివరంగా తెలుపాలని కోర్టు సూటిగా ప్రశ్నించింది.
మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడతాయనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. దీంతో మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థులు మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వాయిదాకే మొగ్గుచూపినపక్షంలో నెల పాటు వారికి మరింత ఆందోళన తప్పదు.