ఆన్లైన్ విధానంలో వాహన నంబర్ల కేటాయింపు
రాజానగరం :
ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబరును కంప్యూటర్లే కేటాయిస్తాయని రాష్ట్ర రవాణా అథారిటీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) రమాశ్రీ అన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై జిల్లా ఆటోమోబైల్ డీలర్లకు గైట్ కళాశాలలో గురువారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశ్రీ మాట్లాడుతూ, వాహనాలకు కేటాయించే రిజిస్ట్రేషన్ నంబర్ తొలుత వాహన యజమానులకు తెలుస్తుందన్నారు. వాహనం సహా యజమానుల ఫొటోను డీలర్ల వద్దే తీయించాలని, జీపీఎస్ విధానంతో ఇది ముడిపడి ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డు వివరాలతోపాటు ప్రస్తుత చిరునామా, బీమా వివరాలు, ఇన్వాయిస్ కాపీ జత చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనంతో ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ కచ్చితంగా విక్రయించాలని, ఫారం–22 వివరాలను కూడా కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డీలర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీటీసీ ఆనంద్, ఎంవీఐలు టీకే పరంధామరెడ్డి, సాయినాథ్, పద్మాకర్, రాజేంద్ర ప్రసాద్, ఎం.హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశ నిర్వహణకు సహకరించిన చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు)కు నిర్వాహకులు కృతజ్ఙతలు తెలిపారు.