నాల్గో రోజుకు చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
ఒంగోలు: ‘ఎనిమిదేళ్లుగా మాతో కలిసి ప్రజానీకానికి సేవలు అందించారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా రోడ్డెక్కిన మీ పోరాటానికి మా సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది’ అని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ డీఈల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గృహ నిర్మాణ శాఖలో విధుల నుంచి తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద చేస్తున్న ధర్నా నాల్గో రోజుకు చేరింది. ధర్నాలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మీపై డీఈ స్థాయి అధికారి ఎవరూ ఒత్తిడి తీసుకురాకుండా చూస్తామన్నారు.
ఒక వైపు ఉపాధి కోల్పోయి ఆందోళనలో ఉన్న మీకు జీతం బకాయిలు రాకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వంపై సానుకూల వైఖరితో ధర్నా చేయాలని, అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాజీలేని పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్ ఆదినారాయణ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఎంతోమంది పేదలు గూడు కట్టుకోవడానికి సహకరిస్తే ప్రస్తుత ప్రభుత్వం తమ ఉపాధికి గండికొట్టిందన్నారు. బాబు వచ్చే... జాబు పోయే అని చెప్పారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పీ మస్తాన్రావు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలివితేటల్ని ప్రసాదించాలని వినతిపత్రం అందజేశారు. ధర్నాకు మద్దతు తెలిపిన వారిలో డీఈలు శ్రీహరి, సుబ్బారావూ ఉన్నారు. ధర్నాలో గృహ నిర్మాణ శాఖ జిల్లా ఐటీ మేనేజర్ కైలా శ్రీనివాసరావు, చింపిరయ్య, శాంతకుమారి, సౌదామిని పాల్గొన్నారు.