డీఆర్డీవో మహిళా శాస్త్రవేత్తకు పద్మావతి వర్సిటీ డాక్టరేట్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): హైదరాబాద్లోనిరక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మహిళా శాస్త్రవేత్త, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్‌కు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం జరిగిన 16వ స్నాతకోత్సవంలో వైస్ చాన్స్‌లర్ ఎస్.రత్నకుమారి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకాక పోవడంతో వీసీనే చాన్స్‌లర్ హోదాలో డిగ్రీలు ప్రదానం చేశారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న టెస్సీ థామస్ మాట్లాడుతూ... దేశంలో నాణ్యమైన విద్యను అందించే అంశాన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు మౌలిక వసతులు, అధ్యాపకుల లేమి, పరిశోధకులకు ప్రోత్సాహం లేకపోవడం, ఉపాధి కల్పించలేకపోవడం తదితర సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. విద్యార్థులకు ఉపాధి పొందగలిగే సామర్థ్యాలను అందించాల్సిన బాధ్యత వీటిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.