ఢిల్లీ ఎయిర్పోర్టులో 6డి ధియేటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక విమానాశ్రయంలో 6డి సినిమా ధియేటర్ ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో అందుబాటులోకి వచ్చింది. ‘ఇరిడో 6డి’ పేరిట దేశీయ టెర్మినల్ 1డిలో ధియేటర్ను ఏర్పాటు చేసినట్లు జీఎంఆర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆరు డిగ్రీల కోణంలో కూర్చున్న సీటు కదలడంతోపాటు, తెరమీద వస్తున్న చిత్రానికి అనుగుణంగా నిజమైన అనుభూతిని కలిగించే విధంగా నీళ్ళు జల్లడం, పక్కనే పేలిన శబ్దాలు, గాలి, పొగ, మంచు, సువాసనలు వంటివి ఇరిడో 6డిలోని ప్రత్యేకతలు. పారామౌంట్ టెక్నాలజీ నిర్వహించే ఈ థియేటర్లో 15 నిమిషాల నిడివిగల చిత్రానికి రూ.250 టిక్కెట్ ధరతోపాటు పన్నులు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా 6డి థియేటర్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇది అన్ని వయస్సుల వారినీ ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సీఈవో ఐ.ప్రభాకర రావు పేర్కొన్నారు.