ఎంసెట్ రద్దు.. వద్దు
ర్యాంకర్లు, తల్లిదండ్రుల ర్యాలీ, ధర్నా
పలు విద్యార్థి సంఘాల ఆందోళన
కరీంనగర్ ఎడ్యుకేషన్: ఎంసెట్–2 లీకేజీ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించి, ర్యాంకర్లకు యథావిధంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని, పరీక్ష రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంసెట్–2 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు శుక్రవారం కరీంనగర్ తెలంగాణచౌక్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, అసలైన ర్యాంకర్లకు తగిన న్యాయం చేయాలని కోరారు. లక్షలు వెచ్చించి రెండు సంవత్సరాలు కష్టపడి తమ పిల్లలు పరీక్షలు రాశారని, కొంతమంది చేసిన ద్రోహానికి అందరినీ బలిచేయడం భావ్యం కాదని ర్యాంకర్ల తల్లిదండ్రులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతాదక్పథంతో ఎంసెట్–2 కౌన్సెలింగ్‌ను యథావిధంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో...
ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగంటి అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ చౌక్‌లో ఎంసెట్–2 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులతో రాస్తారోకో నిర్వహించారు. అనిల్ మాట్లాడుతూ ఎంసెట్–2 లీకేజీ విషయంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. లీకేజీకి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, వైద్య శాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. ఎంసెట్–2ను రద్దు చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తే ఆందోళన ఉధతం చేస్తామన్నారు. నగర కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, గందె మాధవి, కాంగ్రెస్ నాయకులు అంజన్‌కుమార్, సరిళ్లప్రసాద్, బుచ్చిరెడ్డి, అజిత్‌రావు, జక్కని ఉమాపతి, జితేందర్, సుధీర్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు అఖిల్, అభిలాష్, శ్రీకాంత్, నాగరాజు, సాయి, విష్ణు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో...
ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం ముమ్మాటికీ ప్రభుత్వ అలసత్వం వల్లే జరిగిందని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, మహేందర్ మాట్లాడుతూ లీకేజికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, మిగతా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి రాకేశ్, అంబ్రిష్, కె.వివేక్, శ్రీనివాస్, అనిల్, అర్జున్, రంజిత్, శ్రావణ్ పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో...
ఎంసెట్–2 పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహించి మంత్రులు లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతి, బి.సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోత్సాహంతోనే లీకేజీ వ్యవహరం నడిచిందని ఆరోపించారు. నాయకులు రజనీకాంత్, రాజిరెడ్డి, రాము పాల్గొన్నారు.