పంద్రాగస్టునాడు చికెన్ మీల్స్
పెదబయలులో ఆశ్రమ పాఠశాలలో నిబంధనల ఉల్లంఘన
ఉపాధ్యాయులు కూడా ఆరగించిన వైనం
పెదబయలు: స్వాంతంత్య్ర దినోత్సవం రోజు మాంసాహార అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉన్నా ఇదేమీ పట్టించుకోకుండా ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కోడి మాంసంతో భోజనం ఏర్పాటు చేయడమేకాకుండా, ఉపాధ్యాయులు కూడా ఆరగించారు. విశాఖ జిల్లా పెదబయలు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అత్యుత్సాహంతో మెనూలో లేకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం రోజైన సోమవారం మాంసం వండించారు. పాఠశాలలో ఉన్న 400 మంది విద్యార్థులకు చికెట్ మీల్స్ పెట్టారు. అలాగే ఉపాధ్యాయుల కూడా ఆఫీసు గదిలో చికెన్‌తో భోజనాలు చేయడం విశేషం. స్వాంతంత్య్ర దినోత్సవం గొప్పతనం, ఆ రోజు చేయకూడని పనులు విద్యార్థులకు తెలియజెప్పాల్సిన ఉపాధ్యాయులే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం స్థానికులను విస్మయపరిచింది. దీనిపై పాఠశాల హెచ్ఎం దేముళ్లును ‘సాక్షి’ వివరణ కోరగా విద్యార్థులు మాంసం పెట్టాలని డిమాండ్ చేయడంతో చికెన్ భోజనం ఏర్పాటుచేశామని తెలిపారు.