కోతలపై కన్నెర్ర
దుబ్బాక, న్యూస్‌లైన్: అస్తవ్యస్తంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో అన్నదాతలు కన్నెర్ర చేశారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలని సోమవారం ఉదయం మండలంలోని పెద్దగుండవెళ్లిలో రోడ్డెక్కారు. సరాఫరా చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని పలువురు రైతులు పురుగు మందు డబ్బాలను పట్టుకుని స్థానిక 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఎదుట బైఠాయించారు. సూమారు 3 గంటలకు పైగా సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీ జయరాములు సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
తమ సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడినుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏడీకి పలువురు రైతులు విద్యుత్ కోతలతో నెలకొన్న సమస్యలను విన్నవించారు. ఎక్కడలేని విధంగా తమ గ్రామంలోనే కోతలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. వ్యవసాయానికి కేవలం నాలుగు, ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, అదికూడా వేళపాళా లేకుండా సరఫరా చేస్తున్నారని తెలిపారు. కోతల వల్ల పంటలు ఎండుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఏఈ, లైన్‌మన్ నిర్లక్ష్యం వల్లే సమస్య నెలకొందని వారు ఆరోపించారు. వారిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
బిల్లుల సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ సరైన విద్యుత్తు సరఫరా చేయడం లేదంటూ అధికారితో రైతులు వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ఏడీ జయరాములు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందన్నారు. ప్రస్తుతం కరెంట్ ఉత్పత్తులు పడిపోవటంతో ఈ సమస్య నెలకొందన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు వేణు, సత్యం, శ్రీనివాస్, రాజయ్య తదితరులున్నారు. సబ్‌స్టేషన్ వద్దకు దుబ్బాక ఏఎస్ఐ కొమురయ్య, సిబ్బంది అక్కడికి వచ్చి రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు.