పీజీ కౌన్సెలింగ్‌పై రీయింబర్స్మెంట్ ఎఫెక్ట్!
- ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఇవ్వని ప్రభుత్వాలు
- సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు ససేమిరా
- అభ్యర్థులు విలవిల.. కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత చదువులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో ఫీజులు కళాశాలల ఖాతాలకు నేటికీ చేరలేదు. దీంతో విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేశాయి. దీని ప్రభావం శనివారం ప్రారంభమైన పీజీఈసెట్ కౌన్సెలింగ్‌పై పడింది.
ఖాళీగా కౌన్సెలింగ్ కేంద్రాలు
గేట్, పీజీఈసెట్‌లో ర్యాంకులు సాధించినా కాలే జీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావడంలేదు. తాము బీటెక్ పాసైనట్లుగా వెబ్సైట్ మార్కుల జాబితాలు చూపినా అధికారులు అంగీకరించడంలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండా కౌన్సెలింగ్‌కు అనుమతించేది లేదని తెగేసి చెబుతున్నారు. అయితే.. అభ్యర్థులు పెద్దగా రాకపోవడంతో తొలిరోజు కౌన్సెలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. పీజీ కోర్సుల్లో చేరాల్సిన గేట్ ర్యాంకర్ల ధ్రువపత్రాల పరి శీలనకు గడువు ఆదివారంతో ముగుస్తుండడంతో అభ్యర్థులు నానా హైరానా పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం సుమారు 30వేల మంది అభ్యర్థులు తమ ధ్రువపత్రాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆర్జేయూకేటీలోనూ ఇదే దుస్థితి..
ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరిస్థితి అలాఉంటే.. ప్రభుత్వ విద్యాసంస్థలు తామేమీ తీసిపోమంటున్నాయి. రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిధిలోని 4 ఐఐఐటీల్లోనూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అంటుండడం విచారకరం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం ఆర్జేయూకేటీ ఆధ్వర్యంలో ఆరేళ్ల కిందట 4 ఐఐఐటీలను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రవేశ పరీక్షలతో నిమిత్తం లేకుండా టెన్త్ మెరిట్ ప్రకారం ఇంటర్, డిగ్రీల్లో ప్రవేశం కల్పించారు.
ఐదేళ్లపాటు ఫీజులు చెల్లించిన ప్రభుత్వం చివరి సంవత్సరంలో చెల్లించకపోవడంతో అక్కడి విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇడుపులపాయ, నూజి వీడు, బాసర, హైదరాబాద్ ఐఐఐటీల్లో డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులకు ఫీజులు రాలేదని అధికారులు ఫలితాలను సైతం నిలిపివేశారు. ఐఐఐటీల్లో బీటెక్ పూర్తిచేసిన పలువురు విద్యార్థులు గేట్, పీజీఈసెట్లలో మంచి ర్యాంకులు సాధించినా.. కౌన్సెలింగ్‌కు హాజరుకాక ఉన్నత చదువులపై ఆశలు వదులుకుంటున్నారు.
ఆశలు వదులుకున్నా..
మాది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి. టెన్త్‌లో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయ ఐఐఐటీలో సీటు వచ్చింది. బాగా చదివి బీటెక్‌లోనూ 77శాతం మార్కు లు సాధించా. గేట్-2014లోనూ ర్యాంకు వచ్చింది. చివరి ఏడాది ఫీజు బకాయి ఉంద ని అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. -శ్రీలత, గేట్ ర్యాంకర్, మహ బూబ్‌నగర్
సర్టిఫికెట్లు ఉంటేనే అనుమతి
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఫీజు బకాయిలుండటంతో సర్టిఫికెట్లు ఇవ్వ లేదని కొంతమంది చెబుతున్నారు. దాంతో మాకు సంబంధం లేదు. గేట్, పీజీఈసెట్లలో ర్యాంకులు వచ్చినవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తేనే ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతిస్తాం. -సీతారామరాజు, జేఎన్టీయూహెచ్ అడ్మిషన్స్ డెరైక్టర్
ఫీజులు చెల్లించాల్సిందే..
బీటెక్ పూర్తయిన విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు పూర్తిగా చెల్లించాల్సిందే. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే మా తప్పు కాదుకదా. ఫీజు బకాయిలు ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆర్జేయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లిన అభ్యర్థులకు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫీజులు వస్తే విద్యార్థులకు రీయింబర్స్మెంట్ చేస్తాం. - వేణుగోపాల్, ఐఐఐటీ డెరైక్టర్, ఇడుపులపాయ