మెమరబుల్ స్పాట్...మెట్రో పైలాన్
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను వివరించేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మెట్రో పైలాన్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పైలాన్ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు వ్యవస్థను వివరించడంతోపాటు నగర వారసత్వ కట్టడమైన చార్మినార్‌ను ప్రతిబింబించేలా మియాపూర్ స్టేషన్, మెట్రో రైలు డిపో మధ్యలో రూపొందించిన మెట్రో రైలు పైలాన్ ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం తర్వాత హెచ్ఎంఆర్ఎల్ పూర్తి పచ్చదనం ఉండేలా...సరస్సు మధ్యలో నుంచి మూడు ఆర్చ్‌లు వచ్చేలా తీర్చిదిద్దిన ‘చిహ్నం’ సెల్ఫీ స్పాట్‌గా మారనుంది. మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులతో పాటు నగరవాసులు ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపేలా తీర్చిదిద్దారు. ‘నీటి సరస్సు నుంచి బయటకు వచ్చే మూడు ఆర్చ్‌లు మూడు మెట్రో రైలు కారిడార్లను ప్రతిబింబిస్తున్నాయి.
రైలు ట్రాక్‌ను పోలిన ఒక్కో ఆర్చ్ మెట్రో రైలు వ్యవస్థ భవిష్యత్ విస్తరణను కళ్లకు కట్టినట్టు చూపెడుతుంది. సమకాలీన వివరణతో నగర వారసత్వ కట్టడమైన చార్మినార్, ఇతర కట్టడాల మాదిరిగా ఈ ఆర్చ్‌ను తయారుచేశాం. ఈ ఆర్చ్‌లు ఉక్కుతో తయారుచేసినవైనా ఫ్లోటింగ్ డిజైన్ తరహాలో మలిచాం. 14, 18, 22 అడుగుల్లో మూడు ఆర్చ్‌లు రెడీ చేశాం. నీలిరంగులో ఉండే ఆర్చ్‌లు ఆకర్షణీయంగా ఉన్నాయి. మెట్రో కోచ్‌ల రంగు మాదిరిగా స్టెయిన్లెస్ స్టీల్ ప్యానెల్స్‌ను ఉంచాం. మెట్రో వ్యవస్థకు దగ్గరగా కోడి గుడ్డు ఆకారంలో దీర్ఘవృత్తాకార గ్రానైట్ పోడియం ఉండేలా మొత్తం నిర్మాణం చేపట్టాం’ అని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ చిహ్నం స్పోర్ట్ లేటెస్ట్ 3–డీ లుక్ ఉండేలా ఆర్కిటెక్ట్ శంకర్ నారాయణ పర్యావరణహితంగా అత్యద్బుతంగా తీర్చిదిద్దారు.