గన్మెన్లు ‘పాద’ రక్షకులా?
శ్రీకాకుళం: వీఐపీల రక్షణకు నియమించిన సిబ్బంది అనుక్షణం డేగకన్నుతో విధి నిర్వహణ చేయాలి. అయితే కొంతమంది ఈ విషయాన్ని మరుస్తుండడమే కాకుండా అతిగా కూడా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలే శ్రీకాకుళంలో జరిగాయి. వివరాల్లోకి వెళితే... అరసవల్లిలో జరుగుతున్న సౌరయాగానికి విజయనగరం ఎంసీ బొత్స ఝాన్సి వచ్చారు. ఆమెకు బందోబస్తు ఏర్పాటుకు శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు ఆలయానికి వచ్చారు. ఆలయం బయట బందోబస్తును పర్యవేక్షిస్తున్న డీఎస్పీ వెనుక ఓ గన్‌మన్ ఉన్నాడు.
అయితే ఆయన విధి నిర్వహణను మరిచి ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులపై ప్రశ్నల వర్షం కురిపించి ఇబ్బందులపాలు చేశారు. ఆఖరికి విధినిర్వహణలో ఉన్న ప్రెస్ ఫొటోగ్రాఫర్లను సైతం వదిలిపెట్టలేదు. ఓ దశలో ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేశాడు. ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఇదిలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న చర్చికి కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వచ్చారు. అక్కడ ఆమె గన్‌మన్ కేవలం చెప్పులకు కాపాలా కాస్తూ కనిపించాడు. దీనిని కొందరు వింతగా చూశారు.