‘హెలెన్’ నష్టం రూ.501.22 కోట్లు
సాక్షి, ఏలూరు : హెలెన్ తుపాను నష్టాలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో మొత్తంగా రూ.501.22 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొంటూ నివేదిక రూపొందించారు. దానిని సోమవారం ప్రభుత్వానికి పంపించారు. తీరానికి సమీపంలో ఉన్న నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలపై హెలెన్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని తేల్చారు. బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పీఎం లంక, లక్ష్మణేశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం, వెదుర్లంక, వేముల దీవి, వైవీ పాలెం గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. అధికారిక గణాంకాల ప్రకారం..హెలెన్తుపాను ధాటికి జిల్లాలో 2,74,082.5 ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 6,472 ఎకరాల్లో అరటి, కొబ్బరి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు నాశనమయ్యాయి. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపోయాయి.
మరో 200 కొబ్బరి చెట్లు మొవ్వు విరిగిపోవడంతో బతికే అవకాశాలు లేవు. 1,389 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఓ ఇల్లు, 66 కచ్చా ఇళ్లు పూర్తిగా పడిపోయాయి. పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లు 34 కాగా, పాక్షికంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లు 121. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు 995, గుడిసెలు 212 కాగా, మొత్తం నష్టం రూ.34.46 లక్షలుగా అంచనా వేశారు. ఇదిలావుండగా 62 వృక్షాలు నేలకూలాయి. ఈ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. పంచాయతీరాజ్‌కు చెందిన 94 రోడ్లు 116.1 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. దీనివల్ల రూ.40.74 కోట్లు నష్టం వాటిల్లింది. 110 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతినడంతో రూ.20 లక్షల నష్టం కలిగింది. మునిసిపాలిటీల్లో 19.98 కిలోమీటర్ల మేర రోడ్లు, 9.50 కిలోమీటర్ల మేర డ్రెరుున్లు దెబ్బతిన్నాయి.
205 వీధిలైట్లు పాడయ్యాయి. 6 భవనాలు ధ్వంసమయ్యూరుు. ప్రత్యేక పారిశుధ్య పనులకు రూ.25వేలు ఖర్చయ్యింది. మునిసిపాలిటీలకు వాటిల్లిన మొత్తం నష్టం రూ.10.38 కోట్లుగా తేల్చారు. మైనర్ ఇరిగేషన్ వనరులు 15 దెబ్బతినగా, రూ.1.50 కోట్లు నష్టం కలిగింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి రూ.15.7లక్షల విలువైన పైపులు పాడయ్యాయి. మత్స్య శాఖకు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 97 వైద్యశిబిరాలు నిర్వహించి, రూ.57 లక్షలను ఖర్చు చేశారు. 3 పవర్ మగ్గాలు దెబ్బతినగా, రూ.15 వేల నష్టం ఏర్పడింది. ఒక పశువు మృతి చెందడంతో రూ.16,400 నష్టం వాటిల్లింది.
అవి తుపాను మరణాలు కాదట!
హెలెన్ తుపాను బీభత్సాన్ని చూసేందుకు కారులో వెళుతున్న పెనుమంట్ర తహసిల్దార్ దంగేటి సత్యనారాయణ భట్లమగుటూరు వద్ద ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌కు చెందిన పోతినేని భాస్కరరావు అనే రైతు పొలంలోకి వెళ్లి వస్తుండగా, చెట్టు విరిగిపడి మరణిం చారు. అత్తిలి మండలం ఉనికిలిలో వంట గది గోడ కూలడంతో గాయపడిన బుద్దా మంగమ్మ చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఈ మరణాలేవీ తుపాను ఖాతాలోకి చేరలేదు.