ప్రతి కాలేజీలో స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్
♦ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు డిప్యూటీ సీఎం కడియం సూచన
♦ కాలేజీల నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలి
♦ బయోమెట్రిక్ మిషన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
♦ హైదరాబాద్‌లో ప్రిన్సిపాళ్ల వర్క్‌షాప్‌కు హాజరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఇతర విద్యార్థులతో పోటీ పడేలా వారిని తీర్చిదిద్దాలని ప్రిన్సిపాళ్లకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఇందుకోసం ప్రతి కాలేజీలో స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేసి వాటిని పటిష్టపరచాలన్నారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంతోపాటు సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, ప్రయోగశాలలు, లైబ్రరీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కంప్యూటర్లు, ఇన్ స్ట్రక్టర్లు లేకుంటే వెంటనే కమిషనర్‌ను సంప్రదిస్తే నిధులు సమకూరుస్తారని చెప్పారు. డిగ్రీ కాలేజీల నిర్వహణలో ప్రిన్సిపాళ్లు మరింత శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు శనివారం నగరంలోని సర్వశిక్షా అభియాన్ హాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీకి ప్రిన్సిపాల్ లీడర్‌గా ఉండాలని... కళాశాలలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వెనకబడిన తరగతుల విద్యార్థులే ఎక్కువగా చదువుతున్నారని, అందువల్ల వారు సత్ఫలితాలు సాధించేలా చూడాలన్నారు.
మౌలిక వసతుల కోసం చర్యలు...
విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, కొన్ని కళాశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల్లేమి వల్ల 63 కాలేజీలు న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేకపోవడంతో వాటిలో 33 కాలేజీలకు సొంత భవనాల నిర్మాణానికి వెంటనే రూ. 2.25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. 2017 జూలై నాటికి నూతన భవనాలు సిద్ధమైతే న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూసా నిధులు, మౌలిక వసతుల కోసం రూ. 282 కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడియం చెప్పారు.