విద్యారంగ సంస్కరణలపై చర్చించాలి: పీఆర్టీయూ
రాజానగరం: విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ముందుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) డిమాండ్ చేసింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమాలు తప్పవని ెహ చ్చరించింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గైట్ కళాశాలలో ఆదివారం యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు ఎం.కమలాకరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానాన్ని సంఘం నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు.
పాత విధానంలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని, మధ్యాహ్న భోజన పథకం నుంచి ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని కోరారు. ఒకే పని సమయాల అంశాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), గాదె శ్రీనివాసులు నాయుడు, డాక్టర్ బచ్చల పుల్లయ్య హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి అప్పారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.