బీడీపై జీఎస్టీ వద్దు
లక్షల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు
⇒ సిరిసిల్లలో కదం తొక్కిన బీడీకార్మికులు
⇒ పట్టణంలో నిరసన ర్యాలీ
⇒ కలెక్టరేట్ ముందు ధర్నా
సిరిసిల్లటౌన్: బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని కార్మికులు నినదించారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ వద్దని, తమ పొట్టకొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత భూమేశ్వర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పుర్రెగుర్తుతో డీలాపడిన బీడీ పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారుతోందని, ఏకంగా పరిశ్రమే ఖాయిలా పడేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు. దీంతో లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. పుర్రె గుర్తుతో ఇప్పటికే కార్మికులకు పనిదినాలు తగ్గాయన్నారు.
జీఎస్టీతో నెలకు పదిరోజులు కూడా పనిదినాలు దొరికే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ.. సామాన్యుడు బీడీలు కూడా తాగలేని పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించవద్దని డిమాండ్ చేశారు. అనంతరం బీడి కార్మికుల కష్టనష్టాలను వివరిస్తూ..కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆకుల రాములు, జిందం ప్రసాద్, మణెమ్మ, రాధ, బాలక్కతో పాటు కార్మిక సంఘాల నాయకులు, బీడి కార్మికులు పాల్గొన్నారు.