Punjabi singer
-
నా భార్య చూడకముందే బిడ్డను కప్పిపెట్టా.. సింగర్ ఎమోషనల్
పిల్లల్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద దుఃఖం మరొకటి ఉండదు. తన జీవితంలోనూ అతి పెద్ద విషాదం రెండో కొడుకుని కోల్పోవడమే అంటున్నాడు సింగర్ బి ప్రాక్. నా కొడుకు మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నేనేం పాపం చేశానని భగవంతుడు నాకు ఇంత పెద్ద శిక్ష విధించాడని బాధపడుతుంటాను.సమాధి చేశాం..చనిపోయిన శిశువును ఒక్కసారి చూస్తానని నా భార్య మీరా అడిగింది. తన బాధ రెట్టింపు చేయడం ఇష్టం లేక అందుకు ఒప్పుకోలేదు. తనకు చూపించకుండానే సమాధి చేశాం. ఇప్పటికీ ఈ విషయంలో తను నాపై కోప్పడుతూనే ఉంటుంది.. అని కన్నీళ్లుపెట్టుకున్నాడు.కెరీర్..కాగా బిప్రాక్, మీరా 2019 ఏప్రిల్ 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2020లో అదాబ్ అనే కుమారుడు జన్మించాడు. 2022లో మరో శిశువు జన్మించగా.. పురిట్లోనే కన్నుమూసింది. కాగా ప్రాక్.. పంజాబీ, హిందీ భాషల్లో అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా, సింగర్‌గా పని చేశాడు. ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాడు. కేసరి సినిమాలో తేరి మిట్టి పాటకుగానూ ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: ప్రియుడితో సినిమాకు.. కాబోయే అత్త కూడా వెంటే వచ్చేది: హీరోయిన్ -
11 ఏళ్లకే ఇంట్లో నుంచి పంపించేశారు: నటుడు
బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన అమర్ సింగ్ చంకీలా (అమర్ సింగ్ చంకీలా బయోపిక్) సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. ఒక్కమాటైనా అడగలేదు '11 ఏళ్ల వయసున్నప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. నా తల్లిదండ్రులను, ఊరిని వదిలేసి మా మామతో లూథియానాకు వెళ్లిపోయాను. అతడు నన్ను తనతో పంపించమని అడగ్గానే అమ్మానాన్న నాకు మంచి ఫుడ్, షెల్టర్ దొరుకుతుందన్న ఆశతో వెంటనే తీసుకెళ్లిపోమని చెప్పారు. వెళ్లడం ఇష్టమేనా? అని నన్ను ఒక్క మాటైనా అడగలేదు. అక్కడికి వెళ్లాక ఒక గదిలో ఒంటరిగా ఉండేవాడిని. టీవీ ఉండేది కాదు. అప్పుడు ఫోన్లు కూడా లేవు. అలా నా కుటుంబానికి నేను పూర్తిగా దూరమయ్యాను. నేను ఏ స్కూల్లో చదువుతున్నానని కూడా నాన్న అడిగేవారు కాదు. అందరితో నా సంబంధాలు తెగిపోయాయి. అమ్మ మాటలు వింటే.. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడల్లా కాల్ కట్ చేసేముందు అమ్మ నన్ను ఆశీర్వదించేది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దీవించగానే అన్ని టెన్షన్లు ఎగిరిపోయేవి. ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది. తన మాటలతో నాపై ప్రేమవర్షం కురిపించేది. ఆ దేవుడి కంటే కూడా నాకు మా అమ్మే ఎక్కువ' అని చెప్పుకొచ్చాడు. దిల్జిత్ ఇటీవల క్య్రూ సినిమాలో కనిపించాడు. చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్‌గా అది తప్పదన్న నటుడు -
మూసేవాలా తల్లి ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్‌కు 58 ఏళ్ల వయసులో ప్రసవానికి కారణమైన ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్సపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సేవలు పొందే మహిళ వయసు 21– 50 మధ్య ఉండాలి. మూసేవాలా హత్యకు గురైన రెండేళ్లకు ఆయన తల్లి చరణ్ కౌర్ మార్చి 17న మగబిడ్డను ప్రసవించారు. -
సింగర్ తల్లిదండ్రుల షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో!
రెండేళ్ల క్రితం పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 2022 మేలో జరిగిన ఈ దారుణహత్యతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దూ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పంజాబీ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే తాజాగా సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సిద్దూ తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం దాల్చడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందిగా డాక్టర్లు సలహాలు పాటిస్తున్నారు. సిద్దూ మూసేవాలా హత్య పంజాబీ సింగర్ అయినా సిద్దూ మూసేవాలాను మే, 2022లో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. తన స్నేహితులతో కలిసి ఉండగా సిద్దూని కాల్చి చంపినట్లు వార్తలొచ్చాయి. ఈ హత్య కేసులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్‌పూరియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. సిద్దూ మూసేవాలా సో హై, సేమ్ బీఫ్, ది లాస్ట్ రైడ్, జస్ట్ లిసెన్, 295లాంటి సాంగ్స్ తో పాపులర్ అయ్యాడు. కాగా.. గతంలో సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ విచారణలో అంగీకరించాడు. అతితి తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేసినట్లు చెప్పాడు. తమ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు. -
సింగర్ ఎల్లీ మంగట్ హత్యకు కుట్ర..అర్షదీప్ ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్ విహార్‌లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్షూటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్‌ప్రీత్ సింగ్(25), వీరేంద్ర సింగ్(22)గా గుర్తించారు. పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్ కుడి కాలికి గాయమైంది. ఎన్కౌంటర్ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
స్టార్ సింగర్‌కి బెదిరింపు.. తలకు తుపాకీ గురిపెట్టి!
సెలబ్రిటీలని చూసి మనలో చాలామంది కుళ్లుకుంటాం. వాళ్లకేంటి సూపర్ లైఫ్ అని జెలసీ ఫీలవుతుంటాం. అయితే ఈ విషయంలో ప్లస్సులతో పాటే మైనస్సులు కూడా ఉంటాయి. కాకపోతే వాటిని సదరు సెలబ్రిటీలు బయటపెట్టినప్పుడే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ సింగర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పి, అవాక్కయ్యేలా చేశాడు. పంజాబీలో పలు ఆల్బమ్ సాంగ్స్‌తో పాపులర్ అయిన సింగర్ సుధీర్ యదువంశీ. ఇతడు రీసెంట్గా ఓ పెళ్లి సంగీత్కి వెళ్లాడు. స్టేజీపై ఉన్న ఇతడి దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఈ గాయకుడే బయటపెట్టాడు. తలకు గన్ గురిపెట్టి మరీ బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్) 'సంగీత్ లో ఉన్న నా దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. తను రాసిన పాటని పాడమన్నాడు. నేను కుదరదు అని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఎందుకులే అని ఊరుకున్నాను. కొంతసేపటికి స్టేజీపై నుంచి దిగిపోతున్న నన్ను ఫాలో అయ్యాడు. ఒక్కసారిగా నా దగ్గరకొచ్చి సడన్‌గా తుపాకీ బయటకు తీశాడు. నాకు గురిపెట్టి.. పాడతావా లేదా? అని బెదిరించాడు. ఒక్కసారిగా షాకయ్యాను' 'గన్ నావైపు గురిపెట్టడమే కాకుండా.. పాట పాడితేనే స్టేజీ దిగుతావ్ లేదంటే.. అని భయపెట్టాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడ్డాను. చేసేదం లేక.. అతడు చెప్పినట్లే ఆ పాట పాడాను. అది కూడా ఏకంగా మూడుసార్లు' అని సుధీర్ యదువంశీ తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్‌ని తాజాగా బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్.. అతడి హత్య ఇప్పటికీ మిస్టరీనే!
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహ జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? దుస్తుల మిల్లులో చేరి.. భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన చమ్కీలా చమ్కీలా (ధనీరామ్) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్.. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. రెండో పెళ్లి.. ఊరూరా ప్రదర్శనలు మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. తూటాల వర్షం.. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాలపాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. చమ్కీలా కూతురు, కొడుకు కూడా సింగర్లే చమ్కీలా కుమార్తె కమల్. యూట్యూబ్‌లో ఈమె వీడియోలు, పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చమ్కీలా కుమారుడు జైమన్ చమ్కీలా, కోడలు రియా. (వీరిద్దరూ జోడీగా చేసే ఫోక్ సాంగ్స్ కూడా ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. - సంహిత నిమ్మన చదవండి: ఒక్కరోజుకు నాలుగు వందలా? అవసరం లేదన్న హీరోయిన్ -
ప్రముఖ సింగర్ ఇంట తీవ్ర విషాదం.. ఆగిపోయిన కొడుకు పెళ్లి
కుమారుడి పెళ్లికి రెండురోజుల ముందు తల్లి చనిపోవడంతో ప్రముఖ సింగర్ ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. ప్రముఖ పంజాబీ సింగర్ నచ్చతార్ గిల్ భార్య దల్విందర్ కౌర్(48)కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచింది. దీంతో నేడు(నవంబర్17)న జరగాల్సిన కొడుకు పెళ్లి ఆగిపోయింది. దల్విందర్ కౌర్ ఆరోగ్యం బాలేకపోవడంతో ఇటీవలె కొడుకు, కూతురికి వివాహం నిశ్చయించారు. దల్విందర్ కౌర్ చనిపోవడానికి రెండు రోజుల ముందే కూతురి పెళ్లి వైభవంగా జరిగింది. మరోవైపు కుమారుడి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో కుమారుడి పెళ్లి చూడకుండానే ఆమె కన్నుమూయడంతో పెళ్లింట విషాదం నెలకొంది. కాగా 2006లో గల్ సున్ హోగయా చిత్రంతో ఇండస్ట్రీకి ఇంట్రీ ఇచ్చిన నచ్చతార్ 'దిల్ దిత్తా నహీ సీ' అనే ఆల్బమ్‌తో పాపులర్ అయ్యాడు. ఆయన చివరగా 'జుగాడీ డాట్ కామ్' అనే చిత్రంలో పాడాడు. -
హ్యాపీగా టాయ్‌లెట్స్ కడిగేవాడిని, బాగా డబ్బులొచ్చేవి: నటుడు
పంజాబీ ఇండస్ట్రీలో ఇటీవలే ఇరవయ్యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు గిప్పీ గ్రీవల్. సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్న ఆయన కెరీర్ ఏమీ పూలపాన్పు కాదు. డబ్బుల కోసం టాయ్‌లెట్స్ కడిగే స్థాయి నుంచి సినిమాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే లెవల్‌కు వెళ్లాడీ హీరో. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. 'ఇండియాలో టాయ్‌లెట్స్ క్లీన్ చేసేవాళ్లను చిన్నచూపు చూస్తారు. నిజంగా అది మన దురదృష్టం. కెనడాలో ఉన్నప్పుడు నేను కూడా ఆ పని చేశాను. నేల తుడవడమే కాకుండా బాత్రూమ్స్ కూడా శుభ్రం చేసేవాడిని. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు. పైగా అలా టాయ్‌లెట్స్ క్లీన్ చేయడం వల్ల నాకు ఎక్కువ డబ్బులొచ్చేవి. కాబట్టి సంతోషంగా ఆ పని చేసేవాడిని. అంతేకాక నేను, నా భార్య రవ్నీత్ వేకువజామున నాలుగన్నర గంటలకే నిద్ర లేచి వార్తాపత్రికలు పంచేవాళ్లం. దెయ్యాలకోటలా ఉన్న ఇండ్లలోకి న్యూస్‌పేపర్స్ ఇవ్వాలంటే తను ఎంతో భయపడేది. కానీ తప్పదు కాబట్టి సమయానికి వెళ్లి పేపర్ వేసేవాళ్లం' అని చెప్పుకొచ్చాడు. కాగా గిప్పీ 2002లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతడు గాయకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. గిప్పీ నటించిన హనీమూన్ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అమర్ ప్రీత్ ఛాబ్రా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాస్మిన్ భాసిన్ హీరోయిన్. చదవండి: నేను ఎలా ఉన్నా అందగత్తెనే, సినిమాలు వాటంతటవే వస్తాయి బిగ్‌బాస్ నామినేషన్స్: ఆ జంట మధ్య బిగ్ ఫైట్ -
సిద్ధూ హత్య కేసు: పోలీసు కస్టడీ నుంచి గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్!
ఛండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసు కస్టడీ నుంచి దీపక్ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇవ్వెస్టిగేషన్ ఏజెన్సీ(సీఐఏ) సిబ్బంది ప్రైవేటు వాహనంలో మాన్సా నుంచి కపుర్థలా జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలిస్తున్న క్రమంలో అదును చూసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్.. గ్యాంగ్‌స్టర్, ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు పథకం రచించటం నుంచి అమలు చేసే వరకు పాల్గొన్నట్లు భావిస్తున్న 15 మంది జాబితాలో దీపక్ పేరును చేర్చారు పోలీసులు. ప్రొడక్షన్ వారెంట్‌పై ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితమే దీపక్‌ను పంజాబ్ తీసుకొచ్చారు. శనివారం జరిగిన సంఘటనతో పోలీసుల నుంచి దీపక్ పారిపోవటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. గతంలో 2017లో అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్. ఆ సమయంలో పెప్పర్ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు. ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకున్నాడు. ఇదీ చదవండి: సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు -
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోళ్లతో రక్కిన కంటెస్టెంటు, కళ్లకు గాయాలు
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పంజాబీ సింగర్, నటి సారా గుర్పాల్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె ఎలిమినేషన్‌ను చాలామంది తప్పు పట్టారు. కానీ ఆమెను పంపించేయడం వెనక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఆమె ఫొటోలే నిదర్శనం. ఈ ఫొటోల్లో ఆమె కళ్లకు తీవ్ర గాయాలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గాయం ఎలా అయిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో గత వారం ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది. అందులో భాగంగా సారా బుల్డోజర్ ఎక్కి కూర్చుంది. ఆమెను తోసేసి కూర్చునేందుకు నిక్కీ తంబోలి తన గోళ్లతో సారా కళ్ల దగ్గర రక్కింది. ఈ ఫుటేజీని బిగ్‌బాస్ టీమ్ ఎడిట్ చేసి తీసేసింది. (చదవండి: బిగ్‌బాస్: రెయిన్ డ్యాన్స్‌తో అదరగొట్టిన అమ్మాయిలు) కానీ మిగతా కంటెస్టెంట్లు దీని గురించి మాట్లాడుకోవడంతో ఈ విషయం బయటపడింది. తనను గాయపరుస్తున్నా సరే సారా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేకుండా గేమ్ ఆడటంపైనే దృష్టి పెట్టడం విశేషం. ఇక ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సారా ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఆ వెంటనే ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. కాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14 అక్టోబర్ 3న ఆడంబరంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో 11 మంది కంటెస్టెంట్లు రుబీనా దిలైక్, ఆమె భర్త అభినవ్ శుక్లా, ఎజాజ్ ఖాన్, జాస్మిన్ బాసిన్, నిశాంత్ సింగ్ మల్కానీ, పవిత్ర పూనియా, నిక్కీ తంబోలి, సారా గుర్పాల్, రాహుల్ వైద్య, హెహజాద్ డియోల్, జాన్ కుమార్ సాను, రాధే మా పాల్గొన్నారు. (చదవండి: రణ్‌బీర్, అలియా వివాహం అప్పుడే!) -
ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
ఢిల్లీ : హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ఫేమ్, మోడల్, పంజాబీ సింగర్ హిమాన్షి ఖురానా నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కాగా నాలుగు రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న హిమాన్షి ఆరోగ్య పరిస్థితి గురువారం కాస్త సీరియస్ అయింది . ఆమె 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని.. ఆక్సిజన్ లెవెల్ కూడా దారుణంగా పడిపోవడంతో అప్రమత్తమై లుదియానాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడిందని తెలిపారు.ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతోనే ఆమెకు ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి : అహ్మద్ పటేల్‌కు కరోనా పాజిటివ్) కాగా వ్యవసాయ బిల్లలకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో రైతులకు మద్దతుగా హిమాన్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ఆందోళనల్లో పాల్గొన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. మనమంతా రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె తెలిపారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న తర్వాత తిరిగి షూటింగ్‌కు వెళ్లడానికి ముందు ముందుజాగ్రత్త చర్యగా కరోనా పరీక్ష చేయించుకోగా ..హిమాన్షికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన అందరూ దయచేసి కరోనా పరీక్ష చేయించుకోవాలని కూడా హిమాన్షి కోరారు. హిమాన్షి ఆరోగ్య విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.కాగా పంజాబీ మ్యూజిక్ పాటల ద్వారా హిమాన్షి ఖురానా మంచి పాపులారిటీ సంపాదించారు. బిగ్‌బాస్ సీజన్ 13లో హిమాన్షి ఖురానా నటుడు అసీమ్ రియాజ్‌తో మంచి రిలేషిన్షిప్ ఏర్పరచుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో రీఎంట్రీ ఇచ్చిన హిమాన్షికి రియాజ్ లవ్ ప్రొపోజ్ చేయడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించారు. -
పెళ్లికి రెడీ అవుతోన్న 'పహిల్వాన్' విలన్
తెలుగు, తమిళ నటుడు కబీర్ దుహాన్ సింగ్ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. గాయని డాలీ సిధుతో ఐదేళ్లుగా జరుపుతున్న ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టేసి పెళ్లి పీటలెక్కనున్నారు. గతేడాది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగ్గా కరోనా కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే వీరు పరిస్థితులు అనుకూలిస్తే డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని కబీర్ స్వయంగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. అవును, ఈ ఏడాది డిసెంబర్లో ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నామని తెలిపారు. అయితే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. (నటి మూడో పెళ్లిపై విమర్శలు) అప్పటికీ కరోనా ఉధృతి ఉంటే ఆ సమయంలో పెళ్లి వేడుకలు జరుపుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అప్పటివరకు పరిస్థితులు అనుకూలిస్తే ముంబైలో పెళ్లి, ఢిల్లీలో రిసెప్షన్ చేసుకోవాలని భావిస్తున్నారు. కాగా కబీర్ దుహాన్ సింగ్ 'వేదళం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన 'పహిల్వాన్'లో ప్రతినాయక పాత్రలో మెప్పించారు. ఆయన చివరిసారిగా 'యాక్షన్' అనే తమిళ చిత్రంలో కనిపించారు. మరోవైపు డాలీ సిధు పంజాబీ చిత్ర పరిశ్రమలో పాపులర్ సింగర్‌గా రాణిస్తున్నారు. (త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? ) -
బీజేపీలోకి ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్ హన్స్తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. -
సూఫీ గాయకుడు వదాలీ కన్నుమూత
అమృత్సర్: ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు, వదాలీ సోదరుల్లో ఒకరైన ఉస్తాద్ ప్యారేలాల్ వదాలీ(75) శుక్రవారం అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఛాతీలో నొప్పి రావడంతో ప్యారేలాల్ను సోమవారం ఇక్కడి ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్‌పై వైద్యం అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వదాలీ సోదరులుగా పేరుగాంచిన పురాన్చంద్, ప్యారేలాల్ వదాలీలు ‘తూ మానే యా నా మానే’ ‘రంగ్రీజ్ మేరే’ వంటి విజయవంతమైన పాటల్ని ఆలపించారు. సూఫీ సంగీతానికి వీరిద్దరూ చేసిన సేవలకు గుర్తుగా పలు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు వీరిని వరించాయి. ప్యారేలాల్కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నిరాశ.. ఆ గాయకుడిని మింగేసింది
లుధియానా: ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ (38 ) ఆత్మహత్య చేసుకున్నాడు. భటిండాలోని తన సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. వృత్తిపరంగా రాణించలేకపోతున్నాననే మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆఫర్లు తగ్గిపోవడంతో బాగా డిప్రెషన్లో ఉన్నాడని ధరం ప్రీత్ తల్లి బల్వీందర్ కౌర్ చెబుతున్నారు. 'ఈ ఫ్యాన్ నా జీవితాన్ని మింగేసేలా ఉంది' అని తరచూ అనేవాడని ఆమె వాపోయారు. అమృతసర్‌లో జరిగిన ఒక ప్రదర్శన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత సోమవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆ సమయంలో అతని భార్య, పిల్లలు ఇంట్లో లేరని సమాచారం. బిలాస్ పూర్ గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన ధరంప్రీత్.. చిన్న తనం నుంచి గొప్పగాయకుడు కావాలని కలలు కనేవాడు. ఈ నేపథ్యంలో సంగీతంపై మంచి పట్టు సాధించాడు. సొంతంగా 15 ఆల్బంలను విడుదల చేశాడు. అతని పాటలు గ్రామీణులను బాగా ఆకట్టుకునేవి. 2010 లో విడుదలైన ఎమోషన్ ఆఫ్ హార్ట్ అనే ఆల్బం చివరిది. అప్పటినుంచి ఒక్క ఆల్బం కూడా విడుదల కాకపోవడంతో ధరం ప్రీత్ చాలా నిరాశకు గురయ్యాడు. కాగా వర్ధమాన గాయకుని హఠాన్మరణంతో పంజాబీ సంగీత ప్రపంచం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.