సుప్రజను భర్తే హత్య చేశాడు?
మృతదేహంతో ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన
నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్
(క్రైమ్) : పాణ్యం సుప్రజ అలియాస్ కరుణమాలను భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుప్రజను హత్య చేసిన భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని గురువారం మృతదేహంతో ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే సుప్రజ భర్త పూర్ణప్రసాద్‌ను కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట కుంకుంపూడికి చెందిన ప్రసాద్ కుమార్తె సుప్రజకు అదే గ్రామానికి చెందిన పాణ్యం పూర్ణప్రసాద్ (చిట్టమూరు కానిస్టేబుల్, ప్రస్తుతం రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నాడు)తో 2013 నవంబర్ 9న వివాహమైంది. ఆ సమయంలో సుప్రజ తల్లిదండ్రులు పూర్ణప్రసాద్‌కు కట్నం కింద రూ. 1.5 లక్షల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహానంతరం పూర్ణప్రసాద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించ సాగారు. తన తల్లిదండ్రులకు అంతస్తోమత లేదని చెప్పడంతో మరింతగా వేధించడం ప్రారంభించారు. ఈ విషయమై పలుమార్లు తల్లిదండ్రుల వద్ద వాపోయింది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని పూర్ణచంద్రరావు వచ్చి పుట్టింటిలో ఉన్న భార్యను తన ఇంటికి తీసుకువచ్చాడు. బుధవారం సుప్రజ మృతి చెందిన విషయం తెలిసిందే. సుప్రజ ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత పిరికిది కాదని.. భర్త, అత్త సుగుణమ్మలే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు వెంకటాచలం ఎస్ఐ రహమతుల్లాకు ఫిర్యాదు చేశారు.
ఆమె మెడపై కూడా ఉరేసుకున్న గాయాలు లేవని, సుప్రజను కొట్టిచంపారని వాపోయారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే సుప్రజ భర్త పూర్ణప్రసాద్, అతని తల్లి సుగుణమ్మ ఆస్పత్రికి రావడంతో మృతురాలి బంధువులు వారిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వారిద్దరిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఎస్పీ బంగ్లా ఎదుట ఉద్రిక్తత
సుప్రజ భర్త పూర్ణప్రసాద్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కేసు నీరుగారుస్తున్నారని, స్టేషన్లో అతనికి రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో ఎస్పీ బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లా గేటు వద్ద మృతదేహాన్ని ఉంచి వెంటనే న్యాయం చేయాలని నినదించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన విషయం తెలుసుకున్న నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, వీఎస్ రాంబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వై. జయరామసుబ్బారెడ్డి, జి. శ్రీనివాసరావు, నాలుగు, ఆరో నగర ఇన్స్పెక్టర్లు జి. రామారావు, జి. మంగారావు బంగ్లా వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇప్పటికే పూర్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.