కొట్టొస్తున్న వైఫల్యం
పుష్కారాలకు కండిషన్లో లేని బస్సులు
అభద్రత నీడన ప్రయాణం
వరుస ప్రమాదాలకు గురవుతున్న ‘పురం’ బస్సులు
హిందూపురం అర్బన్ : కృష్ణా పుష్కరాలకు కండిషన్లో లేని బస్సులు పంపుతుండడంతో మార్గమధ్యలోనే అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ వైఫల్యం కారణంగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో బస్సులో ప్రయాణించేందుకు భక్తులు భయపడుతున్నారు. ప్రత్యేకించి హిందూపురం డిపో నుంచి ఐదు బస్సులను కృష్ణా పుష్కరాల కోసం కేటాయించగా, ఈ నాలుగు రోజుల్లో నాలుగు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనల్లో ఒక ప్రయాణికురాలు మృత్యువాతపడింది. ఇంకొందరు ఆస్పత్రుల పాలయ్యారు. తాజాగా శనివారం రాత్రి హిందూపురం నుంచి బయలుదేరిన సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం తెల్లవారుజామున కృష్ణా బ్యారేజ్ దాటగానే వెనుకనున్న రెండు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం
హిందూపురం డిపోకు చెందిన బస్సుల వరుస ప్రమాదాలపై విచారణ చేస్తున్నాం. డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ప్రమాదాలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూస్తోంది. బస్సుల కండిషన్లు, ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నాం.
– రాంబాబు, డిప్యూటీ సీఎంఈ