గోదావరిలో సీసీ కెమెరాలు
పుష్కరాల భద్రతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లలో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర పోషించనుంది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక సీసీ కెమెరాలు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తున్న భక్తుల్ని గుర్తించి అప్రమత్తం చేస్తాయి. దీనికి సంబంధించి అధునాతన సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని దాదాపు 258 ఘాట్లలో పుష్కరాలు జరగనున్నాయి.
వీటిలో మొత్తం 250 వరకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు ‘4 జీ’ టెక్నాలజీ ద్వారా వీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని కంట్రోల్ రూమ్‌లతో పాటు రాజమండ్రిలో ఏర్పాటు చేసే మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (ఎంసీసీసీ) అనుసంధానించారు. ఎంసీసీసీలో ఉండే కంప్యూటర్లలోని తెరపై ఘాట్లలో దృశ్యాలు ఎప్పటికప్పుడు కనిపిస్తుంటాయి. స్నానాలు చేసే భక్తులు ఎవరైనా ప్రమాదంలోపడితే అప్పటికే నిక్షిప్తమైన సమాచారం ద్వారా అది కంట్రోల్‌రూంకు తెలుస్తుంది. అక్కడి సిబ్బంది వెంటనే గస్తీ పోలీసులను అప్రమత్తం చేసి ప్రమాదాలను నివారిస్తారు.