'ఏడాది చివరికి ప్లాస్టిక్ కరెన్సీ'
సాక్షి ప్రతినిధి,చెన్నై: ఈ ఏడాది చివరి నాటికి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీని వాడకంలోకి తేనున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్రాజన్ తెలిపారు. చెన్నైలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ కరెన్సీని చెలామణిలోకి తెచ్చామని, అందులోని సాధకబాధకాలను అధ్యయనం చేసి ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో వాడకంలోకి తెస్తామని చెప్పారు. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఈ-మనీట్రాన్స్ఫర్ సైతం త్వరలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆర్థికంగా దేశం ఎంతో స్థిరంగా ఉండడమేగాక పురోగమన దిశగా మరో దశకు చేరుకోనుందని అన్నారు. కొంతకాలంగా మూలనపడి ఉన్న ఆర్థికాభివృద్ధిపథకాల అమలుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.