ramalingeswara swamy
-
కమనీయం.. రామలింగేశ్వరుడి కల్యాణం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారు జామున కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి స్వామి అమ్మవారిని నంది వాహనంపై మంగళవాయిద్యాలు, భజనల మధ్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యశాస్త్రి, నీలకంఠశివాచార్య, ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సురేశ్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు జరిపించారు. స్వామి వారికి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. -
‘నటి శ్రీదేవిది హత్యే’
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వరస్వామి ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేశారు. ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని, సన్నిహితులే శ్రీదేవిని చంపారని ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని పేర్కొన్నారు. ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తుడైన కన్నప్పకు శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున సారె అందజేశారు. ఆనవాయితీగా కైలాసగిరి కొండపై వెలసి ఉన్న భక్తకన్నప్ప ఆలయానికి మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా వెళ్లి సారెను అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూడా సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ నెలకొంది. విద్యుద్దీపాలు, పుష్ప, మామిడి తోరణాలు, అరటి చెట్లతో ఆలయం కొత్తశోభను సంతరించుకుంది. ఈఓ భ్రమరాంబ, ఏఈఓ శ్రీనివాసులురెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మేడ్చల్ జాతర ప్రారంభం
మేడ్చల్: రామలింగేశ్వర స్వామి కల్యాణ ఉత్సవం మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే మేడ్చల్ జాతర బుధవారం నుంచే ప్రారంభమయింది. మంగళవారం రాత్రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి లు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర సంధర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. -
ఓం నమఃశివాయ
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్: ఓం నమఃశివాయ.. హరహర మహదేవ శంభోశంకర అంటూ అశేషభక్త జనం శివనామస్మరణల మధ్య చెర్వుగట్టులోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా జరి గింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చుకులు సతీష్‌శర్మ, రాంబాబు, సురేష్, సుధాకర్, పవన్, సిద్ధులు తదితరులు వేదమంత్రాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ కణకణమండే నిప్పు కణికల నుంచి నడుచుకుంటూ వెళ్లా రు. అగ్నిగుండాల్లో ధాన్యం, ఆముదాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గట్టుపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయరాజు, సర్పంచ్ మల్గ రమణబాలకృష్ణ, మాజీ చైర్మన్లు మేకల రాజిరెడ్డి, రేగట్టే రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, గడుసు శశిధర్ రెడ్డి, గాదరి రమేష్ , కమ్మంపాటి వెంకటయ్య, నర్సింహ, పున్నపురాజు వెంక న్న, మల్గ శంకర్, ప్రభాకర్‌రెడ్డి,మారయ్య , రామరావు, శేఖర్, తిర్పతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రసేనరెడ్డి, శంకర్, రంగరావు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలు షురూ
మంగళవాయిద్యాలు... అర్చకుల వేదమంత్రోచ్ఛరణలతో నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యజ్ఞశాలను ప్రారంభించారు. - న్యూస్‌లైన్, నార్కట్‌పల్లి నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంగళవాయిద్యాలు.. అర్చకుల మంత్రోచ్ఛరణల నడు మ నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఏకాదశ రుద్రాభిషేకం, నీరాజన మంత్ర పుష్పాలు తదితర ప్రత్యేక పూజలను వేద పండితుడు అల్లవరపు సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగట్టే నర్సింహారెడ్డిలకు దేవస్థానం ఈఓ విజయరాజు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిథులను దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఘనంగా సన్మానించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి : కోమటిరెడ్డి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. కల్యాణ మండపాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోటి రూపాయలతో కల్యాణ మండపం పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. దేవాలయానికి నిద్రచేసేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్‌రోడ్ మలుపులో 30 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని, రాజగోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. అలాగే యజ్ఞశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విజయరాజు, సర్పంచ్‌లు పుల్లెంల అచ్చాలు, కొండూరు శంకర్ దేవస్థానం మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నేతగాని కృష్ణ, మండల ప్రత్యేక అధికారి మదనాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గుర్రం సురేశ్, బెరైడ్డి కరుణాకర్‌రెడ్డి, నర్సింహాచారి, వడ్డె భూపాల్‌రెడ్డి, శిగ విష్ణు, బత్తుల ఊషయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పసునూరి శ్రీను, దోసపాటి విష్ణుమూర్తి, ప్రభాకర్‌రెడ్డి, వెంకటయ్య, దొడ్డి నర్సింహ, గాదరి రమేష్, నర్సింహ, సత్తయ్య, సైదులు, సుజాత, జహంగీర్, వీఆర్వో యాదయ్య పాల్గొన్నారు. ప్రొటోకాల్ పాటించని ఆలయ ఈఓ చెర్వుగట్టులోని రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ విజయరాజు ప్రొటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ మల్గు రమణబాలకృష్ణ ఆరోపించారు. గురువారం చెర్వుగట్టులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో సర్పంచ్ పేరు పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా సర్పంచ్ అయినందునే తనను అవమాన పర్చినట్లు పేర్కొన్నారు. గతంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఈఓ పట్టించుకోవడంలేదన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఉపసర్పంచ్ నారాయణరెడ్డి, వేణు, అది చంద్రయ్య, చొల్లేటి కోటి, మేడి శంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వామివారి పాదాల వద్ద ఆలయ నిర్మాణం రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద త్వరలో కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మించి అభివృద్ధి చేయనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శ్రీపార్వతీజడల రామలింగేశ్వర స్వామి పాదాల వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. దేవాలయానికి వచ్చే భక్తులు స్వామి వారి పాదాలను దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండూరు శంకర్, ఉప సర్పంచ్ వడ్డె అండమ్మ, భూపాల్‌రెడ్డి, మారెడ్డి యాదగిరిరెడ్డి, సూర ముత్యాలు, రాములు, మరగోని సైదులు, ఎల్లెందులు లింగస్వామి, పాపులు, భిక్షం, మేడి శంకర్, శ్రీను, శంకరయ్య పాల్గొన్నారు. -
ఆరాధన
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా బుధవారం నల్లగొండ లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీనగర్‌లో రథోత్సవాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. జేసీ హరిజవహర్‌లాల్ సతీసమేతంగా దర్శించి పూజలు చేశారు. ఈ రథ ఊరేగింపును రామగిరి, క్లాక్‌టవర్, ఆర్పీరోడ్డు, ఎన్జీ కాలేజీ మీదుగా చెర్వుగట్టుకు మళ్లించారు. ఊరేగింపులో ఒంటెలు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనాచారి, డిప్యూటీ కమిషనర్ విజయరాజు, చెర్వుగట్టు సర్పంచ్ రమణబాలకృష్ణ, శంకర్‌గౌడ్, రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, రాజిరెడ్డి, సుబ్రమణ్య దీక్షితులు, పి. రామలింగేశ్వరశర్మ, సురేష్ పాల్గొన్నారు. -
పురాతన ఆలయాలకు నూతన శోభ
బబ్బెళ్లపాడు (చందర్లపాడు రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని బబ్బెళ్లపాడు గ్రామంలోని పురాతన చెన్నకేశవ, రామలింగేశ్వరస్వామి ఆలయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఆలయాల పరిరక్షణ చేయాల్సిన దేవాదాయ శాఖ నిధుల లేమి సాకుతో కేవలం పర్యవేక్షణకే పరిమితం కావడంతో సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో దాతల విరాళాలతోనే ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. ఒకే ప్రాకారంలో మూడు ఆలయాలు... గ్రామంలోని ప్రధాన రహదారిని అనుకుని ఒకే ప్రాకారంలో మూడు ఆలయాలు ఉండటం ఇక్కడి విశిష్టత. రామలింగేశ్వర ఆలయం (శివాలయం), చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు ఆంజనేయునికి ఇక్కడ గుడులు నిర్మిం చారు. ముక్త్యాల జమీందారుల పాలన లో ఉన్న సమయంలోనే ఈ ఆలయాలను దాదాపు మూడొందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ ఆజమాయిషీలోకి వస్తే ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 1965లో అప్పటి గ్రామ సర్పంచి బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి న్యాయ పోరాటం చేయడంతో ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు నైవేద్యం కరువు... దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయం లో దాదాపు పదేళ్లకు పైగా నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు పూజారులకు భత్యాలు, నిర్వహణ పూర్తిగా లేకుండా పోయాయి. దీంతో గ్రామస్తులు కలసి ఆలయాలకు ఉన్న 41 ఎకరాలను దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా కౌలు వేలం నిర్వహించి ఆలయ నిర్వహణ చేపట్టారు.కౌలు వేలం ద్వారా నిల్వ చేసిన రూ. 7 లక్షలతో పాటు మరిన్ని నిధులు మంజూరు చేసి ఆలయాలను పునర్నిర్మాణం చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. నిధులు లేవన్న దేవాదాయ శాఖ... ఆలయాల పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయలేమని, కామన్ గుడ్ ఫండ్ ఆలయానికి మంజూరయ్యే అవకాశం లేదని దేవాదాయ శాఖాధికారులు ఖరాఖండిగా తేల్చారు. అయితే విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ రమణాచారి దృష్టికి తీసుకువెళ్లి డోనర్స్ స్కీం ద్వారా ఆలయాన్ని పునర్నిర్మించుకునేలా గ్రామస్తులు అనుమతి సాధించుకున్నారు. రూ. 30 లక్షల పనులు... చెన్నకేశవ, రామలింగేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాల పునరుద్ధరణతో పాటు ఆలయ ఆవరణంలో నవగ్రహా మండపం నిర్మించడం, ప్రతిష్టోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం రూ. 50 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేసి, కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. గ్రామంలో కొద్ది మొత్తంలో నిధులు సమకూరినప్పటికీ, పలు సంస్థలు, ప్రముఖుల నుంచి దాదాపు రూ. 25 లక్షల మేర నిధులు సమీకరించినట్లు పునర్నిర్మాణ కమిటీ కన్వీనర్ బబ్బెళ్లపాటి సాయి తెలిపారు. ముడి ఆలయాల నిర్మాణం జరిగిందని, గోపురాల నిర్మాణం, ప్లాస్టరింగ్, ప్రహారీ నిర్మాణం, శిల్పాల పనుల కోసం మరో రూ. 20 లక్షల మేర నిధుల అవశ్యకత ఉందన్నారు. ఆలయానికి తుది రూపు ఇచ్చేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.