Rashtriya Swayamsewak Sangh (RSS)
-
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
ఆ ఆదేశాలు సరికాదు: ఆరెస్సెస్
చెన్నై: తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. మద్రాస్ హైకోర్టు కవాతు నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించడంపై హిందూ సంఘాల విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడుతూ మొత్తం 50 ప్రాంతాలకుగానూ.. 44 ప్రాంతాల్లో కవాతు నిర్వహణకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. మతపరమైన సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆరు చోట్ల మాత్రం ఇప్పుడు మార్చ్ నిర్వహించొద్దని.. కావాలనుకుంటే మరో రెండు నెలల తర్వాత కవాతు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఆ 44 ప్రాంతాల్లో కూడా రోడ్లపై, ఇతర ప్రాంగణాల్లో కాకుండా.. మైదానాలు, స్టేడియం లేదంటే ఆడిటోరియాల్లో మాత్రమే నిర్వహించాలని షరతు విధించింది. కవాతులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మద్రాస్ హైకోర్టు, ఆరెస్సెస్‌కు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఇతర ప్రాంతాల్లో రూట్ మార్చ్‌లను నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాడులో మాత్రం ఇలా సమ్మేళన ప్రాంగణంలో నిర్వహించుకోవడం సబబు కాదని భావిస్తోంది. అందుకే కవాతును వాయిదా వేసుకోవడంతోపాటు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమైంది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం కేవలం మూడు చోట్ల మాత్రమే కవాతులను నిర్వహణకు అనుమతి ఇవ్వగా.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆరెస్సెస్‌కు ఊరట లభించింది. ఓ ముస్లిం రాజకీయ సంఘంపై కేంద్రం నిషేధం విధించడం, కొయంబత్తూరు పేలుళ్ల నేపథ్యంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని తమిళనాడు పోలీస్ శాఖ.. ఆరెస్సెస్ కవాతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ -
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్ఎస్ఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!) -
వివక్ష వద్దు.. 130 కోట్ల జనం మనోళ్లే!
నాగ్‌పూర్: దేశం యావత్తూ మహమ్మారి కరోనాతో పోడుతుంటే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి వివక్షా లేకుండా బాధితులందరికీ సహాయం చేయాలని ఆర్ఎస్ఎస్ శ్రేణులను కోరారు. అదేవిధంగా దేశం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగ్‌పూర్ నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్లైన్లో తన సందేశం వినిపించారు. (చదవండి: ఆ రైలు అదే.. కిమ్ అక్కడే ఉండొచ్చు!) దేశంలో ఉన్న 130 కోట్ల మంది భరతమాత బిడ్డలేనని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భరతమాతను ముక్కలు చేస్తున్నామంటూ కొందరు ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తారని, వాటిల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చేసే తప్పిదాలకు మొత్తం సమాజాన్నే నిందించడం మంచిది కాదని తబ్లిగీ ప్రార్థనలను ఉద్దేశించి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. (చదవండి: బుసలు కొడుతున్న కరోనా) -
‘తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలమైన శక్తి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. బర్కత్‌పుర కేశవ నిలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని రమేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 1600 క్లస్టర్లు ఉన్నాయని.. అన్ని క్లస్టర్లకు ఆర్ఎస్ఎస్ చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు. భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. దీనికి ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో పాటు, వక్తగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని రమేష్ తెలిపారు. 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్కి హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట -
ఆర్ఎస్ఎస్ తెలంగాణ బాట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలతో రాష్ట్రంలో 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిం చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఉనికి కనిపిస్తున్నా మొత్తంగా చూస్తే మాత్రం నామ మాత్రంగానే ఉంది. హిందుత్వ భావ జాలాన్ని గ్రామస్థాయి వరకు తీసు కెళ్లేందుకు తెలంగాణ అను వైన ప్రాంత మే అయినా ఇప్పటిదాకా తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావనతో ఇప్పుడు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. 2025కి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని ఘనంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ శివార్లలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగ ణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ హాజరు కానున్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే దాదాపు ఏడున్నర వేల మంది కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి.... రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్ఎస్ఎస్ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం దాని ప్రత్యేకత. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆర్ఎస్ఎస్ తాజా ఆలోచన. దీనిపై మోహన్ భగవత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు లక్షల సభ్యత్వాల్లో సగం విద్యార్థులవి ఉండేలా చూడనున్నారు. ఇందుకోసం వారిని ఆకట్టుకునే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. సామాజిక అంశాలకు సంబంధించి పర్యావరణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విరివిగా మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సమ రసత కార్యక్రమం పేరుతో గ్రామాల్లో అన్ని కులాల వారు ఆలయ పూజల్లో పాల్గొనేలా చేయడంతోపాటు ఊరంతటికీ ఒకే శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఇక గ్రామ వికాస కార్యక్రమాల పేరిట మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి రక్షణగా ఉండటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోవుల వృద్ధిపై ముమ్మర ప్రచారం చేయనుంది. స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహించనుంది. కుటుంబాల్లో కలతల నివారణ, వృద్ధుల ఆదరణ, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించే కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. సోషల్ మీడియా అనర్ధాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. తద్వారా ప్రజలకు చేరవయ్యేలా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత... ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ స్థానికంగా ముఖ్య శిక్షక్, ఆపై కార్యకర్తలకు శిబిరాలు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్‌లలో వాటిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. 2017లో కరీంనగర్లో సాధారణ శిబిరం, ఘట్కేసర్ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా రాష్ట్రవ్యాప్త శిబిరం మాత్రం ఇప్పుడే జరగనుంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్కు 2,500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,200కు పెరిగింది. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యం. శిబిరంలో భద్రాద్రి నగరం, యాదాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, జోగులాంబ నగరం, భాగ్యలక్ష్మి నగరం పేరుతో ఐదు విభాగాలు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే కార్యకర్తలకు బస ఏర్పాటు చేశారు. 24న ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశాలు ఉంటాయి. 25న ఉదయం సమావేశం తర్వాత కార్యకర్తలు నాలుగు మార్గాల్లో ఎల్బీ నగర్‌కు, అక్కడి నుంచి కవాతు ద్వారా సరూర్‌నగర్ మైదానానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు కూడా ఆయన ప్రధాన వేదిక మీదుగా మరోసారి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు శ్యామ్‌కుమార్, నాగరాజు, దూసి రామకృష్ణ, తిప్పేస్వామి, దక్షిణామూర్తి, కాచం రమేశ్, దేవేందర్ తదితరులు హాజరుకానున్నారు. -
కంగ్రాట్స్ ఇమ్రాన్ ఖాన్..థాంక్యూ!
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరును లేవనెత్తి భారత్-ఆరెస్సెస్ పర్యాయ పదాలని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచానికి చాటిచెప్పారని ఆ సంస్థ కార్యకర్త కృష్ణ గోపాల్ అన్నారు. తమకు ఇంత గొప్ప సహాయం చేసినందుకు ఆయనను తప్పక అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో శుక్రవారం తొలిసారిగా ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆరెస్సెస్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ‘భారత్‌లో ఆరెస్సెస్ అనే సంస్థ ఉంది. ఆ దేశ ప్రధాని మోదీ అందులో జీవితకాల సభ్యుడు. హిట్లర్, ముస్సోలినిల స్ఫూర్తితో ఏర్పడిన ఆ సంస్థ.. ముస్లింలు, క్రిస్టియన్లపై ద్వేషాన్ని పెంచుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించిన కృష్ణ గోపాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆరెస్సెస్ భారత్ కోసం భారత్‌లో మాత్రమే పనిచేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా మాకు శాఖలు లేవు. అయినా పాకిస్తాన్‌కు మాపై కోపం ఎందుకు? వాళ్లు మాపై కోపంగా ఉన్నారంటే భారత్‌పై కోపంగా ఉన్నట్లే. ఆరెస్సెస్, భారత్ పర్యాయపదాలుగా మారాయని ఇమ్రాన్ మాటల్లో స్పష్టమైంది. నిజానికి ప్రపంచం కూడా మమ్మల్ని ఇలాగే గుర్తించాలని మేము ఆశించాం. ఆరెస్సెస్ పేరును ప్రస్తావించి ఇమ్రాన్ చాలా గొప్ప సహాయం చేశారు. మా పేరును ప్రపంచవ్యాప్తం చేశారు. ధన్యవాదాలు. ఉగ్రవాద బాధితులకు ఆరెస్సెస్ అండగా ఉంటుంది. బహుశా అందుకే ఇమ్రాన్‌కు మాపై కోపం వస్తున్నట్లుంది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తమ గురించి ప్రచారం చేసింది చాలు అని, పాకిస్తాన్ పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. #WATCH RSS leader Dr Krishna Gopal Sharma says, "RSS is only in India. We don't have any branches anywhere in world. If Pakistan is angry with us it means they are angry with India. RSS & India are synonyms now. We also wanted the world to see India & RSS as one." pic.twitter.com/uuYHdPF71B — ANI (@ANI) September 28, 2019 -
మోడీని విమర్శిస్తే సహించం: ఆర్ఎస్ఎస్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని విమర్శస్తే సహించేది లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు సురేష్ సోని భారతీయ జనతా పార్టీలోని అంతర్గత శ్రేణులను శనివారం హెచ్చరించారు. భారత ప్రధాన పదవికి మోడీ సరైన వ్యక్తి అని అందరు భావిస్తున్నారని, ఇటువంటి సమయంలో ఆయనపై విమర్శలు తగవని సోని అభిప్రాయపడ్డారు. ఎవరైనా మోడీపై విమర్శలు చేసినా, పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని అతిక్రమిస్తే వారిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు బలంగా వీస్తునందున, కొద్దిగా కష్టపడితే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. దీంతో అవినీతి ఊబిలో కురుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి దేశ ప్రజలను విముక్తి చేయవచ్చన్నారు. అంతేకాకుండా బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే భారత పౌరులకు అత్యంత సమర్థవంతమైన పాలన అందించగలుగుతామన్నారు. భారతీయ జనతాపార్టీ తిరిగి దేశపాలన పగ్గాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ శ్రేణులకు సోని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనాతా పార్టీ ఢీల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులోభాగంగా లోక్‌సభలో అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో సీట్లు కొల్లగొడితే ప్రధాని కుర్చీని కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు సురేష్ సోని రెండు రోజుల పర్యటనలో భాగంగా యూపీలో పర్యటిస్తున్నారు. శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్‌తో కలసి ఆయన ప్రసంగించారు.