సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) బలమైన శక్తిగా ఉందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ అన్నారు. బర్కత్పుర కేశవ నిలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్ పలు కార్యక్రమాలు చేపడుతోందని ఆయన తెలిపారు. 2024 నాటికి వంద ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని రమేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 1600 క్లస్టర్లు ఉన్నాయని.. అన్ని క్లస్టర్లకు ఆర్ఎస్ఎస్ చేరుకోవలనే లక్ష్యంతో విజయ సంకల్ప శిబిరం పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అతిథిగా రాబోతున్నారని రమేష్ తెలిపారు.
భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో ‘సార్వజనిక సభ’ నిర్వహిస్తున్నామని రమేష్ చెప్పారు. దీనికి ముఖ్య అతిధులుగా ఐఐటీ హైదరాబాద్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డితో పాటు, వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని రమేష్ తెలిపారు. 2024 లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ప్రతి బస్తీకి ఇప్పటికే చేరుకోగలిగామని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కి హైదరాబాద్ నగరంలో 800 శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 1005 సేవ కార్యక్రమాలు చేపట్టామని రమేష్ వెల్లడించారు. తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ బాట
Comments
Please login to add a commentAdd a comment